Friday, June 9, 2023
Friday, June 9, 2023

వివేక హత్య కేసు – సీబీఐ కస్టడీకి సీఎం చిన్నాన్న

. భాస్కర్‌ రెడ్డితోపాటు ఉదయ్‌కుమార్‌ రెడ్డి కూడా
. 6 రోజుల కస్టడీకి అనుమతిచ్చిన నాంపల్లి కోర్టు
. ఎంపీ అవినాశ్‌రెడ్డికి కొంత ఊరట
. 25వ తేదీ వరకు అరెస్ట్‌ చేయొద్దని హైకోర్టు ఆదేశం
. సీబీఐ విచారణకు హాజరు కావాలని స్పష్టీకరణ

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : మాజీమంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డికి స్వయానా చిన్నాన్న అయిన వైఎస్‌ భాస్కరరెడ్డి, ఆయన ముఖ్య అనుచరుడు ఉదయ్‌కుమార్‌ రెడ్డిలను సీబీఐ అధికారులు అరెస్ట్‌ చేయడం, కోర్టు వారికి 14 రోజుల రిమాండ్‌ విధించడంతో ప్రస్తుతం వారు చంచలగూడ జైలులో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి ఇంకా కీలక సమాచారం సేకరించాల్సి ఉన్నందున వైఎస్‌ భాస్కర్‌ రెడ్డి, ఉదయ్‌ కుమార్‌ రెడ్డిలను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ సీబీఐ మంగళవారం పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన సీబీఐ కోర్టు వారిద్దరిని 6 రోజుల కస్టడీకి అనుమతిచ్చింది. వివేక హత్యకు భాస్కర్‌రెడ్డి నెల రోజుల ముందు కుట్ర పన్నారని, అందుకోసం రూ.40 కోట్లను సిద్ధం చేసుకున్నారని, అందులో నాలుగైదు కోట్ల రూపాయలు చేతులు మారాయని సీబీఐ అధికారులు కోర్టుకు తెలిపారు. భాస్కర్‌ రెడ్డి సమాజంలో పలుకుబడి ఉన్న వ్యక్తి అని, దర్యాప్తును ప్రభావితం చేసే అవకాశాలున్నాయని, పైగా ఆయన విచారణలో సరైన సమాధానాలు ఇవ్వడం లేదని సీబీఐ అధికారులు వివరించారు. అందుకే అతడిని అరెస్ట్‌ చేశామని, కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని కోర్టుకు తెలిపారు. దీంతో వారిని సీబీఐ కస్టడీకి అనుమతిస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
25 వరకు అవినాశ్‌రెడ్డిని అరెస్ట్‌ చేయొద్దు: హైకోర్టు
కడప పార్లమెంటు సభ్యులు, వైఎస్‌ భాస్కరరెడ్డి కుమారుడు అవినాశ్‌ రెడ్డికి మంగళవారం తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఆయనను ఈ నెల 25వ తేదీ వరకు అరెస్ట్‌ చేయవద్దని సీబీఐకి ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అవినాశ్‌ విచారణకు సంబంధించి ఆడియో, వీడియో రికార్డింగ్‌ చేయాలని స్పష్టం చేసింది. అయితే 25వ తేదీ వరకు అవినాశ్‌ రెడ్డి రోజూ విచారణకు హాజరు కావాలని చెప్పింది.
ఆ రోజున ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ పైన తుది తీర్పు ఇస్తామని స్పష్టం చేసింది. ఇప్పటికే 5 సార్లు విచారించిన సీబీఐ అధికారులు ఇక తనను ఖాయంగా అరెస్ట్‌ చేస్తారన్న అనుమానంతో అవినాశ్‌ రెడ్డి తెలంగాణ హైకోర్టులో ముందస్తు బెయిల్‌ పిటిషన్‌ దాఖలు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై రెండు రోజులుగా వాదనలు కొనసాగాయి. అవినాశ్‌రెడ్డి ముందస్తు బెయిల్‌ పిటిషన్‌లో వివేకానందరెడ్డి కుమార్తె సునీత కూడా ఇంప్లీడ్‌ కావడంతో మంగళవారం దీనిపై రెండు పక్షాల న్యాయవాదుల మధ్య వాడివేడిగా వాదనలు జరిగాయి.
అవినాశ్‌ రెడ్డికి ఈ హత్యతో ఎలాంటి సంబంధం లేదని, అప్రూవర్‌గా మారిన దస్తగిరి వాంగ్మూలం ఆధారంగా ఆయనను అరెస్ట్‌ చేయాలని సీబీఐ ఆతృత పడుతోందని ఎంపీ తరపు న్యాయవాది హైకోర్టులో వాదనలు వినిపించారు. వివేక హత్య కేసు రోజున మృతదేహం వద్దకు అవినాశ్‌ వెళ్లే వరకు చాలామంది ఉన్నారని చెప్పారు. సాక్ష్యాలు తారుమారు చేసే ఆలోచన లేదన్నారు. ఈ హత్యకు కుటుంబ తగాదాలు, వ్యాపార తగదాలు కావొచ్చునని, రాజకీయ కారణాలు కూడా ఉండవచ్చునని వాదనలు వినిపించారు. అవినాశ్‌కు మాత్రం ఈ కేసుతో సంబంధం లేదని చెప్పారు. మరోవైపు సీబీఐ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ వివేక హత్య వెనుక కుటుంబ తగాదాలు, వ్యాపార తగాదాలు లేవని కోర్టుకు తెలిపారు. అవినాశ్‌ రెడ్డి విచారణకు సహకరించడం లేదని, ఆయన సాక్ష్యాలు తారుమారు చేసే ప్రయత్నాలు చేశారని విన్నవించారు. ఈ దశలో జోక్యం చేసుకున్న ధర్మాసనం వివేకకు గుండెపోటు అని ఎందుకు చెప్పారని ప్రశ్నించింది. అక్కడున్న వారు గుండెపోటు అని చెపితే అదే విషయం చెప్పారని తెలిపారు.
ఇంకోవైపు ఇంప్లీడ్‌ అయిన సునీత తరపు న్యాయవాది మొదటినుండి ఈ కేసు విచారణను ఆలస్యం చేసేందుకు అవినాశ్‌రెడ్డి ప్రయత్నం చేస్తున్నారని, సీబీఐ విచారణకు ఏమాత్రం సహకరించడం లేదని వాదించారు. ముగ్గురు న్యాయవాదుల వాదనలు విన్న అనంతరం న్యాయమూర్తి తీర్పును 25వ తేదీకి వాయిదా వేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img