కరువు ప్రాంతగా కర్నూలు జిల్లా: రామకృష్ణ డిమాండ్
ఎండిన పత్తిపంటను పరిశీలించిన సీపీఐ బృందం
విశాలాంధ్ర – ఆస్పరి: వర్షాభావంతో పంటలు ఎండిపోతున్న నేపథ్యంలో కర్నూలు జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ డిమాండ్ చేశారు. సీపీఐ బస్సు యాత్ర శనివారం కర్నూలు జిల్లా ఆస్పరి మీదుగా ఆలూరుకి వెళుతున్న సందర్భంలో ఆస్పరి సమీపంలో కౌలు రైతు భాస్కర్ పత్తి పంట పొలాన్ని రామకృష్ణ, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, కార్యదర్శివర్గ సభ్యులు ఓబులేసు, పి.రామచంద్రయ్య, జిల్లా కార్యదర్శి బి.గిడ్డయ్య క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతు భాస్కర్, మహిళా కూలీలతో ముఖాముఖి మాట్లాడారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ ఖరీఫ్ సీజన్‌లో వేసిన ప్రధాన పంటలు పత్తి, వేరుశనగ, ఆముదం, కంది తదితర పంటలు తీవ్ర వర్షాభావం కారణంగా పూర్తిగా ఎండిపోతున్నాయని, దీని కారణంగా పెట్టిన పెట్టుబడులు రాక రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే జిల్లా కలెక్టర్, వ్యవసాయ అధికారి స్పందించి పంట, పొలాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదికలను ప్రభుత్వానికి పంపాలని డిమాండ్ చేశారు. తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడానికి పత్తి, వేరుశెనగ, కంది పంటలకు ఎకరాకు రూ.50 వేలు, ఆముదము, జొన్న పంటలకు ఎకరాకు రూ.30 వేలు పరిహారం ఇవ్వాలని, గ్రామాల్లో తాగునీటి సమస్య పరిష్కరించాలని, పనులు లేక ఇప్పటికే గ్రామాల నుంచి సుదూర ప్రాంతాలకు వలసపోతున్నారనీ, వలసల పరంపర ఆపడానికి ఉపాధి హామీ పథకం కింద పనులు కల్పించాలని, రైతులు బ్యాంకులో తీసుకున్న పంట రుణాలను మాఫీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి ఆవుల శేఖర్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి మునెప్ప, జిల్లా కార్యవర్గ సభ్యులు రామకృష్ణారెడ్డి, మండల కార్యదర్శి విరుపాక్షి, రైతులు పాల్గొన్నారు.