Saturday, September 23, 2023
Saturday, September 23, 2023

రాష్ట్రపతిని అవమానించడం తగదు

. అమిత్‌షా, జగన్‌ జేబు సంస్థ సీబీఐ
. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ విమర్శ

విశాలాంధ్ర బ్యూరో – కడప: ప్రపంచాన్ని విస్తుగొలిపే సంఘటనలు భారతదేశంలో జరుగుతున్నాయని, ముఖ్యంగా నూతన పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతి ద్రౌపదిముర్ము లేకుండా ప్రారంభించడం విస్మయంతో పాటు ఆశ్చర్యం కలిగిస్తోందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ విమర్శించారు. స్వతంత్ర ప్రతిపత్తి గల దర్యాప్తు సంస్థ సీబీఐ కేంద్ర హోంమంత్రి అమిత్‌షా, ఏపీ సీఎం జగన్‌ జేబు సంస్థగా మారిందని వ్యాఖ్యానించారు. స్థానిక సీపీఐ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో రామకృష్ణ మాట్లాడారు. అనేక బిల్లులు పార్లమెంటులో ఆమోదం పొందుతాయని, చివరికి రాష్ట్రపతి సంతకంతోనే చట్టాలుగా మారతాయని రామకృష్ణ చెప్పారు. ఇంతటి ప్రాధాన్యత గల రాష్ట్రపతికి మోదీ సర్కారు విలువ ఇవ్వకపోవడాన్ని క్షమించరాని నేరంగా ఆయన అభివర్ణించారు. ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటిస్తూ గిరిజన మహిళను రాష్ట్రపతిగా చేసే సత్తా బీజేపీకి మాత్రమే ఉందని గొప్పగా చెప్పుకున్నారని, ఇప్పుడు మాత్రం ఆమెను పరిగణనలోకి తీసుకోవడంలేదని మండిపడ్డారు. రాష్ట్రపతిని ఆహ్వానించకపోవడాన్ని ప్రతిపక్షాలన్నీ ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నాయన్నారు. రాష్ట్రపతితో పార్లమెంటు భవనం ప్రారంభించాలని 21 ప్రతిపక్షాలు సూచించినా మోదీ సర్కారు పట్టించుకోలేదని ఆరోపించారు. దీనిని రాజ్యాంగ వ్యతిరేక చర్యగా రామకృష్ణ అభివర్ణించారు. ద్రౌపది ముర్ము గిరిజన మహిళ కాబట్టే పట్టించుకోలేదన్నారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా మాత్రమే ఈ అన్యాయాన్ని ఘాటుగా విమర్శిస్తున్నారన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు మోదీని బలపరచడం విడ్డూరంగా ఉందన్నారు. రాజకీయంగా భయపడుతున్నారో…స్వప్రయోజనాల కోసం ఆరాటపడుతున్నారో వారికే తెలియాలన్నారు. సీబీఐ, ఈడీ, ఐటీ, గవర్నర్ల వ్యవస్థను మోదీ సర్కారు ఇష్టానుసారం వాడుకుంటున్నదని రామకృష్ణ ఆరోపించారు. స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలను స్వప్రయోజనాలకు వాడుకోవడం రాజ్యాంగానికి విరుద్ధమన్నారు. సీబీఐని చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. ఇందుకు వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసే నిదర్శనమన్నారు. కేంద్రమంత్రి అమిత్‌షా, జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో సీబీఐను జేబు సంస్థగా వాడుకుంటున్నారన్నారు. మద్యం కుంభకోణం పేరుతో దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌ను 9 గంటలు విచారించిన సీబీఐ… ఉపముఖ్యమంత్రి సిసోదియాను ఏకంగా జైలుకే పంపిందని, కానీ కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి విషయంలో ఎందుకు తాత్సారం చేస్తున్నదో అర్థం కావడం లేదన్నారు. మద్యం కుంభకోణంలో వంద కోట్ల అవినీతి జరిగిందని సీబీఐ నానాహంగామా చేస్తోందని, ఏపీలో నెలకు వందకోట్ల ఇసుక దందా, మట్టి దందా జరుగుతోందని, ఈ విషయాలు సీబీఐకి పట్టవా అని ఆయన నిలదీశారు. కర్నూలులో సీబీఐ వ్యవహారశైలి విస్మయం కలిగిస్తోందన్నారు. కర్నూలుకు వచ్చిన సీబీఐ అధికారులు అతిథిగృహంలో కూర్చుని జుట్టుపీక్కోవడమేమిటని ప్రశ్నించారు. జర్నలిస్టులపై దాడుల గురించి ఎస్పీ, ఏఎస్పీలకు వినతిపత్రం ద్వారా తెలిపినా చర్యలు శూన్యమన్నారు. వైఎస్‌ వివేకానందరెడ్డి కేసుతో సీఎం జగన్‌కు సంబంధం ఉన్నట్లు సీబీఐ కోర్టుకు చెప్పిందని, దీనిపై సీఎం జగన్‌ స్పందించాలని, ప్రజలకు వివరణ ఇవ్వాలని రామకృష్ణ డిమాండ్‌ చేశారు. ఇలాంటి విషయాల్లో తగుదునమ్మా అంటూ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి జోక్యం చేసుకోవడం ఏమిటని ప్రశ్నించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ ప్రతిపక్ష పార్టీలను అణచివేస్తున్న సీఎం జగన్‌కు తగిన గుణపాఠం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని రామకృష్ణ అన్నారు. ఈ విషయాలపై చర్చావేదికలు నిర్వహిస్తామని, మేధావులు, నిపుణులను భాగస్వాములను చేస్తామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దమననీతిని ఎండగడతామని ఆయన హెచ్చరించారు. విలేకరుల సమావేశంలో సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, నగర కార్యదర్శి ఎన్‌.వెంకటశివ, జిల్లా కార్యవర్గ సభ్యుడు గంగా సురేశ్‌ పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img