Saturday, September 30, 2023
Saturday, September 30, 2023

విపక్ష ఐక్యతకు ఇదే స్ఫూర్తి

ఆపరేషన్‌ కమలాన్ని తిప్పికొట్టిన నితీశ్‌`లాలు

బీజేపీ ‘కుట్ర’ రాజకీయాలకు బీహారు అడ్డుకట్ట
2024 ఎన్నికలే లక్ష్యంగా ఐక్యకార్యాచరణతో ముందుకు…

పాట్నా: అన్ని రాష్ట్రాల్లో తామే అధికారంలో ఉండాలని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కుట్రలు చేస్తోంది. ఇందుకోసం అన్ని చోట్ల ఆపరేషన్‌ కమలానికి పూనుకుంటోంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాలను ఒక్కొక్కటిగా కూల్చివేస్తోంది. మొన్న కర్ణాటక, గోవా, అసోం, నిన్న మహారాష్ట్ర, నేడు బీహార్‌, దిల్లీలోనూ ఇదే పంథాను అనుసరిస్తోంది. ఆపరేషన్‌ కమలానికి లాలూ`నితీశ్‌ జోడి దీటుగా బదులిచ్చింది. కమల దళం వ్యూహాలను తిప్పికొట్టి బీహార్‌లో మహాకూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బీజేపీ ‘మెలిపెట్టే’ రాజకీయాలతో నితీశ్‌ కుమార్‌, లాలూ ప్రసాద్‌ వైఖరిలో మార్పు రాలేదు. ఇద్దరూ ఐక్యంగా నిలబడి బీజేపీని ఏ విధంగా ఎదుర్కోవాలో చేసి చూపించారు. 2024 ఎన్నికలలో బీజేపీని మట్టికరిపించే దిశగా పావులు కదుపుతున్నారు. ఈనెల 24న బీహార్‌ అసెంబ్లీలో జరిగిన విశ్వాస పరీక్షలో నితీశ్‌ కుమార్‌ నెగ్గి రాష్ట్రంలో మహాకూటమి (మహాఘట్బంధన్‌) ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఇదే క్రమంలో ముగ్గురు రాష్ట్రీయ జనతా దళ్‌ (ఆర్జేడీ) శాసనసభ్యుల ఇళ్లు, కార్యాలయాలపై సీబీఐ దాడులు జరిగాయి. కేంద్ర హోం శాఖ బాధ్యతలను అమిత్‌ షా చేపట్టినప్పటి నుంచి బీజేపీయేతర పార్టీలపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు పరిపాటిగా మారాయి. తమ రాజకీయ ప్రత్యర్థులపై ఈ దర్యాప్తు సంస్థలను అస్త్రాలుగా బీజేపీ ప్రభుత్వం ప్రయోగిస్తోంది. లోక్‌సభ, రాజ్యసభలలో 400 మంది, 12 రాష్ట్రాల శాసనసభల్లో 1300 మంది సభ్యులు బీజేపీకి ఉన్నారు. బీజేపీ ఎనిమిదేళ్ల పాలనలో ఆ పార్టీకి చెందిన ఏ ఒక్క చట్టసభ్యుడిపైనా దర్యాప్తు జరిపిన దాఖలాలు లేవు. తృణమూల్‌ కాంగ్రెస్‌కు చెందిన ముకుల్‌ రాయ్‌, కాంగ్రెస్‌కు చెందిన హేమంత్‌ బిశ్వాస్‌ శర్మ వంటి నేతలపై కేసులు… వారు బీజేపీ గూటికి చేరిన తర్వాత మసకబారిపోయాయి. బీజేపీ ‘ఆపరేషన్‌ కమలం’లో భాగంగా కేంద్ర సంస్థల దుర్వినియోగం, అన్ని రాష్ట్రాల్లో అధికార వాంఛ తేటతెల్లంమైంది. ‘భయపడే వాడిని ఇంకా భయపెట్టాలి.. అమ్ముడుపోయే వాడిని కొనేయాలి’ అన్నది కమలం పార్టీ విధానమని లాలూ తనయుడు, బీహార్‌ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ వ్యాఖ్యానించారు. ఈ మధ్యనే మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఆపరేషన్‌ కమలం ద్వారా బీజేపీ కూల్చింది. అంతకుముందు కర్ణాటక, మహారాష్ట్రÑ గోవా, అసోంలలోనూ ఇదే చేసింది. ఆపరేషన్‌ కమలాన్ని తట్టుకొని నిలబడగలిగినవి దిల్లీ, బీహార్‌ మాత్రమే. భవిష్యత్‌లోనూ ఆ శక్తి బీహార్‌కే ఉండవచ్చు. మహాకూటమిలో నితీశ్‌కుమార్‌కు చెందిన జేడీయూ, లాలూ ప్రసాద్‌ యాదవ్‌కు చెందిన ఆర్జేడీ, జితన్‌ రామ్‌ మాంరీa పార్టీ హిందుస్థానీ అవామ్‌ మోర్చా (సెక్యులర్‌), కాంగ్రెస్‌, సోషలిస్టు, కమ్యూనిస్టు పార్టీలతో కలిపి మొత్తం ఏడు రాజకీయ పార్టీలు ఉన్నాయి.
‘ఆపరేషన్‌ ఫ్లాప్‌’
తమ రాష్ట్రంలో కమల దళం ఆపరేషన్‌ ఫ్లాప్‌ అయిందని మహాకూటమి ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. మహారాష్ట్రలో ఏక్‌నాథ్‌ షిండే చేసిన పనిని బీహార్‌లో ఆర్‌సీపీ సింగ్‌ చేయాలన్న వ్యూహాలు బెడిసికొట్టాయని పేర్కొన్నాయి. సింగ్‌ కేంద్ర మాజీ మంత్రి, ఒకప్పుడు నితీశ్‌ కుమార్‌కు నమ్మకస్తుడు. ఆయన ద్వారా అధికార పక్షాన్ని చీల్చేయాలని బీజేపీ కుట్ర చేసింది. 19 మంది సభ్యుల కాంగ్రెస్‌ను విభజించి హిందుస్తానీ అవామ్‌ మోర్చా(సెక్యులర్‌)కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలను 77 మంది బీజేపీ ఎమ్మెల్యేలతో కలిపివేయాలని కమల దళం భావించింది. అది జరిగాక ఎన్డీయే నేతృత్వ (బీజేపీజేడీ(యూ)) సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చివేయాలని యోచించింది. కేంద్ర దర్యాప్తు సంస్థలను వినియోగించి లాలూ, తేజస్వీతో పాటు వారి కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులను భూమిఉద్యోగం కుంభకోణంలో ఇరికించాలని ప్రణాళికలు వేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లో మాయావతి, పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ నేత ముకుల్‌ రాయ్‌, అసోంలో హేమంత్‌ బిశ్వాస్‌ శర్మల నోళ్లను సీబీఐ, ఈడీ, ఐటీ దాడులతో మూయించినట్లుగా బీహార్‌లో చేయలేకపోయింది.
ఆపరేషన్‌ కమలాన్ని నితీశ్‌, తేజస్వీ తిప్పికొట్టడమే కాకుండా ఎదురుదాడికి దిగారు. తండ్రికి తగ్గ తనయుడిగా తేజస్వీ యాదవ్‌…బీజేపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘బీజేపీకి ముగ్గురు అల్లుళ్లు`సీబీఐ, ఈడీ, ఐటీ శాఖ’. తమ అల్లుళ్లను ప్రత్యర్థుల ఇళ్లకు ఆ పార్టీ పంపుతుంది’అని విమర్శించారు. నితీశ్‌ కుమార్‌ కూడా ఘటుగా స్పందించారు. బీజేపీ చేసేదల్లా అనుకూల మీడియా ద్వారా ప్రచారం చేయించుకోవడం తప్ప మరేమీ లేదని ఎద్దేవా చేశారు. ప్రతి ఇంటికి విద్యుత్‌, నల్లా నీరు అందించే తమ నమూనాను దోచుకుని ప్రచారం చేయించుకున్నట్లు దుయ్యబట్టారు. ఏదిఏమైనా తాజా పరిణామాల దృష్ట్యా మోదీ ప్రభుత్వ వ్యతిరేక పోరునకు విపక్షాల ఐక్యతకు బీహార్‌ స్ఫూర్తిగా నిలుస్తుందన్న అంచనాలు ఉన్నాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img