Saturday, December 10, 2022
Saturday, December 10, 2022

వామపక్ష ఐక్యత ముఖ్యం

రాజ్యాంగ పరిరక్షణకు ఉద్యమిద్దాం

. మోదీ దుష్టపాలనకు చరమగీతం పాడదాం
. సీపీఐ జాతీయ మహాసభలు ప్రారంభిస్తూ డి.రాజా పిలుపు

విశాలాంధ్ర`గురుదాస్‌ దాస్‌గుప్తా నగర్‌ (విజయవాడ): కేంద్రంలో బీజేపీ ప్రజా వ్యతిరేక దుష్టపాలనకు చరమగీతం పాడేందుకు బలీయమైన వామపక్ష ఐక్యతే ముఖ్యమని, 2024లో జరుగనున్న ఎన్నికల నేపథó్యంలో అన్ని వామపక్ష పార్టీలు ఆ దిశగా కార్యాచరణను రూపొందించుకుని ముందుకు సాగాలని సీపీఐ ప్రధానకార్యదర్శి డి.రాజా పిలుపునిచ్చారు. అవినీతి, అసమర్థ విధానాలతో దేశాన్ని సర్వ నాశనం చేస్తూ, ప్రజల మధ్య విద్వేషాలను సృష్టిస్తూ మత సామరస్యాన్ని దెబ్బతీస్తూ రాజకీయ వాతావరణాన్ని తీవ్రంగా కలుషితం చేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించేంతవరకు విశ్రమించబోమన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం ప్రజానీకాన్ని చైతన్యవంతులను చేస్తూ, సామాజిక ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని ప్రకటించారు. ఆర్‌ఎస్‌ఎస్‌, బీజేపీ కూటమి విషపూరిత విధానాలకు వ్యతిరేకంగా రాజీలేని ఐక్యపోరాటాలను నిర్వహిస్తామన్నారు. దేశం, ప్రజల మౌలిక ప్రయోజనాలను రక్షించడంలో వామపక్షాలు చారిత్రాత్మక పాత్రను పోషించాల్సి ఉందన్నారు. వామపక్ష ఐక్యత, అన్ని లౌకిక, ప్రజాస్వామ్య, దేశభక్తియుత శక్తుల ఐక్యతా బావుటాను ఎగురవేసేందుకు తమ వంతు కృషిని సీపీఐ కొనసాగిస్తుందని స్పష్టం చేశారు. విజయవాడలో శుక్రవారం సీపీఐ 24వ జాతీయ మహాసభలను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. జాతీయ, అంతర్జాతీయ రాజకీయ పరిస్థితులను వివరించారు. భవిష్యత్‌ పోరాటాల ప్రాధాన్యతను వక్కాణించారు. ఒకే నగరంలో మూడుసార్లు జాతీయ మహాసభలు ఇంతవరకు పార్టీ చరిత్రలో జరగలేదని, ఆ అరుదైన ఖ్యాతి విజయవాడ నగరానికే దక్కిందంటూ జేజేలు పలికారు. కమ్యూనిస్టు ఉద్యమానికి పెట్టని కోటగా నగరం నిలుస్తోందని, తొలి మేయర్‌గా టి.వెంకటేశ్వరరావు ఎన్నిక కావడం పార్టీ బలోపేతానికి నిదర్శనమన్నారు. చండ్ర రాజేశ్వరరావు, రావి నారాయణ రెడ్డి, పుచ్చలపల్లి సుందరయ్య, బసవ పున్నయ్య, ముఖ్ధుం మొహియుద్దీన్‌, నీలం రాజశేఖరరెడ్డి లాంటి అతిరథ, మహారధులు దేశంలో వామపక్ష ఉద్యమ బలోపేతానికి అజరామరమైన కృషి చేశారంటూ నివాళులర్పించారు. నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సాగించిన తెలంగాణా సాయుధ పోరాటం దేశ గతినే మార్చేసిందన్నారు. అంతర్జాతీయంగా కూడా వామపక్ష శక్తులపై దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయన్నారు. నయా వలసవాదం, వివక్షత, జాతి అహంకారం, సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటాలు మరింత ఊపందుకుంటున్నాయన్నారు. మితవాద శక్తుల తీవ్ర దాడులు జరుగుతున్నప్పటికీ, ఈ విషాద సమయంలోనూ వామపక్షాల నాయకత్వంలో జనాదరణ, సైద్ధాంతిక పోరాటాల రూపంలో ప్రపంచవ్యాప్తంగా ఆశారేఖలు గోచరిస్తున్నాయన్నారు. పాలస్తీనా ప్రజల పోరాటానికి మద్దతు ప్రకటించారు. క్యూబాపై ఆర్థిక ఆంక్షలను ఎత్తేయాలని డిమాండ్‌ చేశారు. క్యూబా ప్రజల పోరాటానికి కూడా సంఫీుభావాన్ని ప్రకటించారు. దేశ రాజకీయ పరిస్థితులను వివరిస్తూ నరేంద్ర మోదీ దుర్మార్గమైన విధానాలతో ముందుకు సాగుతూ అన్ని వ్యవస్థలను సర్వ నాశనం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. పేదరికం, ఆర్థిక అసమానతలు, నిరుద్యోగం, దారిద్య్రం పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేస్తున్నదని, ఇది మన ఆర్థిక సార్వభౌమత్వానికి ముప్పుగా పరిణమించిందని ఆవేదన వెలిబుచ్చారు. సామాజిక భావనను ఇది వమ్ము చేస్తుందన్నారు. ఎలాంటి సామాజిక బాధ్యతలేని బహుళజాతి కార్పొరేట్‌ దిగ్గజాలకు మన దేశ సహజ వనరులను దోచిపెడుతోందన్నారు. అడవులు, గనులు, నదులు తమ క్షేత్రాలు వారి దోపిడీకి దారాదత్తం చేస్తుందని ఆయన ఆగ్రహం వ్యక్తంచేశారు. పెట్టుబడిదారీ విధానాల వికృత భావనలు తలుపులు తడుతున్నాయని, దీనికి ఉదాహరణే ఇటీవల ఉపసంహరించిన వ్యవసాయ నల్లచట్టాలు అని పేర్కొన్నారు. గ్రామీణ భారతాన్ని కార్పొరేట్లకు అప్పగించడం, వ్యవసాయ చట్టాల ఉద్దేశం. తయారీ, సేవల రంగం తర్వాత దేశంలోని వ్యవసాయ అనుబంధ కార్యకలాపాలపై ఆదిపత్యానికి పెట్టుబడిదారులు కన్నేస్తున్నారని రాజా వివరించారు. రోజురోజుకూ నిరుద్యోగం పెరిగిపోతోందని, నైరాశ్యంతో యువత కొట్టుమిట్టాడుతోందన్నారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలిస్తామన్న నరేంద్ర మోదీ వాగ్ధానం ఏమైందని రాజా నిలదీశారు. భారతీయ భావనపై మరింత శక్తివంతంగా కేంద్ర మద్దతుతో ఆర్‌ఎస్‌ఎస్‌ దాడి కొనసాగిస్తున్నదని, హిందీ, హిందూ, హిందూస్థాన్‌ అన్న వారి భావన ఏకాండి తత్వంతో కూడినదన్నారు. దేశవ్యాప్తంగా మైనార్టీలపై ఆర్‌ఎస్‌ఎస్‌ దాడులు పెచ్చుమీరాయని, రాజ్యాంగం 5వ షెడ్యూలు, ఈపీఎస్‌యూ చట్టాలను నీచంగా అమలు జరపడంతో గిరిజనుల భూహక్కుల ఉల్లంఘన తీవ్ర సమస్యగా పరిణమించిందన్నారు. కుల గణన నిర్వహించాలన్న డిమాండ్‌ పెరుగుతోందని, అయితే కులాన్ని ప్రామాణికంగా చేర్చకూడదని బీజేపీ మొండివైఖరితో ఉండడంతో, వెనుకబడిన కులాల్లో అశాంతికి ఆజ్యం పోస్తుందన్నారు. భారతీయ సమాజం పరస్పర విరుద్ధమైన ప్రయోజనాలు కుల వర్గాల మధ్య మాత్రమే విభజించింది కాదని అర్థం చేసుకోవాలని, స్థితిస్థాపక, ధృడమైన, క్రమానుగత కుల వ్యవస్థ కూడా మనకు ఉందని గుర్తు చేశారు. కులం క్రమానుగత నిర్మాణాన్ని నిర్మూలించకుండా, ఏ విప్లవాత్మక వ్యూహం విజయవంతం కాదని గమనించాల్సి ఉంటుందన్నారు. సమాజంలో చీలికలు సృష్టించేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ కుయుక్తులు పన్నుతోందని, ఈ నేపథó్యంలో ఇటీవల ఆర్‌ఎస్‌ఎస్‌ అధినేత మోహన్‌ భగవత్‌ చేసిన ప్రసంగాన్ని నిశితంగా చూడాల్సి ఉంటుందన్నారు. కోవిడ్‌ 19 సంక్షోభం మన సమాజాన్ని క్షతగాత్రురాలిని చేసిందని, విద్యలో అంతరం, డిజిటల్‌ విభజన, పెరుగుతున్న విద్య ప్రైవేటీకరణ, చాలా మందికి విద్యను సుదూర స్పప్నంగా చేశాయని రాజా ఆవేదన వ్యక్తం చేశారు. కబీర్‌, కాళీదాసు వంటి మధ్యయుగం నాటి కవులపై సమానత్వం, పెరియార్‌, అయ్యన్‌కళ్లి ప్రబోధించిన హేతుబద్దత, నారాయణ గురు, డాక్టర్‌ అంబేద్కర్‌ అణగారిన వర్గాల ప్రజల హక్కుల కోసం చేసిన కృషి మన పోరాటాల్లో భాగం కావాలని సీపీఐ శ్రేణులకు ఉద్భోదించారు. విద్వేషంతో ప్రజలను కలుషితం చేసేందుకు ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రయత్నిస్తోందని, దానిని మనం సామరస్యం, ఐక్యతతో తిరిగి స్వాధీనం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వామపక్ష ఐక్యత, అన్ని లౌకిక, ప్రజాస్వామ్య దేశభక్తియుత శక్తుల ఐక్యతకు సీపీఐ శక్తివంచనలేకుండా కృషి చేస్తుందని పునరుద్ఘాటించారు. మెరుగైన ప్రపంచం, మెరుగైన సమాజం కోసం మరింత శక్తివంతంగా విప్లవ ఉత్సాహంతో కొనసాగాలని, పార్టీ శ్రేణులకు రాజా పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img