. వ్యవసాయోత్పత్తులకు ఆహార శుద్ధి ద్వారా విలువ పెంపు
. సీఎం చంద్రబాబు
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : ఉపాధి కల్పనలో కీలకమైన ఎంఎస్ ఎంఈల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇచ్చి రైతులకు నేరుగా భాగస్వా మ్యం కల్పించనున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ, ఆహార శుద్ధి పరిశ్రమల శాఖపై ముఖ్యమంత్రి గురువారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ శాఖల పరిస్థితులను సమీక్షించారు. తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు మార్గనిర్దేశనం చేశారు. పెండిరగ్‌లో ఉన్న ఎంఎస్‌ఎంఈ పార్కులను త్వరతిగతిన పూర్తి చేసి సౌకర్యాలు కల్పించి పరిశ్రమల ఏర్పా టును వేగవంతం చేస్తామన్నారు. ఆయా ప్రాంతాల్లో రైతుల భాగస్వామ్యంతో వారే ఎంఎస్‌ఎంఈ పార్కులు ఏర్పాటు చేసుకునే అంశంపై కసరత్తు చేయాలని సీఎం సూచించారు. ఎంఎస్‌ఎంఈకి రుణ హామీ కోసం రూ.100 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్‌కు అపార అవకాశాలు, అనువైన పరిస్థితులు ఉన్నాయని ముఖ్యమంత్రి అన్నారు. హార్టికల్చర్, ఆక్వా కల్చర్ ఉత్పత్తులకు…ఆహార శుద్ధి పరిశ్రమ ద్వారా ఆదాయాలు పెరుగుతాయని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా పండిరచే పంటలకు డిమాండ్ ఎక్కువని, వాటిని ప్రోత్సహించాలని సూచించారు. భూములు కలిగిన రైతులు, ప్రైవేటు భాగస్వామ్యంతో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల కోసం పార్కులు ఏర్పాటు చేసుకునే విధానాన్ని అమల్లోకి తేవాలని ఆదేశించారు. రాజధానిలో రైతు భాగస్వామ్యంతో వారికి లబ్ధి చేకూర్చిన తరహా విధానాన్ని ఎంఎస్‌ఎంఈ పార్కుల ఏర్పాటులోనూ అవలంభించాలన్నారు. పూణె వంటి చోట్ల ఇలాంటి విధానం అమల్లో ఉందని అధికారులు చెప్పగా, వాటిని పరిశీలించి రాష్ట్రంలో మెరుగ్గా అమలు చేయాలని సీఎం సూచించారు. పరిశ్రమల ఏర్పాటులో అర్థంలేని నిబంధనలు తొలగించాలని, సులభంగా అనుమతులు ఇవ్వాలని అదేశించారు.
నిర్దేశిత సమయంలో పరిశ్రమల ఏర్పాటుకు అధికారి/విభాగం అనుమతి ఇవ్వకపోతే….ఆటోమేటిక్ గా అనుమతులు పొందే విధానాన్ని అమల్లోకి తేవాలన్నారు. ప్యాకింగ్, డిజిటల్ కామర్స్, మార్కెటింగ్ సదుపాయాలు కల్పిస్తే, చిన్న పరిశ్రమల ఉత్పత్తులకు డిమాండ్ లభిస్తుందన్నారు. ఆటోనగర్‌ల ఆధునికీకరణ, ఎలక్ట్రిక్ వెహికిల్స్‌కు సర్వీస్ అందించేలా నైపుణ్యత పెంచాలని, నిర్మాణంలో ఉన్న ఏడు క్లస్టర్లను పూర్తి చేయాలని సీఎం ఆదేశాలిచ్చారు. సమీక్షలో మంత్రి కొండపల్లి శ్రీనివాస, ఆయా శాఖాధికారులు పాల్గొన్నారు.