Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

రేషన్‌ బియ్యం అక్రమ రవాణా

. పొరుగు రాష్ట్రాలకు తరలింపు
. కోట్లు ఆర్జిస్తున్న ముఠాలు
. నిద్రమత్తులో అధికారులు

విశాలాంధ్ర బ్యూరో-విశాఖపట్నం: రేషన్‌ బియ్యం పొరుగు రాష్ట్రాలకు పెద్దఎత్తున అక్రమ రవాణా జరుగుతోంది. ఇందులో డీలర్లదే కీలక పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. దారిద్య్ర రేఖకు దిగువున ఉన్న పేదల ఆకలి తీర్చడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నాయి. ప్రభుత్వాల ఆశయానికి కొందరు అక్రమార్కులు తూట్లు పొడుస్తున్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న రేషన్‌బియ్యాన్ని పక్కదారి పట్టిస్తూ కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నారు. అక్రమార్కులు సిండికేట్‌గా ఏర్పడి రాత్రి వేళ లారీలు, మినీవ్యాన్‌లు, ఆటో ట్రాలీలలో పొరుగు రాష్ట్రాలకు, జిల్లాలకు రహస్యంగా తరలిస్తున్నారు. చాలాకాలంగా ఈ దందా కొనసాగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదు. పాలకుల నిర్లక్ష్యం కారణంగా ప్రతినెలా టన్నుల కొద్ది బియ్యం పక్కదారి పడుతున్నాయి. రేషన్‌ బియ్యం తరలింపును అడ్డుకునే అధికారం ప్రజాపంపిణీ వ్యవస్థలో ప్రత్యేక అధికారులు, పోలీసులకు ఉన్నప్పటికీ ఈ దందా కొనసాగుతూనే ఉంది. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న బియ్యం గురించి గ్రామీణ ప్రాంత పేదలకు చాలా వరకు తెలియదు. కేంద్రం బియ్యం గురించి డీలర్లు సైతం చెప్పడం లేదు. ప్రతి నెలా రెండుసార్లు ఇవ్వాల్సిన బియ్యాన్ని ఒక్కసారి ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. కేంద్ర ప్రభుత్వం సరఫరా చేస్తున్న బియ్యాన్ని కొంతమంది దళారులు, డీలర్లు కుమ్మక్కై దారి మళ్లిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా బాగోతం కొంతకాలంగా సాగుతోంది. అధికారుల పర్యవేక్షణ లేకపోవడం, అక్రమ రవాణా విషయంలో చూసీచూడనట్టు వ్యవహరిస్తుండటం అక్రమార్కులకు వరంగా మారింది. గుట్టు చప్పుడు కాకుండా సరిహద్దు చెక్‌పోస్టులు దాటుతున్నాయి. పట్టణాల్లో నెలకు రెండుసార్లు బియ్యం పంపిణీ జరుగుతోంది. కానీ పల్లెలకు సరఫరా చేసే బియ్యం మాత్రం దారి మళ్లుతున్నాయి. పోలీసుల సహకారంతో అడపాదడపా తనిఖీలు నిర్వహించినా ఫలితం శూన్యం. బియ్యం తరలింపులో అక్రమార్కులు మరింత చాకచక్యంగా వ్యవహరిస్తున్నారు. బియ్యం లారీలకు అర కిలోమీటర్‌ ముందు ముఠా సభ్యులు కార్లలో ప్రయాణిస్తుంటారు. పొరపాటున తనిఖీల్లో పట్టుబడినా తమ పేర్లు చెప్పకూడదని లారీ యజమానులు, డ్రైవర్లతో ముందస్తు ఒప్పందం కుదుర్చుకుంటారు. ఇందుకు అవసరమైన మేర డబ్బును బియ్యం మాఫియా లారీ యజమానులకు, డ్రైవర్లకు ఇస్తున్నట్లు సమాచారం. ప్రజల అవసరాల కోసం ప్రభుత్వం పంపిణీ చేసే రేషన్‌ బియ్యం ప్రతినెలా పక్కదారి పట్టిస్తున్న ముఠాల ఆగడాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img