Friday, March 31, 2023
Friday, March 31, 2023

వంచనకు కుట్ర

. మూడు రాజధానులపై ఆగని వైసీపీ యత్నాలు
. పార్లమెంటులో ప్రైవేటు బిల్లుకు సన్నద్ధం
. ఇప్పటికే లోక్‌సభకు నోటీసిచ్చిన మార్గాని భరత్‌

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి: చట్టపరంగా మూడు రాజధానుల బిల్లును శాసనసభలో ఉపసంహరించుకుని… ఆ మేరకు హైకోర్టులో సైతం అఫిడవిట్‌ దాఖలు చేసిన వైసీపీ ప్రభుత్వం… ప్రజల్లో మాత్రం మూడు రాజధానులపై తాము ముందుకెళుతున్నామన్న భ్రమలు కల్పించడానికి ప్రయత్నిస్తోంది. ప్రజలను నమ్మించడానికిగాను అన్ని అవకాశాలపై నిత్య అన్వేషణ కొనసాగిస్తోంది. రాష్ట్ర రాజధాని ఎంపిక ప్రక్రియ పూర్తయినందున విభజన చట్టం ప్రకారం మరలా మూడు రాజధానులు ఏర్పాటు చేసే అధికారం రాష్ట్రానికి లేదని గతంలో హైకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. అయితే ఆ తీర్పు వచ్చేనాటికే మూడు రాజధానుల బిల్లును వెనక్కి తీసుకుంటున్నట్లు, అసెంబ్లీలోనూ ఉపసంహరించుకుంటున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో అఫిడవిట్‌ దాఖలు చేసింది. కేవలం అమరావతి రాజధానిని విధ్వంసం చేయడానికే మూడు రాజధానుల పల్లవి అందుకున్న అధికారపార్టీ…రాజకీయ ప్రయోజనాల కోసం ఆ నినాదాన్ని మాత్రం నిరంతర ప్రచార అస్త్రంగా ఉపయోగిస్తోంది. వాస్తవానికి మూడు రాజధానుల నిర్మాణానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నం వీసమంత కూడా లేదు. నాలుగు సంవత్సరాలుగా కేవలం నినాదానికి మాత్రమే దానిని పరిమితం చేసింది. చివరకు కర్నూలులో న్యాయ రాజధానిపైనా సుప్రీంకోర్టు ప్రభుత్వ అభిప్రాయాన్ని అడిగిన సందర్భంలో సైతం తమకు ఆ ఉద్దేశమే లేదని స్పష్టం చేసింది. చట్టపరంగా అసెంబ్లీలో, హైకోర్టులో మూడు రాజధానుల బిల్లు ఉపసంహరించుకోవడంతో పాటు సుప్రీంకోర్టులో సైతం కర్నూలులో హైకోర్టు ఏర్పాటు ఉద్దేశం లేదని స్పష్టం చేసిన రాష్ట్ర ప్రభుత్వం… ప్రచారంలో మాత్రం అధికార పార్టీ నేతలు తాము మూడు రాజధానులకు కట్టుబడి ఉన్నామని, పరిపాలనా వికేంద్రీకరణే లక్ష్యమని చెపుతూ ప్రజలను మోసం చేస్తున్నారు. హైకోర్టు తీర్పుపై చివరి రోజు వరకు అప్పీలుకు వెళ్లని రాష్ట్ర ప్రభుత్వం… రాజధాని ఎక్కడ పెట్టాలో నిర్ణయించుకునే అధికారం శాసనసభకు లేదని హైకోర్టు తీర్పు ఇవ్వడం దారుణమంటూ సుప్రీంను ఆశ్రయించింది. దీనినే మూడు రాజధానులకు కట్టుబడి చేస్తున్న పోరాటంగా వైసీపీ చిత్రీకరిస్తోంది. మరో ఏడాదిలో సాధారణ ఎన్నికలు సమీపిస్తుండడంతో మూడు రాజధానుల ప్రచారాన్ని కొంతైనా నిజం చేయాలన్న యోచనతో సీఎం క్యాంపు కార్యాలయాన్ని సాధ్యమైనంత త్వరగా విశాఖలో ప్రారంభించాలని సీఎం జగన్‌ ప్రయత్నిస్తున్నారు. విశాఖలో జరగనున్న జీ`20 సదస్సు సందర్భంగా ముఖ్యమంత్రి అక్కడే మకాం వేసి, ఆ తర్వాత కూడా అక్కడే సమీక్షా సమావేశాలు నిర్వహించాలనే యోచనలో ఉన్నారు. తద్వారా పరిపాలనా రాజధాని విశాఖకు మారినట్లు ప్రజలను భ్రమింపజేయాలనే యోచనతో పాలకపెద్దలున్నారు. తాజాగా వైసీపీ ఎంపీ మార్గాని భరత్‌ లోక్‌సభలో ప్రైవేటు మెంబర్‌ బిల్లు పెట్టేందుకు నోటీసిచ్చారు. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుతో పాటు విభజన హామీలు నెరవేర్చేందుకు వీలుగా విభజన చట్టంలో సవరణలు చేయాలని కోరుతూ మార్గాని భరత్‌ ప్రైవేటు మెంబర్‌ బిల్లు పెట్టేందుకు లోక్‌సభ అనుమతి కోరారు. దీన్ని పరిశీలించిన లోక్‌సభ సచివాలయం ఈ ప్రైవేటు బిల్లు ప్రవేశపెట్టేందుకు ఆమోదం తెలిపింది. దీనిపై తగు చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇస్తున్నట్లు ఎంపీకి సమాచారం పంపినట్లు తెలిసింది. దీంతో ప్రైవేటు మెంబర్‌ బిల్లు త్వరలోనే పార్లమెంటు ముందుకు రాబోతోంది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో దీనిపై కేసు నడుస్తున్నందున పార్లమెంటులో ఈ బిల్లుపై చర్చించే అవకాశాలు తక్కువేనంటున్నారు. ఒకవేళ బీజేపీతో ఉన్న సత్సంబంధాలను వినియోగించి లోక్‌సభలో చర్చకు ఆహ్వానించి విభజన చట్టంలో మార్పులు చేయగలిగితే మాత్రం మూడు రాజధానులకు లైన్‌ క్లియర్‌ అవుతుందన్న ఆశలో వైసీపీ నేతలున్నారు. అప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో సంబంధం లేకుండానే మూడు రాజధానుల ప్రక్రియ చేపట్టేందుకు ఏపీ అసెంబ్లీకి అవకాశం ఉంటుందని, ప్రస్తుతం శాసనమండలిలోనూ వైసీపీ మెజార్టీ పెరిగినందున రెండుసభల్లో మరోసారి మూడు రాజధానుల బిల్లును ఆమోదింపజేసుకోవచ్చని అధికారపార్టీ నేతలు భావిస్తున్నారు. ఇదంతా ప్రజలను మభ్యపెట్టడానికి వైసీపీ ప్రచారానికి ఉపయోగపడుతుందేమో కానీ…ఆచరణలో మాత్రం అమరావతి రాజధానిని నిర్వీర్యం చేయడం అసాధ్యమని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img