Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

రైళ్ల ప్రైవేటీకరణ చర్యలు ముమ్మరం

బిడ్‌లను ఆహ్వానించేందుకు రైల్వే శాఖ ప్రణాళిక
150కు పైగా ప్యాసింజర్‌ రైళ్లు ‘ప్రైవేటు బాట’
వచ్చే ఏడాది ఏప్రిల్‌ నుంచి పట్టాలెక్కించే యోచన
న్యూదిల్లీ :
కేంద్రంలోని మోదీ సర్కార్‌ ప్రభుత్వ సంస్థలను ప్రైవేటీకరించే చర్యలను వేగవంతం చేసింది. గత సంవత్సరం ఇదే విధమైన ప్రణాళిక విఫలమైన తర్వాత ఏప్రిల్‌ 1 నుండి ప్రారంభమయ్యే సంవత్సరంలో 150 కంటే ఎక్కువ ప్యాసింజర్‌ రైళ్లను నడపడానికి ప్రైవేట్‌ ఆపరేటర్ల నుండి బిడ్‌లను ఆహ్వానించాలని భారతీయ రైల్వే యోచిస్తున్నట్లు పేరు వెల్లడిరచడానికి ఇష్టపడని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. కాంట్రాక్టులు పొందిన కంపెనీల ద్వారా ప్యాసింజర్‌ రైళ్లు నడిపేందుకు అనువైన 100 గమ్య స్థానాలను రైల్వే శాఖ ఇప్పటికే గుర్తించింది. ఇందులోని చాలా గమ్యస్థానాలు గత సంవత్సరం ఆహ్వానించబడిన బిడ్‌లలోనూ ఉన్నాయి. అయితే, ప్రైవేట్‌ కంపెనీలు సరైన ఆసక్తి కనబరచకపోవడంతో నవంబర్‌లో ఈ ప్రక్రియను రద్దు చేశారు. తాజాగా ప్రైవేట్‌ ప్యాసింజర్‌ రైళ్లను నడిపేందుకు ఆసక్తి చూపుతున్న పెట్టుబడిదారులతో రైల్వే శాఖ సంప్రదింపులు ప్రారంభించింది. అలాగే రైల్వే శాఖకు వచ్చిన ఫీడ్‌ బ్యాక్‌ ఆధారంగా ఎక్కువ మంది బిడ్డర్లను ఆకర్షించేందుకు బిడ్డింగ్‌ పరిమితులను సర్దుబాటు చేసేందుకు రైల్వే శాఖ సంసిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ‘ప్రైవేట్‌ ప్యాసింజర్‌ రైళ్లకు సంబంధించి సంప్రదింపులు కొనసాగుతున్నాయి. రాబోయే రోజుల్లో కేంద్ర బడ్జెట్‌లో దీనికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించే అవకాశం ఉంది’ అని రైల్వే శాఖకు చెందిన కీలక అధికారులు తెలిపారు. గత జులైలో రైల్వే మంత్రిత్వ శాఖ 109 రూట్లలో ప్రైవేట్‌ రైళ్లను నడపడానికి రూ.30,000 కోట్లతో టెండర్‌ను తెరిచింది. ఈ టెండర్‌ను 12 క్లస్టర్‌లుగా విభజించారు. దాదాపు 15 సంస్థల నుంచి 12 క్లస్టర్లకు 120 దరఖాస్తులు వచ్చినప్పటికీ, కేవలం మూడు క్లస్టర్లు మాత్రమే ఇండియన్‌ రైల్వే క్యాటరింగ్‌ అండ్‌ టూరిజం కార్పొరేషన్‌(ఐఆర్‌సీటీసీ), మేఘా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌(ఎంఈఐఎల్‌) నుండి ఫైనాన్షియల్‌ బిడ్‌లను స్వీకరించాయి. ఇక తొలుత ఆసక్తి చూపిన పెట్టుబడిదారుల్లో జీఎంఆర్‌ హైవేస్‌, ఐఆర్‌బీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ అండ్‌ డెవలపర్‌, క్యూబ్‌ హైవేస్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ 3, వెల్స్పన్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఉన్నాయి. రూట్ల ఆధారిత చార్జీలు, హమాలీ చార్జీలు, రాక్‌ల ధర, రాయితీ వ్యవధిపై పెట్టుబడిదారులకు స్పష్టత అవసరమని అధికారులు చెప్పారు. ఎందుకంటే అటువంటి పెట్టుబడులు రాబడిని పొందడంపై ప్రభావం చూపుతాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img