Monday, August 15, 2022
Monday, August 15, 2022

విద్యారంగం విధ్వంసం

మోదీ, జగన్‌ సంస్కరణలతో భారీ ముప్పు
ఎన్‌ఈపీకి వ్యతిరేకంగా ఉద్యమం
ఏఐఎస్‌ఎఫ్‌ సదస్సులో వక్తలు

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: నూతన విద్యా విధానం (ఎన్‌ఈపీ)2020 పేరిట కేంద్రంలోని మోదీ, రాష్ట్రంలోని జగన్‌ ప్రభుత్వాలు విద్యా రంగాన్ని విధ్వంసం చేస్తున్నాయని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడ ఐఎంఏ హాలులో గురువారం అఖిలభారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్‌ఎఫ్‌) రాష్ట్ర సమితి ‘నేటి విద్యారంగంసమస్యలుపరిష్కార మార్గాలు’ అంశంపై రాష్ట్ర స్థాయి సదస్సు నిర్వహించింది. దీనికి ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షుడు వి.జాన్సన్‌బాబు అధ్యక్షత వహించగా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శివారెడ్డి స్వాగతం పలికారు. 26 జిల్లాల నుంచి ఏఐఎస్‌ఎఫ్‌ ప్రతినిధులు, వివిధ విద్యార్థి, యువజన సంఘాల నేతలు హాజరయ్యారు. ప్రధాన వక్తలుగా ఎమ్మెల్సీలు కత్తి నరసింహారెడ్డి, కేఎస్‌ లక్ష్మణరావు, విద్యా పరిరక్షణ కమిటీ కన్వీనర్‌ రమేశ్‌ పట్నాయక్‌, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హాజరయ్యారు.
జీఓ 117తో పాఠశాల విద్య అస్తవ్యస్తం: కత్తి నరసింహారెడ్డి
కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ… ఎన్‌ఈపీ అమలు కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో 117తో రాష్ట్రంలోని పాఠశాల విద్య అస్తవ్యస్తంగా మారనుందని చెప్పారు. ప్రధానంగా ఎలిమెంటరీ విద్యా విధానం అంతరించిపోతుందన్నారు. ఇంటర్‌ విద్యలో ప్రైవేట్‌ కళాశాలలు 3వేలు ఉండగా, ప్రభుత్వ కళాశాలలు కేవలం 480మాత్రమే ఉన్నాయని, అవి కూడా లెక్చెరర్ల కొరతతో అరకొరగా నడుస్తున్నాయన్నారు. జగన్‌ ప్రభుత్వం… ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, సంఘాలతో చర్చించకుండా విద్యారంగంలో చేస్తున్న సంస్కరణలపె ఏకపక్షంగా అమలు చేస్తోందన్నారు. తాజాగా 8వ తరగతి నుంచి బైజూస్‌ కార్పొరేట్‌ కంపెనీతో ఆన్‌లైన్‌ పాఠాల ఒప్పందమే ఇందుకు నిదర్శనమని చెప్పారు. రాష్ట్రంలో విద్యారంగాభివృద్ధి పరిరక్షణ కోసం విద్యార్థి, యువజనులు చేపట్టబోయే ఉద్యమాలకు తమ సంఫీుభావం ఉంటుందన్నారు.
విద్యారంగ పరిరక్షణకు ఉద్యమించాలి: రామకృష్ణ
రామకృష్ణ మాట్లాడుతూ… మోదీ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విద్యా వ్యవస్థలో విభిన్న సంస్కరణల్ని తెస్తూ, కాషాయీకరణకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. విద్యాభివృద్ధికి ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదన్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా 20మంది ఆచార్యుల బృందం ఒక సర్వే చేయగా… విశ్వవిద్యాలయాల్లో విద్యా విధానానికి దశ, దిశ లేదని తేటతెల్లమైందని చెప్పారు. నియామకాల్లో విపరీతమైన రాజకీయ జోక్యం, అకడమిక్‌ వ్యవస్థకు అధికారాలు ఇవ్వకపోడం, లక్ష్యాలు విద్యార్థులకు చేరకపోవడం వెరసి మొత్తం విద్యా వ్యవస్థ వృథాగా మారుతోందని సర్వేలో వెల్లడైందని చెప్పారు. విశ్వవిద్యాలయాలు జ్ఞాన సమూపార్జన కోసం కాక కేవలం విద్యార్థులు పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకునేవిగా మారిపోయాయని అన్నారు. ప్రభుత్వ ఆధీనంలోని విశ్వవిద్యాలయాలను పక్కాగా నాశనం చేశారని, ఉప కులపతులు నియంతలుగా మారిపోయాయని మండిపడ్డారు. ఉన్నత విద్యలో విధ్వంసం, ఇంటర్‌ విద్యను కార్పొరేట్‌ పరం, ప్రాథమిక రంగంలో విచ్ఛిన్నం తరహాగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల నిర్ణయాలున్నాయని విమర్శించారు. విద్యారంగ పరిరక్షణ కోస యువజన, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమించాలని, అందులో ఏఐఎస్‌ఎఫ్‌ అగ్రభాగంగా నిలవాలని కోరారు. 26 జిల్లాల్లో సదస్సులు నిర్వహించాలని, అందులో తల్లిదండ్రులనూ భాగస్వాములను చేయాలని సూచించారు.
ఎన్‌ఈపీ2020 ముసుగులో విద్య ప్రైవేటీకరణ: కేఎస్‌ లక్ష్మణరావు ఎమ్మెల్సీ కేఎస్‌ లక్ష్మణరావు మాట్లాడుతూ... విద్యారంగంలో కేంద్రం ఆధిపత్యం కొనసాగుతోందన్నారు. సెంట్రలైజేషన్‌, కమర్షియలైజేషన్‌, కమ్యూనలైజేషన్‌ పేరిట దేశంలోని 50శాతం విద్యా రంగాన్ని కార్పొరేట్‌ పరం చేస్తోందన్నారు. విద్యారంగంలోకి మతతత్వాన్ని, ఆరెస్సెస్‌ భావజాలాన్ని మోదీ ప్రభుత్వం జోడిస్తోందని విమర్శించారు. ఎన్‌ఈపీ2020 ముసుగులో విద్య ప్రైవేటీకరణకు ఆహ్వానిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రైవేట్‌ విశ్వవిద్యాలయాల్లో ఎలాంటి సామాజిక న్యాయం, రిజర్వేషన్లు ఉండబోవని, ఫలితంగా పేదలకు విద్య దూరమవుతుందని వివరించారు. ఉపాధ్యాయ ఖాళీల భర్తీకి చర్యలు తీసుకోవాలని, ఎయిడెడ్‌ వ్యవస్థను కొనసాగించాలని, 3,4,5 తరగతుల విలీనం ఆపేయాలని డిమాండ్‌ చేశారు. విద్య ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ విద్యార్థి, యువజన సంఘాలు ఉద్యమాలతో ప్రభుత్వాలు దిగొచ్చేలా ఒత్తిడి పెంచాలని కోరారు.
డీఎస్సీ నిర్వహించాలి: రమేశ్‌ పట్నాయక్‌
రమేశ్‌ పట్నాయక్‌ మాట్లాడుతూ…మోదీ ప్రభుత్వం అధికార కేంద్రీకరణను వేగవంతంగా అమలు చేస్తోందన్నారు. విద్యను రాష్ట్రాల జాబితాలోనే ఉంచాలనే డిమాండుతో వామపక్ష విద్యార్థి, యువజన, ఉపాధ్యాయ సంఘాలతో కలిపి రాజకీయ ఉద్యమం నిర్మించాలని సూచించారు. ఏపీలో జగన్‌ ప్రభుత్వం ఒక పక్క పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తున్నానంటూ… మరోపక్క వేలాది ఉపాధ్యాయ ఖాళీలను కనుమరుగు చేస్తోందన్నారు. తక్షణమే 30వేల ఉపాధ్యాయ ఖాళీలకు డీఎస్సీ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు.
ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హెచ్‌.తిమ్మన్న మాట్లాడుతూ… ప్రస్తుత చదువులకు, చేస్తున్న ఉద్యోగాలకు పొంతన లేకుండా పోతోందన్నారు. జగన్‌ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 117 జీవో రద్దు కోసం ఉద్యమించాలన్నారు. పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎం.రవిచంద్ర, మరో పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ధనరాజ్‌ మాట్లాడుతూ…పాఠశాల విలీనం వంటి రాష్ట్ర ప్రభుత్వ వికృత చర్యలతో, విద్యా రంగం ఉనికిని కోల్పోతుందన్నారు. జాన్సన్‌బాబు, శివారెడ్డి మాట్లాడుతూ, ప్రాథమిక విద్యను జగన్‌ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని, సమస్యలకు కేంద్రాలుగా విశ్వవిద్యాలయాలున్నాయని చెప్పారు. ఈ సదస్సులో తొలుత ఆంధ్రప్రదేశ్‌ ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు పి.చంద్రానాయక్‌ అభ్యుదయ గీతాలను ఆలపించారు. అనంతరం ఏఐఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివారెడ్డి అధ్యక్షతన జరిగిన ఐక్య ఉద్యమాల ఆవశ్యకత`విద్యార్థి, యువజనుల బాధ్యత అంశంపై జరిగిన సదస్సులో ఏఐఎస్‌ఎఫ్‌ మాజీ జాతీయ కార్యదర్శి జి.ఈశ్వరయ్య, ఏఐవైఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి ఎన్‌.లెనిన్‌బాబు, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్నకుమార్‌ తదితరులు ప్రసంగించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img