Tuesday, June 6, 2023
Tuesday, June 6, 2023

రెజ్లర్లపై దిల్లీ పోలీసుల దాష్టికం

లాఠీలతో కొట్టారు… దూషించారు

. క్రీడాకారుల ఆగ్రహం
. పతకాలు వెనక్కి ఇచ్చేస్తామని హెచ్చరిక
. న్యాయం చేయాలంటూ డిమాండ్‌

న్యూదిల్లీ : దిల్లీలోని జంతర్‌మంతర్‌ రణరంగంగా మారింది. తమకు న్యాయం చేయాలన్న రెజ్లర్ల దీక్ష భగ్నానికి అర్ధరాత్రి జరిగిన ప్రయత్నం ఘర్షణకు తావిచ్చింది. పర్యవసానంగా ఉద్రిక్తత నెలకొంది. వాగ్వాదం, ఘర్షణలో కొందరికి గాయాలయ్యాయి. క్రీడాకారులతో పోలీసుల అనుచిత వ్యవహార శైలిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. భారతీయ రెజ్లింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై చర్యలకు డిమాండ్‌ చేస్తూ రెజ్లర్లు ఆందోళనకు దిగారు. వారి దీక్షను భగ్నం చేసేందుకు దిల్లీ పోలీసులు బుధవారం అర్ధరాత్రి అక్కడకు వెళ్లారు. లాఠీలతో రెచ్చిపోయారు. దీంతో ఘర్షణ జరిగి కొందరికి గాయాలయ్యాయి. మహిళా రెజ్లర్లతో పోలీసుల అనుచిత ప్రవర్తనపై నిరసనకారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. తమకొచ్చిన అవార్డులు, పతకాలు వెనక్కి ఇచ్చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇలాంటి అవమానాలు భరించాల్సి వస్తే తమకు ఈ గౌరవాలతో ప్రయోజనం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం మద్దతులో ఇద్దరు రెజ్లర్లపై పోలీసులు దాడి చేసినట్లు ఆరోపించారు. ఘర్షణకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టాయి. న్యాయం చేయాలని నిరసన చేస్తున్న తమను అవమానిస్తున్నారని నిరసనకారులు అసహనానికి గురయ్యారు. పోలీసులు తమను దుర్భాషలాడుతూ వేధించారని, దుర్మార్గంగా ప్రవర్తించారని ఆరోపించారు.
వినీశ్‌ ఫోగట్‌, బజరంగ్‌ పూనియా, సాక్షి మాలిక్‌ గురువారం విలేకరులతో మాట్లాడారు. వర్షంలో నిద్రిస్తున్న రెజ్లర్లపై కొందరు పోలీసులు లాఠీలతో దాడి చేశారని బజరంగ్‌ పూనియా తెలిపారు. శిబిరం వద్ద ఒక్క మహిళా పోలీసు కూడా లేరని వినీశ్‌ ఫోగట్‌ అన్నారు. ‘వారు మమ్మల్ని ఎందుకు తోసేశారు’ అని సాక్షి మాలిక్‌, వినీశ్‌ ఫోగట్‌ విలపించారు. ఒక రెజ్లర్‌ తల పగిలిందన్నారు. మేము మా గౌరవం కోసం పోరాడుతున్నాం కానీ వారు మాతో నేరస్తుల్లా వ్యవహరిస్తున్నారు. మా పతకాలనే కాదు జీవితాలను. ఇచ్చేస్తాం. మాకు మాత్రం న్యాయం చేయండి’ అని వినీశ్‌ ఫోగట్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఏడుస్తూనే మీడియాతో మాట్లాడారు. ‘ఇలాంటి రోజులు చూడటానికా ఇన్ని పతకాలు గెలిచింద’ అని భావోద్వేగానికి లోనయ్యారు. మాజీ రెజ్లర్‌ రాజ్‌వీర్‌ మాట్లాడుతూ పరుపులు వర్షానికి తడిచిన కారణంగా మంచాలు తెస్తుంటే పోలీసులు అడ్డుకున్నారు. వినీశ్‌ను మద్యం మత్తులో ఉన్న పోలీసు ధర్మేంద్ర వేధించారు. మాతో గొడవకు దిగారు. బజరంగ్‌ పూనియా బావమరిది దుశ్యంత్‌తో పాటు రాహుల్‌కు గాయాలయ్యాయి’ అని అన్నారు. పూనియా భార్య సంగీతతోనూ పోలీసులు అనుచితంగా ప్రవర్తించారు. కనీసం వైద్యులను శిబిరం వద్దకు రానివ్వలేదని, మహిళా కానిస్టేబుళ్లు కూడా దురుసుగా వ్యవహరించారని ఆరోపించారు. ‘దిల్లీ పోలీసుల గుండాగిరీ సాగనివ్వం. మాకు మద్దతివ్వమని రైతులకు పిలుపునిస్తాం. ట్రాక్టర్లు, ట్రాలీలతో రమ్మని కోరతాం’ అని అన్నారు. ప్రతిదానినీ రాజకీయాలతో ఎందుకు ముడిపెడుతున్నారని బజరంగ్‌ పూనియా ప్రశ్నించారు. ఇది మహిళల అంశం ఈ పోరాటానికి రాజకీయాలతో ముడిపెట్టి దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. రెజ్లర్లకు న్యాయం చేయాలని సర్కార్‌ను కోరారు.
చిన్న గొడవే…: డీసీపీ ప్రణవ్‌
‘ఎమ్మెల్యే సోమనాథ్‌ భారతి అనుమతి లేకుండా మడత మంచాలతో ధర్నా ప్రాంతానికి చేరుకున్నారు. మేం జోక్యం చేసుకోగా ఆయన మద్దతుదారులు దురుసుగా ప్రవర్తించారు. ట్రక్కులో నుంచి మంచాలను దించేందుకు యత్నించారు. దీంతో చిన్నపాటి గొడవ జరిగింది. మరో ఇద్దరితో పాటు సోమనాథ్‌ భారతిని నిర్బంధించాం’ అని డీసీపీ (న్యూదిల్లీ) ప్రణవ్‌ తయాల్‌ చెప్పారు. రెజ్లర్లపై బలప్రయోగం జరగలేదని, ఘర్షణలో ఐదుగురు పోలీసు సిబ్బంది గాయపడ్డారన్నారు. సరిపడ మహిళా అధికారులు విధుల్లో ఉన్నారని, వైద్య పరీక్షలు నిర్వహిస్తే పోలీసులు మద్దం సేవించలేదని తేలిందని అన్నారు. ఒక నిరసనకారుడికి గాయం కావడంపై స్పందిస్తూ అతను వైద్యుల సలహాకు వ్యతిరేకంగా ఆసుపత్రి నుంచి వెళ్లిపోయారు. పోలీసులకు ఇంకా వాంగ్మూలం ఇవ్వలేదని తెలిపారు. అవాంఛనీయ ఘటనల నివారణకు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా దిల్లీలోని అనేక ప్రాంతాల్లో బ్యారికేడ్లు ఏర్పాటు చేశామన్నారు.
ఎమ్మెల్యే సోమనాథ్‌ భారతి అరెస్ట్‌`విడుదల
ఆప్‌ ఎమ్మెల్యే సోమనాథ్‌ భారతితో పాటు ఎంపీ దీపేంద్ర హుడా, డీసీడబ్ల్యూ చైర్‌పర్సన్‌ స్వాతి మాలివాల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రెజ్లర్లకు మద్దతు ప్రకటించేందుకు వెళ్లిన నేతలను అరెస్టు చేశారు. సోమనాథ్‌ భారతిని కపాషేరా పోలీసు స్టేషన్‌కు తరలించి కొన్ని గంటల తర్వాత విడుదల చేశారు.
మేం ఊరికే ఎలా ఉంటాం:
‘ఇప్పుడే విడుదలయ్యాం. జంతర్‌ మంతర్‌ వద్దకు వెళతాం. మన దేశానికి ఎంతో గౌరవాన్ని తెచ్చిన మన సోదరీమణులు, కుమార్తెలు తమ గౌరవం కోసం పది రోజులకుపైగా పోరాడుతుంటే మేం ఇంట్లో ఎలా కూర్చంటాం?’ అని విలేకరులతో మాట్లాడిన నేతలు అన్నారు.
చేయిచేసుకోవడం సిగ్గుచేటు: రాహుల్‌
మహిళా రెజ్లర్లపై పోలీసులు చేయిచేసుకోవడం సిగ్గుచేటని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ విమర్శించారు. దేశ కుమార్తెలపై దురగతాలు, దాడులకు బీజేపీ ఎన్నడూ వెనుకాడదని ఆరోపించారు. ‘బేటీ బచావో’ కేవలం మాటలకే పరిమితమని, దేశ క్రీడాకారులతో ఇటువంటి ప్రవర్తన సిగ్గుచేటని హిందీలో ట్వీట్‌ చేశారు. క్రీడాకారులను పోలీసులు కొడుతున్న వీడియోను ట్విట్టర్‌లో పంచుకున్నారు.
డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడిని తొలగించాల్సిందే: కాంగ్రెస్‌ డిమాండ్‌
తాజా పరిణామాల క్రమంలో డబ్ల్యూఎఫ్‌ఐ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌ను తక్షణమే పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్‌ గురువారం డిమాండ్‌ చేసింది. రెజ్లర్లు కన్నీరు పెట్టుకున్న వీడియోను కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ట్విట్టర్‌లో ట్యాగ్‌ చేశారు. మహిళా క్రీడాకారులు విలపించడం బాధాకరమని పేర్కొన్నారు. వారి వాణి వినాలని, వారికి న్యాయం చేయాలని ప్రధాని మోదీని ఆమె డిమాండ్‌ చేశారు. కాంగ్రెస్‌ నేత పవన్‌ ఖేరా స్పందిస్తూ ‘జంతర్‌ మంతర్‌ వద్దకు వెళ్లి నిరసనకారులతో మాట్లాడేందుకు 15 నిమిషాలు పడుతుంది. ఆ మాత్రం చిత్తుశుద్ధి మీకు లేకపోవడం బాధాకరం మోదీజీ. దేశ కుమార్తెలను భారత ప్రభుత్వం మోసం చేసిందని ప్రపంచం చెప్పుకునేలా చేయొద్దు’ అని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి సుప్రియా శ్రీనటే స్పందిస్తూ, ‘అమిత్‌ షా ఆడిరచే దిల్లీ పోలీసులు జంతర్‌ మంతర్‌ వద్ద అనూహ్యంగా ప్రవర్తించారు. మోదీజీ మీరు ఏ ముఖంతో కర్నాటకకు వెళ్లి మహిళాశక్తి గురించి మాట్లాడతారు? రెజ్లర్లు మీ నుంచి న్యాయాన్ని ఆశిస్తున్నారు. మీకు మనస్సాక్షి, నైతికత లేవా? మోదీ లేక అమిత్‌షా చెబితే రాజీనామా చేస్తానని బ్రిజ్‌భూషణ్‌ చెప్పిన తర్వాత కూడా ఆయన పదవిలో ఎందుకు ఉన్నారు? మోదీకి దేశ ఆడబిడ్డల గోడు పట్టదా? 2021లోనే ఆయనకు మొదటి ఫిర్యాదు అందిందని వినీశ్‌ఫోగట్‌ చెప్పారు. చర్యలు తీసుకోవడానికి మీకు ముహూర్తం కావాలా? అంటూ ట్విట్టర్‌లో ఆగ్రహం వ్యక్తంచేశారు.
అది అహంకారమే: కేజ్రీవాల్‌
అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడుతున్న రెజ్లర్లతో పోలీసులు ఘర్షణకు దిగడం క్రీడాకారులకు అవమానకరమని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. అహంకారంతోనే ఇలాంటి చర్యలకు బీజేపీ పాల్పడుతోందని, దౌర్జన్యంతో వ్యవస్థను నడపాలని చూస్తోందని ఆరోపించారు. ఆ పార్టీని అధికారానికి దూరం చేయాలని పిలుపునిచ్చారు.
పోలీసుల తీరు ఆక్షేపణీయం : మాలివాల్‌
రెజ్లర్లకు దిల్లీ మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ స్వాతి మాలివాల్‌ మద్దతు ప్రకటించారు. మహిళా క్రీడాకారిణులతో పోలీసుల అసభ్యకర ప్రవర్తన ఆక్షేపణీయమని, ఫిర్యాదు అందిన వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు.
సుప్రీంలో ముగిసిన రెజ్లర్ల కేసు విచారణ
తమను బ్రిజ్‌భూషణ్‌ లైంగికంగా వేధించినట్లు ముగ్గురు మహిళా రెజ్లర్లు చేసిన ఫిర్యాదుపై విచారణను సప్రీంకోర్టు గురువారం ముగించింది. హైకోర్టు న్యాయమూర్తి లేక రిటైర్డ్‌ జడ్జి పర్యవేక్షణలో విచారణ జరిపించాలని రెజ్లర్ల తరపు న్యాయవాది కోరగా మౌఖిక ఫిర్యాదు పరిశీలనకు కోర్టు నిరాకరించింది. ‘ఎఫ్‌ఐఆర్‌ నమోదు, ఫిర్యాదుదారులకు రక్షణ కోసం వచ్చారు. వాటిని పరిష్కరించాం. మీకు ఇంకా సమస్యలు ఉంటే స్థానిక మెజిస్ట్రేట్‌లు లేక హైకోర్టును ఆశ్రయించండి’ అని సీజేఐ చంద్రచూడ్‌ నేతృత్వ జస్టిస్‌ పీఎస్‌ నరసింహా, జస్టిస్‌ జేబీ పార్దివాలా ధర్మాసనం పేర్కొంది. ఈ కేసు విచారణను ముగిస్తున్నట్లు తెలిపింది. ఏప్రిల్‌ 28న న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఫిర్యాదిదారులకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఆదేశాలిచ్చినట్లు దిల్లీ పోలీసుల తరపున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా కోర్టుకు తెలిపారు. సముచిత భద్రతా ఏర్పాట్లు జరిగాయని, ఆరుగురు మహిళా రెజ్లర్ల కోసం తగు విధంగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. మైనర్‌తో పాటు నలుగురు పిటిషనర్ల వాంగ్మూలాలను సీఆర్పీసీలోని 161 సెక్షన్‌ కింద రికార్డు చేసినట్లు వెల్లడిరచారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img