Monday, September 26, 2022
Monday, September 26, 2022

రుణభారతం

మోదీ హయాంలో అప్పులు 111.34 శాతం పెరుగుదల

తగ్గిన విదేశీ పెట్టుబడులు
పబ్లిక్‌ డెట్‌ మేనేజ్‌మెంట్‌ నివేదిక వెల్లడి

న్యూదిల్లీ: ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ పాలనలో దేశం అథోగతి పాలయ్యింది. అస్తవ్యస్త ఆర్థిక విధానాలు, ఏకపక్ష నిర్ణయాలు, రైతు, కార్మిక వ్యతిరేక చర్యలు, విద్య కాషాయీకరణ, మతోన్మాద, హింసాత్మక ధోరణులతో అల్లాడిపోతోంది. పారదర్శక పాలన అంటూ ప్రగల్భాలు పలికే నరేంద్ర మోదీ పేద వర్గాల నుంచి అడ్డంగా దోచి బడా కార్పొరేట్‌లకు కట్టబెట్టే విధానాలను యధేచ్ఛగా కొనసాగిస్తున్నారు. ప్రజలకు మేలు చేయకపోగా, దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారు.
దేశంపై ఉన్న మొత్తం అప్పు 2022 మార్చి 31 నాటికి రూ.1,33,22,727 కోట్లకు చేరింది. ఈ త్రైమాసికం(2022 జనవరి-మార్చి)లో అప్పు 3.74 శాతం పెరిగింది. మోదీ ప్రభుత్వం గద్దెనెక్కిన నాటికి దేశ అప్పు రూ.63,03,914 కోట్లు ఉండగా, ఈ ఏడేళ్లలో మోదీ పాలనలో దేశం అప్పు 111.34 శాతం పెరిగింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన పబ్లిక్‌ డెట్‌ మేనేజ్‌మెంట్‌ నివేదిక స్పష్టం చేసింది. మొత్తం అప్పులో విదేశీ అప్పు రూ.8,32,409 కోట్లు కాగా, అంతర్గత అప్పు రూ.1,14,62,343 కోట్లు (86.03 శాతం) అని పేర్కొంది. అంతర్గత రుణ భారంలో 70.02 శాతం (80.26 లక్షల కోట్లు) వాటా మార్కెట్‌ రుణాలదే ఉంది. చిన్న పొదుపు మొత్తాలను చూపి తీసుకున్న రుణాలు రూ.18,83,921 కోట్ల మేర ఉన్నాయి. ఈ రుణం గత మూడు నెలల్లో 15.42 శాతానికి పెరిగింది. 2021 డిసెంబర్‌ నాటికి దేశ అప్పు రూ.1,28,41,996 కోట్లు ఉండగా, కేవలం మూడు నెలల్లో రూ.4,80,731 కోట్ల (3.74 శాతం) మేర అప్పు పెరిగింది. డిసెంబర్‌ 2021 చివరి నాటికి మొత్తం బకాయి రుణాలలో 91.60 శాతం ప్రభుత్వం అప్పు ఉండగా, 2022 మార్చి చివరి నాటికి 92.28 శాతానికి పెరిగింది. 2021 డిసెంబర్‌ చివరి నాటికి ఒక సంవత్సరం నుంచి ఐదు సంవత్సరాలలోపు మెచ్యూర్‌ అయ్యే రుణాల నిష్పత్తి 24.50 శాతం కాగా, మార్చి త్రైమాసికంలో 25.43 శాతానికి పెరిగాయి.
తగ్గిన విదేశీ పెట్టుబడులు
2021-22లో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) ప్రవాహం తగ్గింది. 2021 ఏప్రిల్‌-మార్చిలో 43,955 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు రాగా, 2022 ఏప్రిల్‌-మార్చిలో 39,290 మిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని నివేదిక తెలిపింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో కేంద్రం రూ.1.37 లక్షల కోట్ల విలువైన డేటెడ్‌ సెక్యూరిటీలను సేకరించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో రూ.3.20 లక్షల కోట్ల విలువైన డేటెడ్‌ సెక్యూరిటీలను సేకరించింది. 2022 జనవరి-మార్చి త్రైమాసికంలో కేంద్ర ప్రభుత్వం నగదు నిర్వహణ బిల్లుల ద్వారా ఎలాంటి మొత్తాన్ని సేకరించలేదు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఈ త్రైమాసికంలో ప్రభుత్వ సెక్యూరిటీల కోసం బహిరంగ మార్కెట్‌ కార్యకలాపాలను నిర్వహించలేదు. మార్జినల్‌ స్టాండిరగ్‌ ఫెసిలిటీ, స్పెషల్‌ లిక్విడిటీ ఫెసిలిటీతో సహా లిక్విడిటీ అడ్జస్ట్‌మెంట్‌ ఫెసిలిటీ (ఎల్‌ఏఎఫ్‌) కింద ఆర్‌బీఐ నికర రోజువారీ సగటు లిక్విడిటీ శోషణ త్రైమాసికంలో రూ.6.44 లక్షల కోట్లుగా ఉందని నివేదిక తెలిపింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img