Monday, January 30, 2023
Monday, January 30, 2023

విద్యుత్‌ సంస్కరణలను ప్రతిఘటిద్దాం

అదానీతో మోడీ, జగన్‌ లాలూచీ
ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణలపై ఉద్యమిద్దాం
సంస్కరణలతో రాష్ట్ర ప్రజలపై లక్ష కోట్ల భారం
విద్యుత్‌ అమరవీరుల సంస్మరణ సభలో రామకృష్ణ, మధు పిలుపు

అమరావతి : రాష్ట్రంలో అమలుచేస్తున్న విద్యుత్‌ సంస్కర ణలకు వ్యతిరేకంగా అమరవీరుల స్ఫూర్తితో ఉద్యమాలకు సన్నద్ధం కావాలని వామపక్ష నేతలు పిలుపునిచ్చారు. విద్యుత్‌ ఉద్యమ అమరవీరుల 21వ సంస్మరణ దినోత్స వాన్ని శనివారం వామపక్ష పార్టీల అధ్వర్యాన మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించారు. అధ్యక్షత వహించిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ సంస్కరణలు అమలు చేస్తేనే రుణాలు ఇస్తామని రాష్ట్రప్రభుత్వాలను కేంద్రప్రభుత్వం ఊరిస్తోందన్నారు. దీనికి బీజేపీ పాలిత రాష్ట్రాలు సైతం ముందుకు రానప్పటికీ ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ అత్యుత్సాహం చూపుతున్నాయని విమర్శించారు. సంస్కరణలకు వ్యతిరేకంగా గతంలో పెద్దఎత్తున పోరాటం చేసిన జగన్‌…ఇప్పుడు రాష్ట్రంలో మొదటగా ఆయనే అమలు చేసేందుకు పూనుకోవడం దురదృష్టకరమ న్నారు. నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రైవేటీకరణకు వేగంగా అడుగులు వేస్తున్నదని, అందులో భాగంగానే విశాఖస్టీల్‌ను ప్రైవేట్‌కు అప్పగిస్తోందన్నారు. దీనిని అన్ని రాజకీయ పార్టీలు వ్యతిరేకించినా కేంద్రం లెక్కచేయడం లేదన్నారు. మోదీ ప్రభు త్వం, వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం అదానీతో లాలూచీ పడుతున్నాయని విమర్శించారు. లోపాయికారీ ఒప్పందం చేసుకొని రాష్ట్రప్రజలకు దక్కాల్సిన గంగవరం పోర్టును అదానీకి అప్పజెబుతున్నారని, ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణలకు వ్యతిరేకంగా కార్మికులు పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. రైతు, వ్యవసాయ సంఘాలు, ట్రేడ్‌ యూనియన్లు పిలుపునిచ్చిన సెప్టెంబరు 25 భారత్‌ బంద్‌ను జయప్రదం చేయాలని, విశాఖ స్టీల్‌ ప్రైవేటీకరణపై ఈ నెల 30న జరిగే రాష్ట్రవ్యాప్త ఆందోళనల్లో ప్రజలు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి మధు మాట్లాడుతూ సంస్కరణల ద్వారా రాష్ట్రాల హక్కులకు కేంద్రప్రభుత్వం గండికొడుతుందన్నారు. విద్యుత్‌ రంగంలో సంస్కరణల వల్ల రాష్ట్రాలు తమ హక్కులు కోల్పోతాయని, విద్యుత్‌ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ) చైర్మన్‌ నియామకం కేంద్రం పరిధిలోకి వెళ్తుందన్నారు. పేద ప్రజలు పొందే క్రాస్‌ సబ్సిడీ కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రప్రభుత్వం ఒత్తిడికి తలొగ్గి అమలు చేస్తున్న వ్యవసాయ పంపుసెట్లకు మీటర్ల బిగింపు వల్ల ప్రజలపై లక్షకోట్ల అదనపు భారం పడుతుందన్నారు. సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకులు పొలారి మాట్లాడుతూ విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రాష్ట్రప్రభుత్వం మరోవైపు గంగవరం పోర్టును ప్రైవేటీకరిస్తోందని విమర్శించారు. వామపక్ష ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాలు మినహా కేంద్ర విధానాలపై ఏ ప్రభుత్వాలు గళం విప్పడం లేదన్నారు. ఎంసీపీఐయూ రాష్ట్ర కార్యదర్శి నాగ భూషణం మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో పూర్తి నిర్బంధాలు అమలవుతు న్నాయని, వీటికి వ్యతిరేకంగా పోరాడే బాధ్యత కమ్యూనిస్టులపై ఉందన్నారు. సీపీఐ(ఎంఎల్‌) నాయకులు జాస్తి కిషోర్‌ మాట్లాడుతూ ప్రజల అవసరాలు తీర్చేందుకు ప్రాధాన్యత ఇవ్వకుండా పెట్టుబడిదారులకు కొమ్ముకాసేలా ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. సీపీిఐ(ఎంఎల్‌) న్యూ డెమోక్రసీ నాయకులు కుటుంబరావు, ఎస్‌యూసీఐ నాయకులు అమర్‌నాథ్‌ మాట్లాడారు. విద్యుత్‌ రంగంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపడుతున్న మార్పుల గురించి విద్యుత్‌ రంగ నిపుణులు బి తులసీదాస్‌ వివరించారు. సీపీఐ నగర కార్యదర్శి దోనేపూడి శంకర్‌ వక్తలను వేదికపైకి ఆహ్వానించగా, విద్యుత్‌ సంస్కరణలపై పోరాడుతామని సీపీఎం రాష్ట్ర నాయకులు వై వెంకటేశ్వరరావు ప్రతిజ్ఞ చేయించారు. తొలుత అమరవీరుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img