Wednesday, December 7, 2022
Wednesday, December 7, 2022

విద్యాసంస్థలు, పరిశ్రమలపై దృష్టి

ఆప్‌ సీఎం అభ్యర్థి భగవంత్‌మాన్‌
ప్రమాణస్వీకారం భగత్‌సింగ్‌ ఊరిలో

చండీగఢ్‌: పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ ఘన విజయం సాధించిన నేపథ్యంలో ఆ పార్టీ ముఖ్యమంత్రి అభ్యర్థి భగవంత్‌మాన్‌ తన ప్రమాణస్వీకారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజ్‌భవన్‌లో కాకుండా భగత్‌ సింగ్‌ పూర్వీకుల గ్రామమైన ఖట్కర్‌కలన్‌లో పంజాబ్‌ సీఎంగా ప్రమాణం చేస్తానని పేర్కొన్నారు. రాష్ట్రంలో తమ ప్రభుత్వం… పాఠశాలలు, వైద్య ఆరోగ్య, క్రీడా మౌలిక సదుపాయాలు మెరుగుపరుస్తుందన్నారు. పరిశ్రమల అభివృద్ధికి కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. ధురిలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడిన మాన్‌… ఇకపై ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం ఫొటోలకు బదులు భగత్‌సింగ్‌, అంబేద్కర్‌ ఫొటోలు పెట్టుకోవచ్చన్నారు. పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులకు అభినందనలు తెలిపారు. ఆ సందర్భంలోనే మాన్‌ తల్లి హర్పాల్‌ కౌర్‌ భావోద్వేగానికి గురయ్యారు. ఆ క్షణంలో కుమారుడి ఒడిలో వాలిపోయారు హర్పాల్‌ కౌర్‌. పంజాబ్‌ ఆప్‌ పార్టీ ఇన్‌చార్జి రాఘవ్‌ చద్ధా మాట్లాడుతూ… మాదక ద్రవ్యాల ప్రభావం ఎక్కువగా ఉన్న పంజాబ్‌ను ‘ఉడ్తా పంజాబ్‌గా’ పిలిచే రోజులు పోతాయన్నారు ఆ పేరు ఇకపై ‘ఉఠ్‌తా పంజాబ్‌’ (పంజాబ్‌ ప్రజలు మేల్కొంటారు)గా మారుతుందన్నారు. కేజ్రీవాల్‌ను కొందరు ఉగ్రవాదిగా పిలిచారని, అయితే అది తప్పని ప్రజలు నిరూపించారని రాఘవ్‌ వ్యాఖ్యానించారు.
ప్రజల తీర్పును అంగీస్తున్నాం : సిద్ధూ
ప్రజల తీర్పును కాంగ్రెస్‌ సవినయంగా అంగీకరిస్తున్నట్లు నవజ్యోత్‌ సిద్ధూ తెలిపారు. అరవింద్‌ కేజ్రీవాల్‌ నేతృత్వంలోని ఆమ్‌ఆద్మీ పార్టీకి శుభాకాంక్షలు తెలిపారు. ‘ప్రజల తీర్పే భగవంతుని తీర్పు. పంజాబ్‌ ప్రజల తీర్పును వినయంగా అంగీకరిస్తాం. ఆప్‌కు అభినందనలు’అని సిద్ధూ ట్వీట్‌ చేశారు.
పంజాబ్‌ మంత్రి, తనయుడి విజయం
పంజాబ్‌ మంత్రి రాణా గుర్జీత్‌సింగ్‌, ఆయన తనయుడు రాణా ఇందర్‌ ప్రతాప్‌ సింగ్‌ విజయం సాధించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి గుర్జీత్‌సింగ్‌ కపుర్తలాలో సమీప ఆప్‌ అభ్యర్థిపై 7,304 ఓట్ల తేడాతో గెలుపొందగా, ఆయన తనయుడు ఇందర్‌ ప్రతాప్‌ సుల్తాన్‌పూర్‌ లోధి నుంచి ఇండిపెండెంట్‌గా పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి సజ్జన్‌సింగ్‌ చీమాపై 11,434 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థి చీమాకు బదులుగా తన కుమారుడైన ఇందర్‌ ప్రతాప్‌ తరఫున గుర్జీత్‌సింగ్‌ ప్రచారం నిర్వహించడం గమనార్హం.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img