Sunday, January 29, 2023
Sunday, January 29, 2023

లక్షద్వీప్‌లో ‘అసంతృప్తి’ ఉప్పెన

పటేల్‌ ఏకపక్ష నిర్ణయాలపై పెరుగుతున్న అసహనం
నిరసనల అణచివేతకు అస్త్రమైన ఎఫ్‌ఐఆర్‌

కోజికోడ్‌ : ప్రశాంత లక్షద్వీప్‌లో అసంతృప్తి ఉప్పెన ఉప్పొంగుతోంది. అడ్మినిస్ట్రేటర్‌గా వెళ్లిన ప్రఫుల్‌ పటేల్‌ అధికార దర్పం, ఏకపక్ష నిర్ణయాలు, ఆంక్షలు స్థానికుల్లో అలజడి సృష్టించాయి. ఇష్టానుసారం జారీచేసే ఆదేశాలను వ్యతిరేకిస్తే వారి గొంతును నొక్కివేసేందుకు ఎఫ్‌ఐఆర్‌ల అస్త్రాన్ని పటేల్‌ యంత్రాంగం వినియోగిస్తోంది. నోటీసులను జారీచేస్తూ హెచ్చరిస్తోంది. ప్రజా రవాణా, అత్యవసర వస్తువులు, ప్యాసింజర్‌ నౌకలు, ఎయిర్‌ అంబులెన్స్‌ల చార్జీలను విపరీతంగా పెంచివేసింది. ఫలితంగా అన్ని వైపుల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రవాణా చార్జీల పెంపుదలను వ్యతిరేకించిన ఎంపీ మహమ్మద్‌ ఫైజల్‌పై లక్షద్వీప్‌ పోలీసులు కేసు నమోదు చేశారు. విద్యార్థి నిరసనకారుల వివరాల కోసం స్కూల్‌ ప్రిన్సిపల్‌కు విద్యాశాఖ డైరెక్టర్‌ నోటీసులు జారీచేశారు. స్కాలర్‌షిప్‌ పునరుద్ధరణకు డిమాండు చేస్తూ సమ్మె బాట పట్టిన వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని సూచించారు. ద్వీపానికి చెందిన ఏకైక ఎంపీ ఫైజల్‌ ఎన్సీపీ నేత. ఆయనపై ఐపీసీలోని 188, 268, 269, 270 సెక్షన్లతో పాటు విపత్తు నివారణ చట్టం, 2005లోని సెక్షన్‌ 51(ఎ) కింద కేసులు నమోదు అయ్యాయి. పబ్లిక్‌ న్యూసెన్స్‌, ప్రభుత్వాధికారి ఉత్తర్వుల ధిక్కరణ, ప్రాణాపాయ ఇన్ఫెక్షన్లు ప్రబలేలా చేయడం వంటివి ఈ సెక్షన్ల కిందకు వస్తాయి. ఈనెల 10న ఎంపీ, మరో 20 మంది ఎన్సీపీ కార్యకర్తలు కలిసి రాజధాని కవారట్టి ద్వీపంలో ఆందోళన చేపట్టారు. చార్జీల పెంపును నిరసించారు. ఇప్పటికే కోవిడ్‌ కారణంగా తీవ్ర ఇబ్బందుల్లో ఉన్న లక్షద్వీప్‌ ప్రజలపై అదనపు భారం పడుతుందని ఆందోళన వ్యక్తంచేశారు. ఉద్యోగాల తొలగింపుతో వందలాది మంది పరిస్థితి మరింత దిగజారిందన్నారు. ఆరోగ్య మౌతికవసతులు అంతంత మాత్రంగానే ఉండే లక్షద్వీప్‌లో ఎయిర్‌ అంబులెన్సుల సేవలు అత్యవసరమైనవి. పెరిగిన చార్జీల ప్రకారం ఓ రోగిని అత్యవసరంగా వైద్యం కోసం సమీపంలోని కేరళకు వాయు మార్గంలో తరలించాలంటే రూ.30వేల నుంచి రూ.50వేల వరకు చెల్లించాలి. రోగితో పాటు ఇద్దరు సహాయకుల టికెట్లకు ఇంత వెచ్చించాలి. వేర్వేరు ద్వీపాల నుంచి చార్జీలు వేరుగా ఉంటాయి. ప్యాసింజర్‌ వెజల్‌లో బంక్‌ టికెట్‌ ధరను ఏకంగా 50శాతం మేర పెంచారు. కొచ్చి నుంచి కవారట్టికి వెళ్లాలంటే గతంలో రూ.220 చెల్లిస్తే సరిపోయేది ఇప్పుడు రూ.330 చెల్లించాల్సి వస్తోంది. నౌకల్లో మొదటి, రెండవ తరగతుల టికెట్లు కూడా భారీగా పెరిగాయి. ఓవైపు మహమ్మారి వల్ల నెలకొన్న ఆర్థిక సంక్షోభం.. మరోవైపు ప్రఫుల్‌ పటేల్‌ యంత్రాంగం చేపట్టిన సంస్కరణల వల్ల లక్షద్వీప్‌ ప్రజలకు తాజా చార్జీల మోత భయానక కలగా మారింది. దాదాపు రెండు వేల మంది ఒప్పంద కార్మికులపై పటేల్‌ యంత్రాంగం వేటు వేసింది. మహమ్మారి కొనసాగుతుండగానే ఉద్యోగులపై వేటు పడిరది. ప్రజలు ఆర్థికంగా ఇబ్బంది పడుతుంటే కర్కశంగా ఉద్యోగుల పొట్టకొట్టారని ఫైజల్‌ విమర్శించారు.
విద్యార్థుల్ని టార్గెట్‌ చేస్తున్నారు.. :
శాంతియుతంగా నిరసన తెలిపిప లోక్‌సభ సభ్యునిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయడాన్ని అసంతృప్తివాదులను బెదిరించేందుకు పటేల్‌ యంత్రాంగం చేపట్టే చర్యల్లో భాగమనే చెప్పాలి. నవంబరు 17న లక్షదీప్‌ స్కూల్‌ ప్రధానోపాధ్యాయులకు విద్యాశాఖ నుంచి అసాధారణ రీతిలో నోటీసు జారీ అయింది. దీనిని ఐఏఎస్‌ విశాల్‌షా పంపారు. విద్యా స్కాలర్‌షిప్పులు, విద్యాపర్యటనలను పునరుద్ధరించాలని, ఖాళీ టీచర్‌ పోస్టులను భర్తీ చేయాలని డిమాండు చేస్తూ నిరసనలు తెలిపిన విద్యార్థుల వివరాలను ఆ నోటీసుల్లో కోరారు. లక్షదీప్‌ స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ (ఎల్‌ఎస్‌ఏ) బ్యానర్‌ కింద పది ద్వీపాల్లో నిరసనలు, తరగతుల బహిష్కరణ ఈ నెల 15న చోటుచేసుకున్నాయి. తరగతులను బహిష్కరించడం క్రమశిక్షణ లేకపోవడానికి నిదర్శనమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రిన్సిపల్స్‌, హెడ్‌ మాస్టర్లకు సూచిస్తూ విద్యాశాఖ లేఖ వెలువడిరది. సమ్మెలో పాల్గొన్న విద్యార్థుల పేర్ల జాబితాను 17వ తేదీ సాయంత్రం 6 గంటల్లోగా కచ్చితంగా సమర్పించాలని ఆదేశించింది. గతంలో చార్జీలు పెరిగినా ఎయిర్‌ అంబులెన్స్‌ టికెట్ల ధరలను పెంచేవారు కాదు. ద్వీప ప్రజాప్రతినిధులు (ఎంపీ, జిల్లా పంచాయత్‌ అధిపతి)తో సంప్రదింపులు జరపకుండా చార్జీలను పెంచడం మునుపెన్నడూ జరగలేదు. లక్షద్వీప్‌లో సరైన వైద్య సౌకర్యాలు లేక రోగులను దక్షిణ భారతానికి తరలించక తప్పదు. ద్వీప ప్రజల వెతలను పెంచేలా అమానవీయంగా పటేల్‌ యంత్రాంగం వ్యవహరిస్తోందని ఫజల్‌ ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు.
ఆరోగ్య సంక్షోభం :
లక్షద్వీప్‌లో ఆరోగ్య సంక్షోభం కొనసాగుతోంది. అరకొర వసతులు అక్కడి ప్రజలను ఇబ్బంది పెడుతున్నాయి. వేర్వేరు ద్వీపాల్లోని వైద్య కేంద్రాల్లో పనిచేసే ఒప్పంద పారామెడిక్‌లను అగట్టి ద్వీపంలోని ఒకటే ఆసుపత్రికి బదిలీ చేయాలని స్థానిక యంత్రాంగం ఇటీవల నిర్ణయించింది. తక్కువ వేతనం, ఇతర లాజిస్టిక్‌ కారణాల వల్ల సిబ్బందిలో అనేక మంది ఇందుకు అంగీకరించలేదు. తమ రాజీనామాలు సమర్పించారు. దీంతో వైద్య కేంద్రాలతో పాటు సంబంధిత ఆసుపత్రిలోనూ సిబ్బంది కొరత ఏర్పడిరది. డెంటల్‌ మెడిసిస్‌లోనూ సంక్షోభం ఉందని, వేతనాల్లో కోతలు కొనసాగుతున్నాయని చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img