Saturday, December 3, 2022
Saturday, December 3, 2022

రేణిగుంటలో భారీ అగ్నిప్రమాదం

. డాక్టర్‌, కుమారుడు, కుమార్తె మృతి
. తల్లి, భార్య క్షేమం
. షార్ట్‌సర్క్యూట్‌ కారణమంటున్న పోలీసులు

విశాలాంధ్ర-రేణిగుంట : తిరుపతి జిల్లా రేణిగుంటలో ఘోరం జరిగింది. అగ్ని ప్రమాదంలో వైద్యుడు, ఆయన కుమారుడు, కుమార్తె దుర్మణం చెందగా, తల్లి, భార్య క్షేమంగా బయటపడ్డారు. రేణిగుంట రాజరాజేశ్వరి గుడి వద్ద ఆదివారం వేకువ జామున సుమారు నాలుగు గంటలకు ఈ అగ్ని ప్రమాదం జరిగిందని డీఎస్పీ రామచంద్ర తెలిపారు. గుడి ఎదురుగా ఉన్న ప్రైవేట్‌ హాస్పిటల్‌ కార్తిక క్లినిక్‌లోని పై భవనంలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. హాస్పిటల్‌ పైన డాక్టర్‌ రవి శంకర్‌ రెడ్డి కుటుంబం నివాసం ఉంటుండగా, హఠాత్తుగా ఉదయం నాలుగు గంటలకు ఆ ఇంటి నుంచి మంటలు ఎగిసిపడినట్లు చుట్టుపక్కల వారు గమనించారు. అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఎగసిపడే మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. ఇంట్లో మొత్తం ఐదు మంది ఉండగా, అందులో వైద్యుడి భార్య డాక్టర్‌ అనంతలక్ష్మీ, తల్లిని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ప్రాణాలకు తెగించి కాపాడారు. శివ శంకర్‌ పిల్లలు కుమారుడు సిద్ధార్థ రెడ్డి (12), కూతురు కార్తీక (6)లను బయటకు తీసుకొచ్చినా వారిని కాపాడలేకపోయారు. అప్పటికే వారు మంటల్లో పొగను పీల్చి ఊపిరాడక చనిపోయినట్టు డీఎస్పీ రామచంద్ర తెలిపారు. సుమారు మూడున్నర గంటలకు పైగా ఎగిసిపడుతున్న మంటలను ఫైర్‌ సిబ్బంది, పోలీసు శాఖ సహాయంతో మంటలను ఆర్పుతూ డాక్టర్‌ శివ శంకర్‌ రెడ్డిని కాపాడడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశామని అగ్నిమాపక అధికారి రమణయ్య తెలిపారు. డాక్టర్‌ రవి శంకర్‌ రెడ్డి మంటల్లో చిక్కుకుని పూర్తిగా కాలిపోయిన మృతదేహాన్ని కనుగొన్నామన్నారు. దీనిపై విచారణ జరిపి ఘటన జరిగిన కారణాలను త్వరలోనే తెలియజేస్తామని చెప్పారు. ప్రాథమికంగా షార్ట్‌సర్క్యూట్‌ వల్ల ప్రమాదం జరిగిందని భావిస్తున్నామన్నారు. వేకువ జామున ఘటన జరిగిన వెంటనే స్థానికులు ఇచ్చిన సమాచారంతో స్పందించిన ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్‌రెడ్డి పోలీసు, అగ్నిమాపక శాఖల అధికారులను అప్రమత్తం చేసి వెంటనే సహాయక చర్యలు చేపట్టి బాధిత కుటుంబాన్ని కాపాడాలని ఆదేశించారు. అగ్ని ప్రమాద ఘటన తనను కలచివేసిందని ఎమ్మెల్యే తెలిపారు. మధ్యాహ్నం డాక్టర్‌ నివాసాన్ని సందర్శించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. రేణిగుంట మండల ఇన్‌చార్జ్‌ బియ్యపు పవిత్ర రెడ్డి ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలను పర్యవేక్షించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img