Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

రాష్ట్రంలో పోలీసు రాజ్యం

. జగన్‌ కంటే పెద్ద నియంత డీజీపీ
. ప్రతి సమస్యపై హైకోర్టుకెళ్లాలా?
. జీవో`1 సాకుతో ప్రతిపక్షాలకు ఆటంకాలు
. ఫిబ్రవరి 8 నుంచి ప్రాజెక్టుల సందర్శన
. స్మార్ట్‌ మీటర్ల పేరుతో ప్రజలపై భారం
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శ

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: రాష్ట్రాన్ని పోలీసు రాజ్యంగా మార్చి దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని, జగన్‌ ప్రభుత్వం అనుసరిస్తున్న రాజ్యాంగ విరుద్ధ చర్యలపై అన్ని పార్టీలు, ప్రజాసంఘాలను కలుపుకుని సమైక్యంగా ఉద్యమిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ వెల్లడిరచారు. విజయవాడ దాసరిభవన్‌లో గురువారం రామకృష్ణ విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదా, విభజన హామీల సాధన కోసం విద్యార్థి, యువజన సంఘాలు తలపెట్టిన బస్సుయాత్రకు జగన్‌ ప్రభుత్వం జీవో నంబరు1 పేరుతో అడ్డంకులు సృష్టించడాన్ని రామకృష్ణ తీవ్రంగా తప్పుపట్టారు. బస్సుయాత్రకు అనుమతి కోసం డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డికి విద్యార్థి, యువజన సంఘాల నేతలు లేఖ ఇచ్చినప్పటికీ డీజీపీ నాన్చుడు ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. అసలు అనుమతిస్తారా?, లేదా? అనే విషయాన్ని డీజీపీ తేల్చిచెప్పడం లేదన్నారు. సీఎం జగన్‌ కంటే నియంతలా డీజీపీ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జీవో1 అందరికీ సమానమేననీ, ఎవరిపైనా వివక్ష ఉండబోదని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన ప్రకటనకూ, ఆచరణలో అధికారుల వ్యవహరిస్తున్న తీరుకూ పొంతన లేదన్నారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల్లో భాగంగా ప్రతి ఒక్కరికీ నిరసన ప్రకటించే అవకాశముందని, దానికి విరుద్ధంగా జగన్‌ ప్రభుత్వం వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. నాడు కడప స్టీలుప్లాంట్‌ కోసం సీపీఐ చేపట్టిన పాదయాత్రకూ జగన్‌ ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తే హైకోర్టుకు వెళ్లి అనుమతి తీసుకున్నామని గుర్తుచేశారు. ప్రతిపక్షనేత చంద్రబాబు తన సొంత నియోజకవర్గం కుప్పం పర్యటనకూ పోలీసులు అడ్డంకులు సృష్టించారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీజేసిన జీవో నంబరు1ను హైకోర్టు సస్పెండ్‌ చేసిందని, దానిపై ఈనెల 20వ తేదీన ప్రభుత్వం తరపున వాదనలు కొనసాగాల్సి ఉందన్నారు. అప్పటివరకు ప్రభుత్వం ఆగలేక ఆ జీవోపై సుప్రీంకోర్టుకు వెళ్లిందని మండిపడ్డారు. ప్రభుత్వ విధానాలపై అన్ని పార్టీలు, ప్రజాసంఘాలతో ఐక్య పోరాటాన్ని ముందుకు తీసుకువెళ్తామన్నారు. ఇదే అంశంపై ఇప్పటికే చంద్రబాబుతో తాను భేటీ అయ్యానని తెలిపారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుతోపాటు మిగిలిన వామపక్ష, ప్రతిపక్ష పార్టీలతో చర్చిస్తున్నామని వివరించారు.
జగన్‌ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పదేపదే ప్రజలపై భారాలు మోపుతున్నారని రామకృష్ణ విమర్శించారు. స్మార్ట్‌ మీటర్ల పేరుతో ప్రజలపై రూ.13వేల కోట్ల భారం మోపడాన్ని తీవ్రంగా తప్పుపట్టారు. అసలు స్మార్ట్‌ మీటర్లు అవసరమా?, అదానీకి లబ్ధి చేకూరేలా జగన్‌ ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. జగన్‌ బినామీల కోసమే ఇదంతా చేస్తున్నారన్నారు. దీనిపై విద్యుత్‌ నియంత్రణ మండలికి లేఖ రాశానని చెబుతూ భారాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులు అన్నీ ఆగిపోయాయన్నారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు పోలవరం, వెలిగొండ తదితర ప్రాజెక్టులలో పురోగతి లేదని వివరించారు. ప్రాజెక్టులు పూర్తికానందున ఉత్తరాంధ్ర, రాయలసీమ వాసులకు తాగు, సాగునీటి సమస్యలు అధికమయ్యాయన్నారు. ఫిబ్రవరి 8 నుంచి 14 వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులను సీపీఐ బృందం సందర్శిస్తుందన్నారు. మైనారిటీ నాయకులు ఫారూఖ్‌ షుబ్లీ మాట్లాడుతూ జీవో నంబర్‌ 1కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రామకృష్ణకు అన్ని వర్గాల ప్రజలు అండగా ఉంటారన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అక్కినేని వనజ, విజయవాడ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img