Wednesday, September 27, 2023
Wednesday, September 27, 2023

విద్యతోనే పేదరిక నిర్మూలన

విద్యార్థులకు చదువే ఆస్తి
విద్యారంగం రూపురేఖలు మారుస్తున్నాం
8వ తరగతి విద్యార్థులకు ట్యాబ్‌లు ఇస్తాం
విద్యాకానుక పంపిణీ సభలో ముఖ్యమంత్రి జగన్‌

విశాలాంధ్ర బ్యూరోకర్నూలు: విద్యార్థులకు చదువే ఆస్తి అని, చదువు ద్వారానే పేదరికాన్ని పారదోలవచ్చని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా విద్యాకానుక మూడవ విడత పంపిణీ కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ఆదోని మున్సిపల్‌ హైస్కూల్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసిన వైఎస్‌ఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సీఎం జగన్‌ మాట్లాడుతూ తాము అధికారం చేపట్టిన నాటి నుంచి విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఇంగ్లీషు విద్యను అభ్యసిస్తే ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లి బతకవచ్చనే గొప్ప ఆశయంతో ఇంగ్లీసు మాధ్యమాన్ని ప్రవేశపెట్టామని సీఎం చెప్పారు. విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తూ...నాడునేడు ద్వారా పాఠశాలల రూపురేఖలు మారుస్తున్నామన్నారు. డబ్బు లేనికారణంగా విద్యార్థులు చదువుకు దూరం కారాదన్న లక్ష్యం జగనన్న అమ్మఒడి ద్వారా తల్లుల ఖాతాల్లో రూ.15 వేలు వేస్తున్నామన్నారు. పేదరికం కారణంగా పిల్లలను చదివించలేని పరిస్థితి రాష్ట్రంలో ఉండరాదని తెలిపారు. కుటుంబంపై భారం పడకుండా విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నామని, మెనూలో మార్పులు చేసి నాణ్యమైన ఆహారం అందిస్తున్నామని చెప్పారు. మెరుగైన విద్య అందించాలని జైజూస్‌తో ఒప్పందం కుదుర్చుకొని విద్యార్థులకు నాణ్యమైన విద్య లభించేలా కృషి చేస్తున్నామన్నారు. రేపటి తరం విద్యార్థుల భవిష్యత్‌పై దృష్టి సారించామన్నారు. జగనన్న విద్యాకానుక కింద ఒకటవ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న 47,40,461 మంది విద్యార్థులకు మూడోవిడతగా రూ.931 కోట్ల ఖర్చుతో బ్యాగులు, స్కూల్‌ డ్రెస్‌లు, బూట్లు, బెల్టు, టై, పాఠ్యపుస్తకాలు, నోట్‌పుస్తకాలు అందిస్తున్నామన్నారు. 8వ తరగతి విద్యార్థులకు ఈ ఏడాది అక్టోబరులో 4.70 లక్షల మందికి 12 వేల ఖరీదు చేసే ట్యాబ్‌లు ఇస్తామన్నారు. ఉన్నత విద్య అభ్యసించే విద్యార్థులకు విద్యాదీవెన, వసతి దీవెన ద్వారా చదువుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. మూడేళ్ల నుండి ప్రైవేట్‌ పాఠశాలల్లో చదువుకునే విద్యార్థులు చాలామంది ప్రభుత్వ పాఠశాలలకు వస్తున్నారన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ కార్పొరేట్‌ విద్య అందించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. విద్యాశాఖమంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్రంలో 175 నియోజకవర్గాలలో డిగ్రీ కళాశాలల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు. ప్రైవేట్‌ కార్పొరేట్‌ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్య అందించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్న విద్యార్థుల సంఖ్య పెరిగిందన్నారు. ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్‌రెడ్డి, జిల్లా కలెక్టర్‌ పి.కోటేశ్వరావు ప్రసంగించారు.
అనంతరం విద్యార్థులకు కిట్లు పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించారు. మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యేలు బాలనాగిరెడ్డి, ఎర్రకోట కేశవరెడ్డి, కంగాటి శ్రీదేవి, ఎమ్మెల్సీ శివరామిరెడ్డి, ఎంపీ సంజీవకుమార్‌, ఆదోని మున్సిపల్‌ చైర్మన్‌ బోయ శాంత, మాజీ ఎంపీ బుట్టా రేణుక, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, వైసీపీ నాయకులు రుద్రగౌడ్‌, డీఈఓ రంగారెడ్డి, ఎస్పీ సిద్దార్థ కౌశల్‌ పాల్గొన్నారు.
ఆదోనిలో అప్రకటిత కర్య్ఫూ: సీఎం పర్యటన సందర్భంగా పట్టణంలో అప్రకటిత కర్ఫ్యూ వాతావరణం నెలకొంది. పట్టణంలోని షాపులన్నీ మూయించారు. ప్రధాన రహదారికి రెండువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. రోడ్డుపై అనుమతి లేని వాహనాలు, వ్యక్తులు తిరగకుండా పోలీసులు అడ్డుకున్నారు. బారికేడ్లు ఏర్పాటు చేయడం వలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆదోని పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రికి హెలిప్యాడ్‌ వద్ద ప్రజాప్రతినిధులు, అధికారులు ఘనస్వాగతం పలికారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img