Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

రైతుల నిరసన ‘రణం’

రూ.16.5 కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్‌
విజయనగరం జిల్లాలో చెరకు రైతుల ఆందోళన ఉద్రిక్తం
రాష్ట్ర రహదారిపై బైఠాయించిన అన్నదాతలు, మహిళలు
అరెస్టులను వ్యతిరేకిస్తూ పోలీసులపై తిరుగుబాటు
ఐదు గంటలపాటు నిలిచిన ట్రాఫిక్‌
జేసీ, పోలీసు ఉన్నతాధికారుల చొరవతో ముగిసిన ధర్నా

విశాలాంధ్ర ` సీతానగరం : విజయనగరం జిల్లాలో చెరకు రైతుల నిరసన రణరంగంగా మారింది. ఏళ్లుగా బకాయిలు అందక తీవ్ర ఆవేదనకు గురైన రైతులు రోడెక్కి ధర్నాకు దిగారు. తక్షణమే తమకు రావాల్సిన రూ.16.5 కోట్లను చెల్లించాలని డిమాండ్‌ చేశారు. పోలీసులు నిరసనకారులను అరెస్టు చేయడానికి ప్రయత్నించడంతో ఒక్కసారిగా వారి ఆందోళన ఉద్రిక్తంగా మారింది. బకాయిల కోసం ఉద్యమిస్తుంటే, తమను అరెస్టు చేయడమేమిటని రైతులు ప్రశ్నించారు. ఈ సందర్భంగా రైతులు, పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే, విజయనగరం జిల్లా, సీతానగరం మండలంలోని లచ్చయ్యపేట ఎన్‌సీఎస్‌ చక్కెర కర్మాగారం ఎదుట రాష్ట్ర రహదారిపై బుధవారం చెరకు రైతుల ధర్నా చేపట్టారు. కర్మాగారం యాజమాన్యం గత రెండేళ్లుగా చెరకు రైతులకు 16.5 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్న నేపథ్యంలో చెరకు రైతు సంఘం అధ్వర్యంలో ధర్నాకు పిలుపునిచ్చారు. బకాయిలు చెల్లించాలని గత ఏడాదిగా ఎన్నోసార్లు ధర్నాలు, నిరసనలు చేసినప్పటికీ యాజమాన్యంగానీ, ప్రభుత్వంగానీ స్పందించలేదు. దీంతో గతంలో ఎన్నడూలేని విధంగా ధర్నాకు దాదాపు 500 మంది చిన్న, సన్నకారు, కౌలు రైతులతో సహా మహిళలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ముందుగా లచ్చయ్యపేట గ్రామం నుంచి ర్యాలీగా బయలుదేరి కర్మాగారం ఎదుట కొంతసేపు నిరసన తెలిపారు. రైతుల బకాయిలు తక్షణమే చెల్లించాలని నాయకులు ఎం.కృష్ణమూర్తి, రెడ్డి లక్షుము నాయుడు, రెడ్డి వేణు, ఈశ్వరరావు, రమణమూర్తి, ఇందిర తదితరులు మాట్లాడారు. అనంతరం రాష్ట్ర రహదారిపై ధర్నాకు దిగి పెద్దపెట్టున నినాదాలు చేశారు. 12 గంటల సమయంలో బొబ్బిలి గ్రామీణ సీఐ శోభన్‌బాబు అధ్వర్యంలో ఆందోళనకారులను, నాయకులను అరెస్టు నిమిత్తం రెండు వాహనాల్లో తరలించడానికి ప్రయత్నిస్తున్న సమయంలో మహిళలు, రైతులు వాహనాలను అడ్డుకున్నారు. వాహనాలపై రాళ్లు రువ్వి, టైర్లకు గాలి తీశారు. దీంతో పోలీసులు వెనుదిరిగారు. అనంతరం రైతులు రహదారిపై బైఠాయించి నిరసన కొనసాగించారు. ఈ సమయంలో రైతుల నిరసనను విరమింపజేసేందుకు రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. చివరకు సబ్‌ కలెక్టర్‌ కూడా ఫోన్‌లో మాట్లాడినా రైతులు జోరున కురుస్తున్న వర్షాన్ని సైతం లెక్కచేయకుండా ఆందోళన కొనసాగించారు. మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో నిరసనకారులను రెండోసారి అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా, రైతులు పెద్దఎత్తున తిరుగుబాటు చేశారు. వాహనాలపై దాడి చేసి అడ్డుకోవడంతోపాటు పోలీసుల వైఖరిని నిరసిస్తూ రైతులు, మహిళలు అక్కడే ఉన్న కొబ్బరి రెమ్మలు, మట్టి, రాళ్లను పోలీసుల పైకి విసిరారు. దీంతో పోలీసులు కర్మాగారం వైపు పరుగులు పెట్టి గేట్లు వేసుకున్నారు. వారిపై రాళ్లు విసిరిన సమయంలో సీతానగరం మహిళా కానిస్టేబుల్‌ పద్మ తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్‌ఐ మురళికి, సీతానగరం పోలీసు సిబ్బంది మరో ఇద్దరు కూడా గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో బొబ్బిలి డీఎస్పీ మోహనరావు, పార్వతీపురం పోలీసు ఉన్నతాధికారులు, పెద్ద ఎత్తున పోలీసులు అక్కడకు చేరుకున్నారు. బొబ్బిలి డీఎస్పీ మోహనరావు చర్చలు జరిపినా ఆందోళన విరమించకపోవడంతో జిల్లా ఉన్నతాధికారులకు పరిస్థితిని వివరించారు. దీంతో జాయింట్‌ కలెక్టర్‌ కిషోర్‌ కుమార్‌ రైతుల ధర్నా ప్రాంతానికి వచ్చి త్వరలోనే ఆర్‌ఆర్‌ యాక్టు అమలు చేసి చెల్లిస్తామని, దీనిపై జిల్లా కలెక్టర్‌, ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు చేస్తున్న కృషిని వివరించారు. రైతుల ఆవేదన తెలుసునని, ఆందోళన విరమించాలని ఆయన కోరారు. సాయంత్రం ఐదు గంటలు కావస్తున్నా చెరకు రైతులు ఆందోళన విరమించకపోవడంతో నేరుగా జాయింట్‌ కలెక్టర్‌, పోలీసు ఉన్నతాధికారులు, పోలీసు సిబ్బంది దగ్గరుండి రైతులను పక్కకు నెట్టి వాహనాలు పంపే ఏర్పాటు చేశారు. ఐదు గంటల పాటు బొబ్బిలి-పార్వతీపురం ప్రధాన రహదారిలో రెండు వైపులా ఐదు కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి. దీపావళి పండుగ సందర్భంగా స్వగ్రామాలకు వచ్చే ప్రయాణికులు, మహిళలు, పిల్లలు, ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. నిరసనను పోలీసులు తక్కువ అంచనా వేయడం, సకాలంలో స్పందించక పోవడంతోనే ఐదు గంటలపాటు నరకాన్ని చూశామని ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండేళ్లుగా చెరకు రైతులకు పెద్దఎత్తున బకాయిలు ఉన్నా ప్రజాప్రతినిధులు, అధికారులు స్పందించక పోవడమే ఈరోజు ఉద్రిక్తతకు కారణమని అనేక మంది చర్చించుకోవడం గమనార్హం. ఎన్నడూ రోడ్డెక్కని మహిళలు నిరసనలో పాల్గొని బకాయిలు చెల్లించే వరకు కదలబోమని, జోరున కురుస్తున్న వర్షాన్ని కూడా లెక్కచేయక ఆకలితో సాయంత్రం వరకు ఉండి అధికారులను నిలదీశారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల చెరకు రైతులు, వామపక్షాల నాయకులు పాల్గొన్నారు. ఐదుగురు నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img