Saturday, April 1, 2023
Saturday, April 1, 2023

రోడ్డెక్కిన వీధి వ్యాపారులు

. సదస్సుల పేరుతో జీవితాలు నాశనం చేస్తారా?
. ప్రత్యామ్నాయం చూపరా?
. విశాఖలో తోపుడుబండ్ల కార్మికుల ఆందోళన

విశాలాంధ్ర బ్యూరో-విశాఖపట్నం : ఎండనకా, వాననకా తోపుడు బండ్లపై చిరువ్యాపారాలు చేసుకుని బతుకుతున్న తమ జీవనాన్ని దెబ్బతీయొద్దని అధికారులను వీధివిక్రయదారులు వేడుకుంటున్నారు. విశాఖ నగరానికి వీఐపీల తాకిడి ఎక్కువ. అప్పుడు ఒకటి, రెండు రోజులు ముఖ్యమైన రహదారుల్లో వీధి వ్యాపారాలు ఆపేస్తుంటారు. ఇప్పుడు రెండు నెలలపాటు వీధి వ్యాపారాలు చేయొద్దని అధికారులు చెప్పడం… వారి జీవితాల్లో పిడుగు పడినట్లు అయింది. బతుకుతెరువు కోసం వచ్చిన 40 వేల మంది వీధి విక్రయదారులు విశాఖ నగరంలో అనేక రహదారుల వెంబడి చిరువ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాలు పోషించుకుంటున్నారు. ప్రధానంగా బీచ్‌ రోడ్‌లో మురి మిక్చర్‌ దగ్గర నుంచి న్యూడిల్స్‌, పానీపూరి, ఐస్‌ క్రీమ్‌, పండ్లు, పల్లీలు, దుస్తులు, చెప్పులు, కూరగాయలు, చెరుకు రసం…ఇలా అనేక రకాల వ్యాపారాలు చేసుకుంటూ రోడ్లపైనే బతుకులీడుస్తున్నారు. సదస్సుల పేరుతో వ్యాపారాలు బంద్‌ చేయాలన్న అధికారుల ఆదేశాలు తోపుడుబండ్ల కార్మికుల కళ్లలో కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ఫిషింగ్‌ హార్బర్‌ నుంచి ఆర్కే బీచ్‌ జంక్షన్‌ మీదుగా బీచ్‌ రోడ్డులో ఉన్న తెన్నేటి పార్క్‌, సాగర్‌నగర్‌, రిషికొండ మీదుగా భీమిలి వరకు ఫిబ్రవరి, మార్చిలో తోపుడుబండ్ల వ్యాపారం ఆపాలని అధికారులు హుకుం జారీ చేశారని చిరువ్యాపారాలు ఆందోళన చెందుతున్నారు. ఎంవీపీ కాలనీ, ఆర్టీసీ కాంప్లెక్స్‌, రైల్వేస్టేషన్‌ రోడ్డుతో పాటు 22 ప్రాంతాల్లో వీధివ్యాపారాలు నిలిపివేయాలని అధికారులు చెప్పడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రెక్కాడితేకానీ డొక్కాడని దినసరి కూలీలుగా, చిరువ్యాపారాలు చేసుకుంటూ రోజుకు రూ.500 సంపాదించుకునే బతుకులపై దెబ్బకొట్టడం, వేధించడం సరికాదని మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి, ఇతర ప్రముఖులు వచ్చిన సమయంలో వ్యాపారాలు ఆపే అధికారులు ఇప్పుడు శాశ్వతంగా రెండు నెలలు వద్దని చెప్పడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నదని మండిపడుతున్నారు. మరోరెండు నెలల్లో విశాఖకు మకాం మారుస్తున్నట్లు సీఎం జగన్‌ చెప్పారని, ఆయన వస్తే శాశ్వతంగా వ్యాపారం నిలిచిపోవడమేనని వీధివిక్రయదారుల ఆవేదన చెందుతున్నారు. వీధివిక్రయదారులకు ప్రత్యామ్నాయం ఏమిటని వీధి విక్రయదారులసంఘం(ఏఐటీయూసీ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెడ్డు వెంకటేశ్వరరావు అధికారులను ప్రశ్నించారు. అభివృద్ధి పేరుతో చిరువ్యాపారుల పొట్ట కొట్టవద్దని, వారి జీవనాన్ని చిన్నాభిన్నం చేయొద్దని కోరారు. మార్చి 3,4 తేదీల్లో విశాఖలో ప్రపంచ పెట్టుబడిదారుల సదస్సు, 28, 28 తేదీల్లో జీ 20 సదస్సులు జరగనున్నాయి. వివిధ దేశాల నుండి పెట్టుబడిదారులు, కేంద్ర, రాష్ట్ర మంత్రులు నగరానికి వస్తున్నారనే నెపంతో తోపుడుబండ్లు, చిరువ్యాపారులను జీవీఎంసీ అధికారులు అన్యాయంగా తొలగించడాన్ని తక్షణమే నిలుపుదల చేయాలని, ఎక్కడ వారికి అక్కడే ఉపాధి కల్పించాలని విశాఖపట్నం వీధి విక్రయదారుల కార్మిక సంఘాలు శుక్రవారం జీవీఎంసీ కార్యాలయం వద్ద పెద్దఎత్తున ధర్నా చేపట్టాయి. అనంతరం జీవీఎంసీ కమిషనర్‌ రాజబాబుకు నాయకులు వినతిపత్రం అందజేశారు. పొట్టచేతపట్టుకొని విశాఖ నగరానికి వలస వచ్చిన అత్యధికమంది స్వయం ఉపాధితో బతుకుతున్నారు. వీధి విక్రయదారులకు, చిరువ్యాపారులకు ఉపాధి కల్పించాలని కేంద్రం చట్టం చేసింది. వీరికి హాకర్స్‌ జోన్‌ ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలని సుప్రీంకోర్టు సైతం మార్గదర్శకాలు విడుదల చేసింది. కానీ విశాఖలో పోలీసులు, జీవీఎంసీ అధికారులు దౌర్జన్యంగా చిరువ్యాపారులపై దాడులు చేసి దుకాణాలు తొలగిస్తున్నారు. దీనివలన 10 వేల కుటుంబాలు రోడ్డునపడుతున్నాయి. జి-20, పెట్టుబడిదారుల సదస్సులు చిరువ్యాపారులకు శాపంగా ఉండకూడదని, జీవీఎంసీ కమిషనర్‌ జోక్యం చేసుకొని తొలగించిన బడ్డీలు, తోపుడుబండ్లును పెట్టించాలని విశాఖపట్నం తోపుడుబండ్ల కార్మికసంఘం నేతలు డిమాండ్‌ చేశారు. జిల్లా గౌరవ అధ్యక్షుడు పి.వెంకటరెడ్డి, వీధివిక్రయదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తెడ్డు వెంకటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.సింహాచలం, నాయకులు ఎం.సుబ్బారావు, భీంపల్లి రాము, జక్కన్‌ నరసింహమూర్తి తదితరులు కమిషనర్‌కు వినతిపత్రం అందచేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img