Tuesday, May 30, 2023
Tuesday, May 30, 2023

వివేకా లేఖపై వేలిముద్రల పరీక్ష
సీబీఐ కీలక నిర్ణయం

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి: రాష్ట్ర మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటికే ఈ కేసులో ఒక్కో నిందితుడినీ అరెస్టు చేసి జైలుకు పంపుతున్న సీబీఐ… తాజాగా ఎంపీ అవినాశ్‌రెడ్డి పదేపదే చేస్తున్న ఆరోపణల ఆధారంగా వివేకా హత్య ఘటనలో లభ్యమైన లేఖకు నిన్‌ హైడ్రేట్‌(వేలిముద్రలు) పరీక్ష నిర్వహించాలని కీలక నిర్ణయం తీసుకుంది. వివేకా రాసిన లేఖపై ఎవరెవరి వేలిముద్రలున్నాయో గుర్తించేందుకు కసరత్తు మొదలుపెట్టింది. ఈ మేరకు సీబీఐ కోర్టులో అనుమతి కోరుతూ అధికారులు పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై విచారించిన సీబీఐ కోర్టు నిందితుల అభిప్రాయం కోరుతూ తదుపరి విచారణను జూన్‌ 2వ తేదీకి వాయిదా వేసింది. వివేకా హత్య సమయంలో నిందితులు ఆయనతో బలవంతంగా ఓ లేఖ రాయించారని సీబీఐ వాదిస్తోంది. ఘటనా స్థలిలో లభించిన ఈ లేఖలో… ఆలస్యంగా వచ్చావని ప్రశ్నించినందుకు డ్రైవర్‌ ప్రసాద్‌ దారుణంగా కొట్టి చంపేస్తున్నాడని వివేకా ఆరోపించినట్లు సీబీఐ రిమాండ్‌ రిపోర్టుల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో వివేకా రాశారని చెబుతున్న లేఖ కీలకంగా మారింది. ఈ లేఖను 2022 ఫిబ్రవరిలోనే సీబీఐ ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపి రెండు ప్రధాన అంశాలను తెలియజేయాలని కోరారు. లేఖలో వివేకా ఒత్తిడిలో రాశారా? లేదా ? తేల్చాలని కోరగా, వివేకా రాసిన ఇతర లేఖలను పోల్చిచూసిన తర్వాత ఆయన ఒత్తిడిలోనే ఈ లేఖ రాసినట్లు ఫోరెన్సిక్‌ నివేదిక తేల్చింది. తాజాగా ఈ లేఖపై వేలిముద్రలు కూడా గుర్తించాలని సీబీఐ నిర్ణయించింది. ఇటీవల ఎంపీ అవినాశ్‌రెడ్డి ఆ లేఖను సీబీఐ ఎందుకు పరిగణనలోకి తీసుకోవడం లేదని సీబీఐ అధికారులను నిలదీస్తున్నారు. దస్తగిరి చెప్పిన వాంగ్మూలం ఆధారంగానే ఏకపక్షంగా దర్యాప్తు చేపడుతున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో సీబీఐ ఈ లేఖపై వేలిముద్రల్ని గుర్తించేందుకు నిన్‌హైడ్రేట్‌ పరీక్ష చేయించాలని నిర్ణయించింది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img