Tuesday, June 6, 2023
Tuesday, June 6, 2023

విపక్ష ఐక్యతకు ముందడుగు

మోదీ సర్కార్‌ను గద్దె దించుతాం
అందరం ఒక్కటై పోరాడతాం
రాహుల్‌, ఖడ్గేతో నితీశ్‌, తేజస్వి ‘చారిత్రక’ భేటీ

న్యూదిల్లీ: బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌, ఆయన డిప్యూటీ తేజస్వి యాదవ్‌ బుధవారం కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖడ్గే, రాహుల్‌ గాంధీతో ‘చారిత్రక’ సమావేశం నిర్వహించారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఎదుర్కోవడానికి వీలైనన్ని ఎక్కువ ప్రతిపక్ష పార్టీలను ఏకతాటిపైకి తీసుకురావాలని నిర్ణయించారు. సమావేశానంతరం సంయుక్త విలేకరుల సమావేశంలో ఖడ్గే మాట్లాడుతూ ప్రతిపక్షాలు ఐక్యంగా రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటాయని, దేశానికి కొత్త దిశానిర్దేశం చేస్తాయని అన్నారు. రాహుల్‌గాంధీ మాట్లాడుతూ విపక్షాలు కలిసి దేశం పట్ల తమ దృక్పథాన్ని పెంపొందించుకుంటాయని, ప్రస్తుతం జరుగుతున్న సైద్ధాంతిక పోరులో కలిసి పోరాడుతున్నప్పుడు ప్రజల ముందు అదే విషయాన్ని తెలియజేస్తాయని అన్నారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాబోయే కొద్ది రోజుల్లో వివిధ ప్రతిపక్ష పార్టీల అగ్రనేతలతో సమావేశం కానున్నందున వచ్చే ఏడాది ఎన్నికలకు ముందు ప్రతిపక్ష ఐక్యతను ఏర్పరచడంలో ఇది మొదటి అధికారిక ప్రయత్నం. తనతో పాటు విలేకరుల సమావేశంలో కూర్చున్న నితీశ్‌, తేజస్వి, ఇతరుల కృషిని కొనియాడుతూ ఇక్కడ చారిత్రక సమావేశం నిర్వహించామని, అనేక అంశాలపై చర్చించామని, అన్ని పార్టీలను కలుపుకుని వచ్చే ఎన్నికల్లో ఐక్యంగా పోరాడాలని నిర్ణయించుకున్నామని, ఇందుకోసం అందరం కృషి చేస్తామని రాహుల్‌ చెప్పారు. సమావేశానికి హాజరైన నాయకులు ఉమ్మడి ఆలోచనతో పనిచేస్తారని, ఈ దిశగా ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ప్రతిపక్షాలను ఏకం చేసేందుకు ఈ సమావేశాన్ని ఒక చారిత్రక అడుగుగా రాహుల్‌ గాంధీ అభివర్ణించారు. ఎన్ని ప్రతిపక్షాలు ఏకతాటిపైకి వస్తాయన్న ప్రశ్నకు, ‘ఇది ఒక ప్రక్రియ, మేము దేశం పట్ల ప్రతిపక్ష దృష్టిని అభివృద్ధి చేస్తాం. మాతో కలిసి వచ్చే అన్ని పార్టీలు, దేశంలో జరుగుతున్న సైద్ధాంతిక పోరాటాన్ని కలిసి చేస్తాం’ అని తెలిపారు. ‘సంస్థలపై దాడికి, దేశంపై దాడికి వ్యతిరేకంగా మేము ఐక్యంగా నిలబడతాం’ అని అన్నారు. ఈ రోజు చాలా ముఖ్యమైన అడుగు పడిరదని చెప్పారు. వచ్చే ఏడాది జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడిరచేందుకు ఒకే వేదికపైకి వచ్చే ఆలోచనలున్న ప్రతిపక్ష పార్టీల చర్చల మధ్య ఖడ్గే నివాసంలో ఈ సమావేశం జరిగింది. బీహార్‌ ముఖ్యమంత్రి మాట్లాడుతూ ‘దేశంలో మరిన్ని పార్టీలను ఏకం చేయడానికి మేము అన్ని ప్రయత్నాలు చేస్తాం. కలిసి కూర్చుని, ఐక్యంగా పని చేస్తాం’ అని అన్నారు. ‘నేటి చర్చల అనంతరం ఆ ప్రాతిపదికన ముందుకు సాగుతాం. అంగీకరించే వారందరూ కలిసి కూర్చొని భవిష్యత్‌ కార్యాచరణను నిర్ణయిస్తాం’ అని తెలిపారు. ఖడ్గే హిందీలో ఒక ట్వీట్‌ చేశారు. ‘రాజ్యాంగాన్ని పరిరక్షిస్తాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడతాం. రాహుల్‌ గాంధీ, మేము నితీశ్‌ కుమార్‌, తేజస్వి యాదవ్‌, ఇతర నాయకులను కలిశాం. కలిసికట్టుగా ప్రజల గొంతుకను పెంచి దేశానికి కొత్త దిశా నిర్దేశం చేస్తామని పునరుద్ఘాటించారు’ అని ఖడ్గే పేర్కొన్నారు. ఖడ్గే నివాసంలో జరిగిన విందు సమావేశానికి జేడీ(యూ) అధ్యక్షుడు లాలన్‌ సింగ్‌, కాంగ్రెస్‌ పార్టీ బీహార్‌ అధ్యక్షుడు అఖిలేశ్‌ ప్రసాద్‌ సింగ్‌, కాంగ్రెస్‌ నాయకుడు సల్మాన్‌ ఖుర్షీద్‌, ఆర్‌జేడీ నాయకుడు మనోజ్‌ రaా హాజరయ్యారు. బీహార్‌లో జనతాదళ్‌ (యునైటెడ్‌), రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్‌జేడీ), కాంగ్రెస్‌ సంకీర్ణ ప్రభుత్వంలో ఉన్నాయి. బీజేపీకి వ్యతిరేకంగా పోరాటంలో ఇతర ప్రతిపక్ష పార్టీలను ఒకే వేదికపైకి తీసుకురావడానికి మూడు పార్టీలు చర్చలు జరుపుతున్నాయి. మంగళవారం ఇక్కడకు వచ్చిన నితీశ్‌ కుమార్‌, దేశ రాజధానిలో ఉన్న సమయంలో ప్రతిపక్ష నాయకులను కలవాలని భావిస్తున్నారు. ఉద్యోగాల కోసం భూ కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో విచారణ నిమిత్తం మంగళవారం ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) ముందు హాజరయ్యేందుకు తేజస్వి యాదవ్‌ కూడా దిల్లీలో ఉన్నారు. బీజేపీని ఎదుర్కోవడానికి భావసారూప్యత గల పార్టీల మధ్య ఐక్యతను పెంపొందించే ప్రయత్నంలో ఖడ్గే ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్‌, ఉద్ధవ్‌ థాకరేతో సహా అనేక మంది ప్రతిపక్ష నాయకులతో మాట్లాడారు. రానున్న రోజుల్లో ఆయన ఇతర ప్రతిపక్ష అగ్రనేతలతో చర్చించే అవకాశం ఉంది. అలాగే కాంగ్రెస్‌, ప్రతిపక్ష పార్టీల మధ్య విభేదాలను తగ్గించడం నితీశ్‌ కుమార్‌ మూడు రోజుల రాజధాని పర్యటన అజెండాలో ఉన్నట్లు కనిపిస్తోంది. తన పర్యటనలో నితీశ్‌, సమాజ్‌ వాదీ పార్టీ అధినేత అఖిలేశ్‌ యాదవ్‌, దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్‌ నాయకుడు అరవింద్‌ కేజ్రీవాల్‌, వామపక్ష అగ్ర నేతలతో సహా ప్రతిపక్ష నాయకులను కలవనున్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img