Tuesday, December 5, 2023
Tuesday, December 5, 2023

వంట గ్యాస్‌ ధరలు తగ్గించాలి

లీటర్‌ డీజిల్‌ రూ.50, పెట్రోలు రూ.60కు ఇవ్వాలి
గ్యాస్‌ సిలిండర్‌ రూ.500కు అందించాలి
సీపీఐ రాష్ట్ర సమితి తీర్మానం

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: మోదీ ప్రభుత్వం పదేపదే పెంచుతున్న పెట్రో, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలను తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ రాష్ట్ర సమితి తీర్మానించింది. సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాలు ఈనెల 5, 6 తేదీల్లో విజయవాడ దాసరిభవన్‌లో జంగాల అజయ్‌కుమార్‌ అధ్యక్షతన జరిగాయి. సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పాల్గొన్న ఈ సమావేశంలో, పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు పెట్రోల్‌, డీజిల్‌, వంట గ్యాస్‌ ధరలను తగ్గించాల్సిన అవశ్యకతపై తీర్మానాన్ని ప్రవేశపెట్టగా సమితి ఏకగ్రీవంగా ఆమోదించింది. డీజిల్‌ లీటరు రూ.50, పెట్రోలు లీటరు రూ.60, గ్యాస్‌ సిలెండర్‌ రూ.500కు అందించాలని సమావేశం డిమాండ్‌ చేసింది. మోదీ 2014 ఎన్నికల ముందు ఆ నాటికి ఉన్న డీజిల్‌ ధర రూ.46, పెట్రోలు ధర రూ.54, వంటగ్యాస్‌ ధర రూ.410 వరకు ఉన్న ధరలు మండిపోతున్నాయని, వాటిని తగ్గిస్తామని దేశ ప్రజలకు హామీ యిచ్చారని తెలిపింది. బీజేపీ అగ్రనాయకులు సిలెండర్లు నెత్తిన పెట్టుకుని పెద్ద ఎత్తున ప్రచారం చేశారని, ఎనిమిదేళ్లుగా మోదీ పాలనలో ముడి చమురు ధర పోల్చి చూపనప్పటికీ, డీజిల్‌, పెట్రోలు, వంటగ్యాస్‌ ధరలను లెక్కలేనన్ని సార్లు పెంచి దేశ ప్రజలపై మోయలేనంతగా భారం వేశారని సమావేశం విమర్శించింది. ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు ధరలను నిలకడగా ఉంచి, ఎన్నికలైన మరుక్షణం నుంచి 16రోజుల వ్యవధిలో 14సార్లు ధరలు పెంచిన దుర్మార్గాన్ని దేశ ప్రజలు మర్చిపోలేదని తెలిపింది. ఇవాళ మరోసారి వంట గ్యాస్‌పై ధర రూ.50 పెంచి తన ప్రజా వ్యతిరేకతను మోదీ ప్రభుత్వం నిర్భీతిగా చాటుకుందని వివరించింది. పెట్రోలు రూ.122, డీజిల్‌ రూ.110, వంట గ్యాస్‌ రూ.1025కి చేరిన సందర్భంలో, పెట్రోల్‌కు రూ.10, డీజిల్‌కు రూ.8, గ్యాస్‌ను వాడలేని నిరుపేద కనెక్షన్‌ దారులకు రూ.200 తగ్గించి మోసపు ఎత్తుగడలకు పాల్పడ్డారని పేర్కొంది. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వం సుమారు రూ.28లక్షల కోట్లను పెట్రోలు ఉత్పత్తుల నుంచి సంపాదించిందని, రాష్ట్ర ప్రభుత్వమూ పెంచిన పెట్రోల్‌ ధరల ద్వారా తమకు వచ్చే ఆబ్కారీ పన్ను ఆదాయం నుంచి ఒక్క రూపాయి తగ్గించడానికి ఇష్టపడలేదని గుర్తుచేసింది. 2014 నాటి మోదీ వాగ్ధానాలను నిస్సిగ్గుగా కేంద్రం వదిలివేసిందని ధ్వజమెత్తింది. మొత్తం నిత్యవసర వస్తువుల ధరలు, అదుపు లేకుండా పెరగడానికి కారణభూతమైన కేంద్ర ప్రభుత్వంపై ప్రజా ఉద్యమాలను కొనసాగించాల్సి అవసరముందని పిలుపునిచ్చింది. ధరల భారంతో బాధపడుతున్న ప్రజలకు ఉపశమనం కలుగచేయడానికి దేశ, రాష్ట్రాలలో ఉన్న కోట్లాది మంది వాహన చోదకుల ప్రయాణ భారాలను తగ్గించటానికిగాను డీజిల్‌ లీటరు రూ.50, పెట్రోల్‌ లీటర్‌ రూ.60, వంటగ్యాస్‌ రూ.500కు ఇవ్వాలని రాష్ట్ర సమితి డిమాండ్‌ చేసింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రవేశపెట్టిన కార్యదర్శి నివేదికపై జరిగిన చర్చలో 42 మంది పాల్గొన్నారు. అనంతరం నివేదికను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img