Tuesday, November 29, 2022
Tuesday, November 29, 2022

వానలే…వానలు

వరదనీటిలో వందలాది గ్రామాలు
విద్యుత్‌ సదుపాయం లేక అంధకారం
పొంగిపొర్లుతున్న నదులు
బ నిండుకుండల్లా ప్రాజెక్టులు

విశాలాంధ్ర బ్యూరో-విశాఖపట్నం: రాష్ట్రవ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. నదులు, వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తు కారణంగా వస్తున్న వరదతో ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అనేక గ్రామాలు వరద నీటిలో చిక్కుకున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు అనేక చోట్ల రహదారులకు గండ్లు ఏర్పడడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడిరది. ఉత్తరాంధ్ర ఏజెన్సీ గ్రామాల్లో వర్షం కష్టాలు వర్ణనాతీతం. గ్రామాల్లో రెండు రోజులుగా విద్యుత్‌ సరఫరా లేక ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. రానున్న నాలుగైదు రోజుల్లో గోదావరికి తీవ్ర వరద పోటు తలెత్తుతుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ధవళేశ్వరం వద్ద గోదావరి పోటెత్తింది. ధవళేశ్వరం నుంచి 2.21 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేశారు. ఇప్పటికే బ్యారేజీ నీటిమట్టం 13.65 అడుగులకు చేరుకుంది.175 గేట్ల ద్వారా వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇటు ఉత్తరాంధ్ర జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వంశధార, నాగావళి, తోటపల్లి, జంజావతి, తాటిపూడి, రైవాడ, మేగాద్రి గెడ్డలో వరద నీటి ప్రవాహం అధికమైంది. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం లేదా అల్పపీడన ద్రోణి ఏర్పడే అవకాశం ఉందని ఇది బలపడితే వర్షాలు మరింత అధికంగా కురుస్తాయని వాతావరణ శాఖ అధికా రులు తెలియజేస్తున్నారు. మరోపక్క చురుగ్గా కదులుతున్న నైరుతి రుతుపవనాలకు ఆవర్తనాలు తోడవడంతో రెండు మూడు రోజుల నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో, భారత వాతావరణ విభాగం (ఐఎండీ) దేశంలోని పలు రాష్ట్రాలకు వర్ష సూచన చేసింది. రాగల మూడు రోజుల్లో ఏపీ, తెలంగాణ, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఒడిశా, చత్తీస్‌ గఢ్‌ రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడిరచింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు, కొన్ని చోట్ల భారీ వర్షాలు పడతాయని తెలిపింది. ముఖ్యంగా, రానున్న మూడు రోజులు పాటు కోస్తాంధ్ర, తెలంగాణ, యానాంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ వెల్లడిరచింది.
బలివేకు గండి
ముసునూరు: మండలంలోని కృష్ణా జిల్లా నుంచి పశ్చిమగోదావరి జిల్లా (ఏలూరు)లను కలుపు ముసునూరు మండలంలోని బలివే గ్రామం వద్ద ఉన్న తమ్మిలేరు వరద ఉధృతికి గండి పడిరది. దీంతో రెండు జిల్లాల ప్రజల రాకపోకలకు పూర్తి అంతరాయం ఏర్పడిరది. వర్షానికి తోడు ఈదురుగాలులకు రోడ్డుపై చెట్టు అడ్డంగా పడిపోయాయి.
ప్రకాశం బ్యారేజీకి వరద నీరు… 25 గేట్లు ఎత్తివేత
తాడేపల్లి: తాడేపల్లి సీతానగరం ప్రకాశం బ్యారేజీకి పెద్దఎత్తున వరద నీరు వచ్చి చేరింది. దీంతో బ్యారేజీ 25 గేట్లను తెరిచి నీటిని దిగువకు వదులుతున్నారు. కృష్ణానది పరివాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం పెరిగిందని అధికారులు తెలిపారు. ఎగువ నుంచి 42 వేల క్యూసెక్కుల వరద నీరు వస్తున్నదన్నారు. ప్రకాశం బ్యారేజీ గేట్లు తెరిచి దిగువకు నీటిని విడుదల చేయడం ఈ సీజన్‌లో ఇదే తొలిసారి. ఇప్పటికే కాల్వల ద్వారా ఖరీఫ్‌ సాగుకు కృష్ణా తూర్పు, పడమరలకు నీటిని విడుదల చేశారు. పరివాహక ప్రాంతాల ప్రజలు మరో రెండు రోజుల పాటు పశువులు, గొర్రెలు, మేకలను మేతకు తీసుకెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img