ఆశిష్ మిశ్రా, అంకిత్ దాస్ ఆయుధాల నుంచే తూటాలు..
సంచలన విషయాలు వెల్లడిరచిన ఎఫ్‌సీఎల్ నివేదిక
లక్నో : లఖింపూర్ ఖేరీ రైతుల హత్య కేసులో సంచలన విషయాలు వెలుగు చూశాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా సుమారు ఏడాది కాలంగా ఉద్యమిస్తున్న రైతుల విషయంలో కేంద్ర ప్రభుత్వ నిరంకుశ వైఖరి, హింసపూరిత విధానాలు తేటతెల్లమయ్యాయి. మోదీ సర్కార్ కొనసాగిస్తున్న హింసాత్మక చర్యలు మరోసారి స్పష్టమయ్యాయి. అక్టోబర్ 3న ఉత్తర ప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ హింసాకాండ సమయంలో రైతులపై నిందితులు ఆశిష్ మిశ్రా, అంకిత్ దాస్ లైసెన్స్ పొందిన తుపాకుల నుండి కాల్పులు జరిగాయని ఫోరెన్సిక్ సైన్స్ లేబొరేటరీ మంగళవారం ధ్రువీకరించింది. హింసాకాండలో ఆశిష్, అంకిత్ అనేక రౌండ్లు కాల్పులు జరిపారని ఆరోపిస్తూ, కాల్పుల్లో మృతి చెందిన బాధిత రైతు కుటుంబాలు హింసాకాండపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. అటుతర్వాత, లఖింపూర్ ఖేరీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అంకిత్ దాస్ రిపీటర్ గన్, పిస్టల్, అలాగే ఆశిష్ మిశ్రా రైఫిల్, రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు అక్టోబరు 15న ఆ నాలుగు ఆయుధాలను విచారణ కోసం ల్యాబ్‌కు పంపి, ఎఫ్ఎస్ఎల్ నివేదికను కోరారు. కాగా తన ఎస్యూవీ వాహనాన్ని మూడు వ్యవసాయ ‘నల్ల’ చట్టాలకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న రైతుల మీదకు ఎక్కించి హత్యకు ఒడిగట్టినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా తెని కుమారుడు ఆశిష్ మిశ్రా, అతని స్నేహితుడు అంకిత్ దాస్ తుపాకుల నుండి కాల్పులు జరిపినట్లు ఫోరెన్సిక్ నివేదిక వెల్లడిరచింది. పోలీసు ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ ‘ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదిక ఆశిష్ రైఫిల్, అంకిత్ పిస్టల్ నుండి కాల్పులు జరిపినట్లు ధృవీకరించింది’ అని తెలిపారు. నిందితులు కాల్పులు జరిపారని రైతులు ఆరోపించారని ఆయన వివరించారు. హింసాకాండ సమయంలో ఆశిష్, అంకిత్ తమ వద్ద ఉన్న ఆయుధాలతో కాల్పులు జరిపారని దర్యాప్తు నివేదిక పేర్కొంది. ప్రస్తుతం ఆశిష్, అంకిత్ దాస్ లఖింపూర్ ఖేరీ జైలులో ఉన్నారు. ఉత్తరప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కేశవ్ ప్రసాద్ మౌర్య లఖింపూర్ ఖేరీ పర్యటనకు నిరసనగా అక్టోబర్ 3న మూడు వ్యవసాయ ‘నల్ల’ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేపట్టారు. కాగా గత నెలలో జిల్లాలోని టికోనియా ప్రాంతంలో జరిగిన ఈ హింసాకాండ తర్వాత రెండు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయి. వివాదాస్పద వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ ఉంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరిస్తూ అజయ్ మిశ్రా చేసిన వ్యాఖ్యలపై వందలాది మంది రైతులు నిరసనలు చేపట్టారు. ఎఫ్ఐఆర్లలో ఒకటి ఆశిష్, అంకిత్, మరికొందరిపై రైతులు నమోదు చేయగా, గుర్తు తెలియని వ్యక్తులపై బీజేపీ కార్యకర్త మరొక ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటి వరకు 17 మందిని అరెస్టు చేశారు. అయితే ఆశిష్, అతని తండ్రి అజయ్ మిశ్రా ఇద్దరూ ఆ ఎస్‌యూవీలో లేరని వాదించారు. ఆ వాహనాన్ని రైతు నిరసకారుల మీదకు ఎక్కించడంతో నలుగురు రైతులు మరణించారు. అయితే మంత్రి కుమారుడు, అతని స్నేహితుడు ఒక ఎస్యూవీ వాహనంలో ఉన్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ హత్యలు దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని కలిగించాయి. రైతు నాయకులు, ప్రతిపక్ష పార్టీలు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాను బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశాయి. అయితే విశేషమేమిటంటే, అజయ్ మిశ్రా ఇటీవల ఒక బహిరంగ సభలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాతో కలిసి వేదికను పంచుకున్నారు. ఇదిలాఉండగా, ఈ కేసులో ఉత్తర ప్రదేశ్ పోలీసుల దర్యాప్తుపై సుప్రీం కోర్టు సోమవారం అసంతృప్తి వ్యక్తం చేసింది. విచారణను రిటైర్డ్ జడ్జితో పర్యవేక్షించాలని ఆదేశించింది. రైతుల మృతికి సంబంధించి అరెస్టయిన 13 మందిలో కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా కూడా ఉన్నారు.