Wednesday, August 17, 2022
Wednesday, August 17, 2022

‘విద్య’ కాషాయీకరణపై నిరసన

పాఠ్యాంశాల మార్పు, వాస్తవాల వక్రీకరణపై ఆగ్రహం
కర్ణాటక ప్రభుత్వ సంస్థలకు మేధావులు, రచయితల రాజీనామా

బెంగళూరు: కర్ణాటకలో కొనసాగుతున్న విద్య ‘కాషాయీకరణ’కు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వ కమిటీలు, సంస్థలకు అనేక మంది మేధావులు, రచయితలు రాజీనామా చేయడం ద్వారా నిరసన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2020లో సాంఘిక శాస్త్రం, భాషా పాఠ్యపుస్తకాలను పరిశీలించడానికి ఏర్పాటయిన రోహిత్‌ చక్రతీర్థ నేతృత్వం లోని రివిజన్‌ కమిటీ ఇటీవల 6 నుంచి 10 తరగతుల సాంఘిక శాస్త్ర పాఠ్యపుస్తకా లను, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు కన్నడ భాషా పాఠ్యపుస్తకాల్లోని అంశాలను సవరించింది. విప్లవకారుడు, స్వాతంత్య్ర సమరయోధుడు భగత్‌ సింగ్‌, మైసూర్‌ పాలకుడు టిప్పు సుల్తాన్‌, లింగా యత్‌ సంఘ సంస్కర్త బసవన్న, ద్రవిడ ఉద్యమ మార్గదర్శకుడు పెరియార్‌, సంస్కర్త నారాయణ గురులపై అధ్యాయాలు సిలబస్‌ నుంచి తొలగించడం లేదా తీవ్రంగా తగ్గించడం చేశారు. అలాగే కన్నడ కవి కువెంపుపై వాస్తవాలను కూడా వక్రీకరించారని ఆరోపణలు వెల్లువెత్తాయి. మరోవైపు, రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఫ్‌ు వ్యవస్థాపకుడు కేశవ్‌ బలిరామ్‌ హెడ్గేవార్‌ చేసిన ప్రసంగం 10వ తరగతి సవరించిన కన్నడ పాఠ్యపుస్తకంలో చేర్చింది. రాష్ట్ర కవి డా.జి.ఎస్‌.శివరుద్రప్ప, ప్రతిష్ఠాన అధ్యక్షు లుగా ఉన్న రచయితలు ఎస్‌.జి.సిద్ధ రామయ్య, హెచ్‌.రాఘవేంద్రరావు, నటరాజ బూడలు, చంద్రశేఖర్‌ నంగ్లీలు తాము నిర్వహిస్తున్న వివిధ పదవులకు రాజీనామా చేస్తూ సోమవారం ముఖ్య మంత్రి బసవరాజ్‌ బొమ్మైకి లేఖ రాశారని ఒక ఆంగ్ల వార్తా పత్రిక పేర్కొంది. ‘రాష్ట్రం లోని విద్య, సాంస్కృతిక, రాజకీయ రంగా లలో ఇటీవలి రాజ్యాంగ విరుద్ధమైన దాడి, అణచివేత మమ్మల్ని ఆందోళనకు గురి చేసింది. రాష్ట్రాన్ని, సమాఖ్య నిర్మాణాన్ని అణగదొక్కుతూ మత విద్వేషాలను బహిరం గంగా రెచ్చగొడుతున్న వారిపై ప్రభుత్వం మౌనం వహించడం, చర్యలు తీసుకోకపోవ డం మమ్మల్ని ఆందోళనకు, భయానికి గురిచేస్తున్నాయి’ అని వారు ఆ లేఖలో పేర్కొన్నారు. సిద్ధరామయ్య ప్రాథమిక, మాధ్యమిక విద్యా శాఖ మంత్రి బి.సి. నగేశ్‌కి కూడా లేఖ రాశారు. 9వ తరగతి కన్నడ పాఠ్యపుస్తకంలో తన కవిత ‘మనెగెలసద హుడుగి’ని చేర్చడానికి అనుమ తిని ఉపసంహరించుకున్నారు. ఇంతకుముందు, ఇద్దరు ప్రముఖ రచయితలు దేవనూర మహదేవ, జి.రామకృష్ణ పాఠ్యపుస్తకాలు తమ రచనలను తీసుకెళ్లడానికి అనుమతిని రద్దు చేశారు. చక్రతీర్థం కువెంపుపైనా, రాష్ట్ర గీతంపైనా పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేసినా ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకోవడం లేదని రాష్ట్ర కవి కువెంపు ప్రతిష్ఠాన అధ్యక్ష పదవికి హంప నాగరాజయ్య రాజీనామా చేశారు. ‘కువెంపును, రాష్ట్ర గీతాన్ని కించపరిచిన వ్యక్తులపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడమే కాకుండా వారిని అధికారిక కమిటీలో సభ్యులుగా చేసినందున, ఇది ప్రజలకు తప్పుడు సంకేతాలను పంపుతుంది’ అని బొమ్మైకి రాసిన లేఖలో నాగరాజయ్య పేర్కొన్నారు. విద్యావేత్త వి.పి.నిరంజనారాధ్య జాతీయ విద్యా విధానంపై తన కృషికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవాన్ని తిరస్కరించారు. ‘రాష్ట్ర ప్రభుత్వం విద్య వర్గీకరణ, కాషాయీకరణకు పూనుకుంది. ఈ ప్రక్రియలో పాఠ్యప్రణాళిక కార్యాచరణ, రాజ్యాంగ విలువలు, విద్యా విధానాన్ని అనుసరించలేదు. ఈ కసరత్తు, నన్ను ఆహ్వానించిన కార్యక్రమం రెండూ విద్యా మంత్రి నేతృత్వంలో జరుగుతున్నందున, నేను రాజ్యాంగ విలువలకు కట్టుబడి దానిని బహిష్కరిస్తున్నాను’ అని ఆహ్వానానికి ప్రతిస్పందించినట్లు ఆ వార్తా సంస్థ తెలిపింది. అనేక విద్యార్థి సంఘాలు కూడా మార్పులపై నిరసనలు వ్యక్తం చేస్తుండగా, మరిన్ని నిరసనలకు ప్రణాళిక చేస్తున్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img