ప్రముఖ గాయని లతా మంగేష్కర్ మృతి పట్ల రాజ్యసభ ఇవాళ ఘన నివాళులర్పించింది. క్వశ్చన్ అవర్‌ను రద్దు చేశారు. లతాజీ గౌరవార్థం సభను గంట సేపు వాయిదా వేస్తున్నట్లు రాజ్యసభ చైర్మెన్ వెంకయ్యనాయుడు తెలిపారు. ఉదయం పదిగంటలకు రాజ్యసభ ప్రారంభంకాగానే చైర్మన్ వెంకయ్యనాయుడు లతా మంగేష్కర్‌ను స్మరించుకుంటూ సందేశం చదివారు. ాలతాజీ మరణంతో ఈ దేశం ఓ గొప్ప గాయని, దయామూర్తిని, మహోన్నత వ్యక్తిత్వాన్ని కోల్పోయింది. ఆమె మరణ ఒక శకానికి ముగింపు. సంగీత ప్రపంచంలో ఆమె లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనిది.్ణఅని చైర్మన్ వెంకయ్యనాయుడు సంతాపాన్ని వ్యక్తంచేశారు. దేశంలో భిన్నత్వం తరహాలో ఆమె స్వరంలో ఆ శక్తి ఉందని ఆయన అన్నారు. సుమారు 25వేల పాటలకు పైగా ఆమె రికార్డ్ చేశారని, ఏడు దశాబ్ధాల పాటు దేశంలో ప్రతి ఒక్కరి భావోద్వేగాన్ని ఆమె తన గళంలో వినిపించినట్లు వెంకయ్య అన్నారు. 1999 నుంచి 2005 వరకు ఆమె రాజ్యసభలో సభ్యురాలిగా ఉన్నట్లు తెలిపారు. ఓ లెజెండరీ ప్లేబ్యాక్ సింగర్‌ను ఈ దేశం కోల్పోయినట్లు ఆయన చెప్పారు.ఆ తర్వాత సభ్యులంతా రెండు నిముషాలు మౌనం పాటించారు. అటు సాయంత్రం లోక్‌సభ కూడా లతాజీకి నివాళులర్పించి గంటపాటు సభను వాయిదా వేయనుంది.