Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

విద్యతో పేదరికం మాయం

పిల్లలకు ఇచ్చే ఆస్తి చదువే
రాష్ట్రంలో 33శాతం నిరక్షరాస్యులు
అందుకే విద్యాదీవెనకుఅత్యంత ప్రాధాన్యత
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌
10.97లక్షల మంది తల్లుల ఖాతాల్లో రూ.694కోట్లు జమ

అమరావతి : ఉన్నత చదువులతోనే పేదరిక నిర్మూలన సాధ్యపడుతుందని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. పిల్లలను విద్యావంతులుగా తీర్చిదిద్దగలిగితే అదే వారికిచ్చే పెద్ద ఆస్తి అన్నారు. ప్రభుత్వం తరపున ఆర్థిక భరోసా ఇచ్చేందుకు జగనన్న విద్యాదీవెన పథకం అమలు చేస్తూ నేరుగా తల్లుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తున్నామని సీఎం చెప్పారు. ఈ ఏడాది రెండో విడత విద్యాదీవెనలో భాగంగా గురువారం 10.97లక్షల మంది

విద్యార్థులకు రూ.693.81 కోట్లను తల్లుల ఖాతాల్లో సీఎం జగన్‌ తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్‌నొక్కి జమ చేశారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ కొన్ని విషయాల్లో మనం ఇంకా చాలా వెనకబాటులో ఉన్నామన్నారు. 2011 లెక్కల ప్రకారం దేశంలో నిరక్షరాస్యులు 27శాతం ఉంటే, రాష్ట్రంలో 33శాతం మంది ఉన్నారని తెలిపారు. బ్రిక్స్‌ దేశాలతో పోలిస్తే 73శాతం మంది పిల్లలు ఇంటర్మీడియట్‌ తర్వాత కాలేజీల్లో చేరడం లేదన్నారు. పిల్లలు ఉన్నత చదువులు చదవకపోతే, పైస్థాయి ఉద్యోగాలు సాధించలేకపోతే పేదరిక నిర్మూలన అసాధ్యమని సీఎం విశ్లేషించారు. అందుకే విద్యార్థులకు ఉన్నత చదువులను అందుబాటులోకి తీసుకురావాలని నిశ్చయించామని, ఇందుకోసం తల్లిదండ్రులు అప్పుల పాలు కాకుండా నూరుశాతం ఫీజు రీయింబర్స్‌మెంట్‌ చేస్తున్నామని చెప్పారు. హాస్టల్‌ ఖర్చుల కోసం వసతి దీవెన పథకం కింద సంవత్సరానికి రూ.20వేలు ఇస్తున్నామన్నారు.
విద్యారంగంపై రూ.26వేల కోట్లు ఖర్చు
విద్యారంగంలో ఇప్పటివరకు జగనన్న అమ్మఒడి ద్వారా 44,48,865 మంది తల్లులకు రూ.13,022 కోట్లు జమచేశామని, జగనన్న విద్యాదీవెన ద్వారా 18,80,934 మందికి 5,573 కోట్ల రూపాయలు, జగనన్న వసతి దీవెన ద్వారా 15,56,956 మందికి 2,270 కోట్ల రూపాయలు, జగనన్న గోరుముద్ద ద్వారా 36,88,618 మందికి రూ.1600 కోట్లు, జగనన్న విద్యాకానుక ద్వారా 45 లక్షల మంది పిల్లలకు 650 కోట్ల రూపాయలు, మనబడి నాడు – నేడు కింద తొలిదశలో 15,205 స్కూళ్లల్లో రూ.3564 కోట్లు మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఖర్చుచేశామని, ఇలా మొత్తం1,62,75,373 మందికి రూ.26,677.82 కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం వెల్లడిరచారు.
అంగన్‌వాడీల నుంచే చదువుల విప్లవం
ఇవికాక అంగన్‌వాడీల్లోనూ పీపీ1, పీపీ2 విధానాన్ని తీసుకొచ్చి చదువుల విప్లవం తీసుకురావాలని తాపత్రయ పడుతున్నామని సీఎం జగన్‌ అన్నారు. పిల్లలకు, గర్భవతులకు పౌష్టికాహారం అందించాలని వైఎస్సార్‌ సంపూర్ణపోషణ కింద రూ.1800 కోట్లు ఖర్చు పెట్టామని, అంగన్‌వాడీలను పీపీ`1గా మార్పు చేసి ఇంగ్లీషు మీడియంను, సీబీఎస్‌ఈ అఫిలియేషన్‌ను తీసుకు వచ్చామన్నారు. పీపీ1 నుంచి డిగ్రీ వరకు అన్ని చదువులు ఇంగ్ల్లీషు మీడియంలో చదివించే గొప్ప ప్రయత్నానికి శ్రీకారం చుట్టగలిగామన్నారు. పిల్లలకు భవిష్యత్తులో మంచి జరగాలని, గొప్ప ఇంజినీర్లు, డాక్టర్లు కావాలన్న తపన, ఆరాటంతో విద్యాదీవెన, వసతిదీవెన అమలు చేస్తున్నామని, వీటిని తల్లిదండ్రులంతా సద్వినియోగం చేసుకోవాలని సీఎం కోరారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు పినిపే విశ్వరూప్‌, ఆదిమూలపు సురేష్‌, చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, విద్యాశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img