నాలుగో వేవ్‌పై అప్రమత్తత అవరసమంటున్న నిపుణులు
కరోనా వైరస్ ఓ పట్టాన కట్టడి కావడం లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అది సరికొత్త రూపాలతో మళ్లీ మళ్లీ మనల్ని పట్టి పీడిస్తోంది. ఇక కరోనా దాదాపుగా ఖతమయ్యిందనుకున్నాం. ఇక ముప్పు తప్పినట్టేనని హాయిగా ఊపిరి పీల్చుకోవచ్చని అనుకుంటున్న తరుణంలో కొత్త కోవిడ్ వేరియంట్ వణికిస్తోంది. ఇప్పటికే చైనాను హడలెత్తిస్తోన్న ఆ కోవిడ్ వేరియంట్ బ్రిటన్ను కూడా గడగడలాడిస్తోంది.. ఒమిక్రాన్ వేరియంట్లో సరికొత్త సబ్ వేరియంట్ అయిన ఈ వైరస్‌కు చాలా చాలా ప్రమాదకారి అని సైంటిస్టులు చెబుతున్నారు. కరోనా కన్నా పది రెట్లు ముప్పువాటిల్లే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.చైనాలో సరికొత్త కోవిడ్ వేరియంట్ విజృంభిస్తోంది. షాంఘై నగరం వైరస్‌తో భీతిల్లుతోంది. ప్రస్తుతం షాంఘైలో రెండు వేల మంది సైనిక వైద్య సిబ్బంది, పది వేల మంది ఆరోగ్య కార్యకర్తలు అహర్నిశలు తీవ్రంగా శ్రమిస్తున్నారు. సుమారు రెండున్నర కోట్ల మందికి ప్రభుత్వం సామూహిక కోవిడ్ పరీక్షలను నిర్వహిస్తోంది. ముందు జాగ్రత్తగా వారం కిందట లాక్డౌన్ విధించినప్పటికీ వైరస్ శరవేగంతో వ్యాప్తి చెందుతోంది.రెండేళ్ళ క్రితం నాటి లాక్డౌన్ కంటే ఇప్పుడు మరింత కఠినమైన ఆంక్షలను అమలు చేస్తోంది చైనా ప్రభుత్వం. ప్రపంచ వ్యాప్తంగా కోవిడ్ మహమ్మారి ముప్పు మరోమారు తప్పదని చైనా తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్లు బిఏ1, బిఏ2 నుంచి రూపాంతరం చెందిన ఈ వేరియంట్‌ని ఎక్స్ఈగా పేర్కొంటున్నారు. ముప్పేటా ముంచుకొస్తోన్న మహమ్మారి ప్రమాదంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను అప్రమత్తం చేస్తోంది.
కరోనా బీఏ2 ఒమిక్రాన్ తో పోలిస్తే ఒమిక్రాన్ ఎక్స్ఈ సబ్ వేరియంట్ వృద్ధి రేటు పది శాతం ఎక్కువగా ఉన్నట్టు డబ్ల్యూహెచ్ఓ ఎపిడెమియోలాజికల్ నివేదిక హెచ్చరించింది. మొన్న ఒక్క రోజే చైనాలో 13 వేల కేసులు నమోదయ్యాయి. గత రెండేళ్ళలో అంటే ఫిబ్రవరి 2020 తర్వాత చైనాలో నమోదైన అత్యధిక కేసులు ఇవే కావడం గమనార్హం. పరిస్థితులు ఎంత భయానకంగా ఉన్నాయో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మరోవైపు కోవిడ్ ప్రభావంతో విలవిల్లాడిన బ్రిటన్‌లో మరోసారి ప్రమాదకర పరిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బిఏ 2 ఇప్పుడు బ్రిటన్ గుండెల్లో రైళ్ళు పరిగెట్టిస్తోంది. గత వారం బ్రిటన్ లో 49లక్షల మంది వైరస్ బారినపడినట్లు ఆఫీస్ ఫర్ నేషనల్ స్టాటిస్టిక్స్ వెల్లడిరచింది. నిజానికి ఈ కొత్త కరోనా వేరియంట్‌ను మొదట జనవరి 19న బ్రిటన్‌లో గుర్తించారు. అప్పుడు బ్రిటన్‌లో 600 కంటే అధికంగా ఎక్స్ఈ కేసులు నమోదైనట్టు డబ్ల్యుహెచ్వో వెల్లడిరచింది. కరోనా ముప్పు తప్పినట్టేనన్న ధీమాతో గత ఏడాది ఫిబ్రవరిలోనే బ్రిటన్ ప్రభుత్వం కరోనా ఆంక్షలను ఎత్తివేసింది. అలా తొందరపడిరది. ఆ తొందరపాటు వల్లే ఇప్పుడీ పరిస్థితి దాపురించిందని విపక్షాలు గగ్గొలు పెడుతున్నాయి. అయితే కరోనా విజృంభణతో బ్రిటన్ హాస్పిటల్స్ లోచేరేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతున్నప్పటికీ.. మరణాల రేటు తక్కువగా ఉండటం కొంచెం ఉపశమనం కలిగించే విషయం. చైనా, బ్రిటన్లతో పాటు ఇప్పుడు అమెరికాలోనూ ఈ వేరియంట్ వేగంగా విజృంభిస్తోంది.
కరోనా వేరియంట్ ఒరిజినల్ మ్యూటెంట్ల కన్నా బిఏ2 అధిక శక్తివంతంగా ఉంది. అంతేకాదు ఇది టీకాలకు కూడా అంతుబట్టడంలేదు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి కూడా ఈ వేరియంట్ అంటుకుంటోంది అంతేకాదు. బహుళ వేరియంట్ల బారిన పడిన వారిలో ఈ బిఏ 2 మ్యూటెంట్ అత్యధికంగా కనిపిస్తుండడం ఆందోళన కలిగించే అంశం.
ఇక మన దేశం విషయానికి వస్తే, ఒమిక్రాన్ వేరియంట్ (థర్డ్ వేవ్) ప్రారంభమైన తర్వాత మన దేశంలో కోవిడ్ -19 పాజిటివ్ కేసుల సంఖ్య తక్కువగా నమోదవుతున్నప్పటికీ, ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా నాలుగోవేవ్ దాడి చేసే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిజానికి కోవిడ్ ఉధృతి ప్రారంభమైనప్పటి నుంచి ఢల్లీి, మహారాష్ట్రలలో గరిష్ఠ స్థాయిలో కేసులు నమోదైన సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిస్థితి కొంత మెరుగుపడటంతో మాస్క్ ధరించడం మంచిదే కానీ తప్పనిసరేంకాదని ఈ రెండు రాష్ట్రాలు ప్రకటించాయి. ఐతే కోవిడ్ ఇప్పటికీ పూర్తిగా అదుపులోకి రాలేదనేది జగమెరిగిన సత్యం. యూఎస్, యూకే, చైనా, హాంకాంగ్ దేశాల్లో కేసులు మళ్లీ పెరగడం ప్రారంభమయ్యాయి. ఇండియాకు ఈ పరిస్థితి ఎదురుకాదనే గ్యారెంటీ ఏమీ లేదు. అందుకే వైరస్ పూర్తిగా తగ్గిపోయే వరకు కోవిడ్ ప్రోటోకాల్ కనీసం ఒక ఏడాది పాటైనా కొనసాగిస్తే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి కోవిడ్ నాలుగో వేవ్‌పై అప్రమత్త ఎంతైనా అవసరం.