. పీఏ కృష్ణారెడ్డి భార్య, కుమారుడ్ని విచారించిన అధికారులు
. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు
. ఎంపీ అవినాశ్ ముందస్తు బెయిల్‌పై మళ్లీ విచారణ వాయిదా
విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో సీబీఐ దూకుడు పెంచింది. ఈ కేసుతో ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధమున్న ఏ వ్యక్తినీ వదలడం లేదు. అనుమానితులుగా ఉన్న వారిని, ఈ కేసుపై అవగాహన ఉన్నవారినీ విచారిస్తున్నారు. వివేకా కుమార్తె సునీతారెడ్డితోపాటు, ఆమె భర్త రాజశేఖర్ రెడ్డి వాంగ్మూలాలతోపాటు, నిందితుడు ఉదయ్‌కుమార్ రెడ్డితో కర్మాగారంలో పనిచేసే నలుగురిని హైదరాబాద్ కోఠి సెంటర్‌లోని సీబీఐ కార్యాలయానికి పిలిపించి మరీ విచారించింది. వివేకా హత్య జరిగిన రోజు తెల్లవారుజామునే ఘటనాస్థలికి వెళ్లిన ఇనయతుల్లాను సీబీఐ అధికారులు దాదాపు నాలుగు గంటలపాటు విచారించారు.వివేకానందరెడ్డి వద్ద ఇనయతుల్లా సుదీర్ఘకాలం కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేశారు. విధి నిర్వహణలో భాగంగా నిత్యం తెల్లవారుజామునే వివేకా ఇంటికి వెళ్లే ఇనయతుల్లా, హత్య జరిగిన రోజు కూడా యథావిధిగానే వెళ్లారు. అప్పటికే వివేకా హత్య జరిగినట్లు తెలియడంతో మృతదేహం ఫొటోలను వాట్సప్ ద్వారా వివేకా కుటుంబసభ్యులకు పంపారు. ఈ విషయాలన్నీ మరోసారి వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అలాగే కడప జిల్లా తుమ్మలపత్లి యురేనియం కర్మాగారం మెకానికల్ విభాగం మేనేజర్లు టి.చంద్రశేఖర్ రెడ్డి, వెంకటరాజేష్, రాజులను కూడా విచారించారు. గురువారం వివేకా పీఏ కృష్ణారెడ్డిని విచారించేందుకు పులివెందుల్లోని ఆయన ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో ఆయన ఇంట్లో లేకపోవడంతో కృష్ణారెడ్డి భార్య సుజాత, కుమారుడు రాజేశ్‌ను అధికారులు విచారించారు. అలాగే ఇక మరోవైపు ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దయింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌పై బుధవారం విచారణ జరిపిన ఉన్నత న్యాయస్థానం మే 5లోపు సీబీఐకి లొంగిపోవాలని ఎర్ర గంగిరెడ్డిని కోర్టు ఆదేశించింది. లొంగని పక్షంలో ఆయన్ను అదుపులోకి తీసుకోవాలని సీబీఐకి సూచించింది. వివేకానందరెడ్డి హత్య కేసులో తనను సీబీఐ అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ కడప ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై ఇవాళ ఎట్టకేలకు తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. ఇప్పటికే గతవారం ఇదే పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల్ని సుప్రీంకోర్టు తప్పుబట్టిన నేపథ్యంలో తిరిగి విచారణ చేపట్టేందుకు మూడు రోజులు తీసుకున్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్ధానం ఇవాళ వాదనలు ప్రారంభించేందుకు అనుమతించింది. దీంతో అవినాష్ తరఫున నిరంజన్ రెడ్డి, సునీత తరపున సుప్రీం న్యాయవాది సిద్ధార్ధ లూత్రా, సీబీఐ తరఫున పీపీ నాగేంద్ర వాదించారు. ముందుగా వాదనలు ప్రారంభించిన అవినాష్ రెడ్డి లాయర్ నిరంజన్ రెడ్డి.. సీబీఐ తీరుపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ముఖ్యంగా గూగుల్ టేకౌట్ ద్వారా సీబీఐ అవినాశ్ రెడ్డిని నిందితుడిగా చూపించడాన్ని తప్పుబట్టారు. గూగుల్ టేకౌట్ కేవలం ఫోన్ ఎక్కడుందనేది మాత్రమే చెబుతుందని, దాన్నివాడుతున్న వ్యక్తిని కాదని తెలిపారు. అలాగే ఇంట్లో ఉన్నప్పుడు 20 మీటర్ల లొకేషన్ తేడా చూపిస్తుందని గూగుల్ చెప్తుందన్నారు. అప్రూవర్ గా మారిన నిందితుడు దస్తగిరి బెయిల్ పిటిషన్ ను సీబీఐ వ్యతిరేకించకపోవడం, తాను కోరుకున్న విధంగా దస్తగిరి చెప్పేలా సీబీఐ ఒత్తిడి తెచ్చిందంటూ హైకోర్టు దృష్టికి తెచ్చారు. అలాగే అవినాష్ రెడ్డిని నిందితుడిగా మార్చేందుకు సీబీఐ హియర్ అండ్ సే సాక్ష్యంపై ఆధారపడిరదని, వాస్తవానికి ఆ సాక్ష్యం చెల్లదని స్పష్టం చేశారు. అలాగే దస్తగిరి అరెస్ట్ అయినప్పుడు వివేకా హత్యలో ఐదుగురు మాత్రమే ఉన్నారని చెప్పాడని, తర్వాత సీబీఐ మరో స్టేట్‌మెంట్ తీసుకుందన్నారు. అందులో అవినాశ్, భాస్కర్ రెడ్డి పేర్లు చెప్పారన్నారు.
తర్వాత దస్తగిరి ముందస్తు బెయిల్ కోరితే సీబీఐ వ్యతిరేకించలేదని గుర్తుచేశారు. ఇలా ముందస్తు బెయిల్‌ను సీబీఐ వ్యతిరేకించకపోవడం న్యాయ సమ్మతం కాదన్నారు. అవినాశ్ రెడ్డి లాయర్ వాదనలు ముగిసిన తర్వాత సునీతారెడ్డి, సీబీఐ తరఫు న్యాయవాదులు కూడా తమవాదనలు వినిపించారు. అయితే అప్పటికే సమయం ముగియడంతో హైకోర్టు శుక్రవారం మధ్యాహ్నం మూడున్నర గంటలకు విచారణను వాయిదా వేసింది.