Monday, September 26, 2022
Monday, September 26, 2022

విద్యుత్‌ చార్జీల్లోనూ
మడమ తిప్పిన జగన్‌

. గత మూడేళ్లలో ప్రజలపై వేల కోట్ల భారం
. అదానీతో లాలూచీ పడి యూనిట్‌కు అదనపు రేటు చెల్లింపు
. సమైక్య ఉద్యమానికి సిద్ధం కావాలని సీపీఐ నేత రామకృష్ణ పిలుపు

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి :
ఎన్నికల సందర్భంగా ఇచ్చిన అనేక హామీలను తుంగలో తొక్కిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి, విద్యుత్‌ చార్జీల విషయంలోనూ మడమ తిప్పారని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ శనివారం ఒక ప్రకటనలో విమర్శించారు. సీఎంగా ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా కరెంట్‌ చార్జీలు తగ్గిస్తామని, విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలన్నింటినీ సమీక్షిస్తామని చాలా స్పష్టంగా చెప్పారని, కానీ గత మూడేళ్లలో అనేక దఫాలుగా ప్రజలపై వేల కోట్లు భారాలు మోపారని తెలిపారు. ఏప్రిల్‌ నెల నుంచి పరిశీలించినా టారిఫ్‌ చార్జీల ప్రకారం రూ.3,300 కోట్లు, ట్రూ అప్‌ చార్జీల పేరుతో రూ.2,910 కోట్లు, అదనపు లోడుల పేరుతో రూ.1800 కోట్లు, ఇదిగాకుండా మీటర్లకు డిపాజిట్ల నిమిత్తం రూ.1856 కోట్లు, ఇప్పుడు తాజాగా మళ్లీ ట్రూ అప్‌ చార్జీల పేరుతో రూ.630 కోట్లు… ఇలా వేల కోట్ల భారాలను ప్రజలపై మోపారు. మరోపక్క అదానీతో లాలూచీ పడి మార్కెట్‌ రేటు కంటే ఎక్కువ ధరకు విద్యుత్‌ కొనుగోలు చేస్తున్నారు. ఎక్కడాలేని విధంగా యూనిట్‌ 22 రూపాయలకు కూడా కొనుగోలు చేస్తున్నారు. సోలార్‌ విద్యుత్‌ బహిరంగ మార్కెట్‌లో రూ.1.99 పైసలకు లభ్యమవుతుండగా, అదానీతో 7 వేల మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ కొనుగోలుకు యూనిట్‌ రూ.2.49 పైసలకు ఒప్పందం కుదుర్చుకున్నారు. యూనిట్‌కు అదనంగా 50 పైసలు చెల్లించడంలో మీ కమిషన్‌ వాటా ఎంత? ఎందుకు అదానీతో లాలూచీ పడుతున్నారని రామకృష్ణ ప్రశ్నించారు. అదానీతో ఎటువంటి వ్యాపార లావాదేవీలు నిర్వహించినా ప్రధాని మోదీ, అమిత్‌ షా కూడా సహకరిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ అండతో జగన్‌ ప్రజలపై వేస్తున్న ఈ వేల కోట్ల భారాన్ని భరించలేని పరిస్థితి నెలకొంది. అందువల్ల విద్యుత్‌ భారాలకు వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు సమైక్య ఉద్యమానికి సిద్ధం కావాలని రామకృష్ణ పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img