Friday, December 1, 2023
Friday, December 1, 2023

రాష్ట్ర సమస్యలే కీలకం

విభజన హామీలు, విశాఖ ఉక్కు, కృష్ణాజలాలపై చర్చించండి
దిశ చట్టం, పోలవరం అంచనాల ఆమోదానికి పట్టుబట్టండి
ఎంపీలకు సీఎం జగన్‌ దిశానిర్దేశం

ప్రత్యేక హోదాతోపాటు విభజన హామీల్లో అమలు కాని అంశాలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ, దిశ చట్టం, పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పెరిగిన అంచనాల ఆమోదానికి, కృష్ణా జలాలపై ఏపీ హక్కుల రక్షణ తదితర కీలక అంశాలపై పార్లమెంటు ఉభయసభల్లో గళమెత్తాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో జగన్‌ అధ్యక్షతన గురువారం వైఎస్సార్‌సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈ భేటీకి పార్టీ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు హాజరయ్యారు. పార్లమెంట్‌ సమావేశాల్లో వైసీపీ ఎంపీలు అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం జగన్‌ సభ్యులకు దిశానిర్దేశం చేశారు. కేంద్ర ప్రభుత్వంపై ఏ విధంగా ఒత్తిడి తీసుకురావాలనే దానిపై ఎంపీలకు అంశాల వారీగా సీఎం వివరించారు. అనంతరం వైసీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి సమావేశం వివరాలు మీడియాకు వెల్లడిరచారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి పెరిగిన అంచనాల ప్రకారం రూ.55,656 కోట్ల ఆమోదానికి పట్టుబడతామని విజయసాయిరెడ్డి చెప్పారు. ఆర్‌ అండ్‌ ఆర్‌ ప్యాకేజీకి రూ.33 వేల కోట్లు అవసరమని, ఈ నిధులను కేంద్రం సత్వరమే విడుదల చేయాలన కోరతామన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం కింద ఒక్క ఎకరం కూడా అదనపు ఆయుకట్టు లేదని, శ్రీశైలంలో 881 అడుగులు ఉంటేనే పోతిరెడ్డిపాడు నుంచి 44వేల క్యూసెక్కుల నీటిని తరలించడానికి వీలుంటుంది కనుక…ప్రస్తుతం ఆ అవకాశం లేనందున 800 అడుగులలోనే ఈ ఎత్తిపోతల పథకానికి అనుమతించాల్సిందిగా కేంద్రాన్ని కోరతామన్నారు. తెలంగాణలో పెట్టిన అన్ని లిప్టులు 800 అడుగుల లోపలే నీటిని తీసుకునేలా ఉన్న విషయాన్ని వివరిస్తామన్నారు. అన్నింటికీ మించి ఏపీకి కేటాయించిన నీటి హక్కుల రక్షణ కోరుతూ కృష్ణా ప్రాజెక్టులన్నీ కేంద్రం పరిధిలోకి తీసుకు రావాలని కోరతామన్నారు. వంశధార ప్రాజెక్టుకు సంబంధించి ఏపీకి అనుకూలంగా తీర్పు వచ్చినందున దాన్ని నోటిఫై చేయాలని అడుగుతామన్నారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను ఉపసంహరించుకుని దీన్ని స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా(సెయిల్‌)కో, ఎన్‌ఎండీసీలోనో విలీనం చేస్తే బాగుంటుందన్న విషయాన్ని నొక్కి వక్కాణిస్తామన్నారు. జాతీయ ఆహారభద్రతా చట్టం అమల్లో లొసుగులు కారణంగా రేషన్‌ కార్డులు కేంద్రం ఎన్నైతే ఆమోదించిందో అంతవరకు మాత్రమే రేషన్‌ సబ్సిడీ ఇస్తున్నందు వల్ల ఏపీకి అన్యాయం జరుగుతోందని, దీనివల్ల రేషన్‌ బియ్యానికి సంబంధించి ఏపీకి రూ.5056 కోట్ల బకాయిలున్నాయని, వీటిని రాష్ట్రానికి చెల్లించాల్సిందిగా పార్లమెంటులో డిమాండ్‌ చేస్తామన్నారు. దిశ చట్టం చాలాకాలంగా కేంద్రం దగ్గర పెండిరగ్‌లో ఉందని, దాన్ని ఆమోదించాలని విజ్ఞప్తి చేస్తామన్నారు. రాష్ట్రంలో కొత్తగా పేదల కోసం నిర్మిస్తున్న 17వేల లేఅవుట్లలో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం నుంచి ఆర్థిక సహాయం అందించాలని అభ్యర్థిస్తామన్నారు. ఉపాధిహామీ పథకం కింద రావల్సిన రూ.6750 కోట్ల బకాయిలు ఇప్పించాలని, గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు, కరోనా వల్ల రాష్ట్రానికి జరిగిన ఆర్థిక నష్టాలు తదితర అంశాలన్నింటినీ పార్లమెంటులో ప్రస్తావిస్తామని విజయసాయిరెడ్డి తెలిపారు. నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజు గురించి సమావేశంలో చర్చించారా? అని అడుగగా అలాంటి వ్యక్తి గురించి సీఎం చర్చించాలా? విలువల్లేని వ్యక్తి ఏదో మాట్లాడితే అది తమ స్థాయిలో తాము చూసుకోగలమని, సీఎంతో చర్చించాల్సినంత పెద్ద అంశం కాదని ఆయన కొట్టిపారేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img