. రోజుకు 800 మంది మహిళలు మృతి
. పేద దేశాల్లోనే దీన స్థితి: డబ్ల్యూహెచ్‌ఓ
జెనీవా: ప్రపంచ దేశాల్లో ప్రసూతి మరణాలపై ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తంచేసింది. ప్రతి రెండు నిమిషాలకో ప్రసూతి మరణం సంభవిస్తున్నట్లు తెలిపింది. గర్భధారణ, ప్రసవ సమయాల్లో నివారించగల కారణాలతో నిత్యం 800 మంది తల్లులు ప్రాణాలు కోల్పోవడం దయనీయమని గురువారం ఒక ప్రకటనలో వెల్లడిరచింది. తీవ్రమైన రక్తస్రావం, ఇన్ఫెక్షన్లు, అసురక్షితమైన గర్భవిచ్ఛితి పద్ధతులు, హెచ్‌ఐవీ/ఎయిడ్స్ వంటి పరిస్థితులు ఈ మరణాలకు కారణాలని, ఇవన్నీ నివారించదగినవేనని పేర్కొంది. అంతర్జాతీయ స్థాయిలో 2,87,000 ప్రసూతి మరణాలు నమోదయ్యాయని, ఈ లెక్కన 24 గంటల్లో 800, రెండు నిమిషాలకు ఒక తల్లి మృత్యుఒడికి చేరుతున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక తెలిపింది. గర్భం దాల్చిన సమయం ఆశలు, ఆకాంక్షలతో మంచి ఆలోచనలు, సానుకూల అనుభవాలతో నిండి ఉండాలిగానీ ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది భయానక అనుభవాలను ఎదుర్కోవాల్సి రావడం అత్యంత బాధాకరమని డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్ ట్రెడోస్ అధానోమ్ ఘెబ్రేయేసెస్ పేర్కొన్నారు. మహిళలు తమ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలని, గర్భం దాల్చే సమయం వంటి నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలని డబ్ల్యూహెచ్‌ఓ నొక్కిచెప్పింది. పేద దేశల్లోనే అత్యధిక ప్రసూతి మరణాలు సంభవిస్తున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ నివేదిక తెలిపింది. ఆఫ్రికాలో 70శాతం మరణాలు 2020లో నమోదు కాగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ కంటే ఇది 136 రెట్లు అధికమని నివేదిక రూపకర్త జెన్నీ క్రెస్‌వెల్ వెల్లడిరచారు. సిరియా, సోమాలియా, దక్షిణ సూడాన్, సూడాన్, యెమన్‌లో మానవతా సంక్షోభ పరిస్థితులు కొనసాగుతున్న క్రమంలో అంతర్జాతీయ సగటు కంటే రెట్టింపుస్థాయిలో ప్రసూతి మరణాలు నమోదవుతున్నట్లు డబ్ల్యూహెచ్‌ఓ పేర్కొంది. ఆరోగ్య సంరక్షణ ప్రతి తల్లికి లభించినప్పుడు సుఖ ప్రసవం, ఆరోగ్యకరమైన భవిష్యత్, కుటుంబంలో సుఖసంతోషాలు కలుగుతాయని ఐరాస పిల్లల నిధి యూనిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ క్యాథరీన్ రస్సెల్ అన్నారు. 2020లో అంతర్జాతీయ స్థాయిలో 1,00,000 జననాలకు సగటున 223 ప్రసూతి మరణాలు సంభవించినట్లు ఐరాస పేర్కొంది. 2000 సంవత్సరంలో 339 మరణాలు నమోదు కాగా ఈ రేటును 2030 నాటికి 70 కంటే తక్కువకు చేర్చాలన్నది ఐరాస సుస్థిరాభివృద్ధి లక్ష్యాల్లో (ఎస్‌డీజీల్లో) ఒకటి.