Friday, December 2, 2022
Friday, December 2, 2022

విశాఖలో మళ్లీ ఉద్రిక్తత

. పవన్‌ కల్యాణ్‌కు పోలీసుల నోటీసు
. ర్యాలీలు, సభలకు అనుమతి లేదని వెల్లడి
. జనసేన కార్యకర్తల అరెస్ట్‌
. పోలీసుల తీరుపై మండిపడ్డ పవన్‌
. జనవాణి వాయిదా వేసినట్లు ప్రకటన

విశాలాంధ్రబ్యూరో-విశాఖపట్నం: జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ విశాఖ పర్యటనలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. జనవాణి పేరుతో పవన్‌ కల్యాణ్‌ ప్రజల సమస్యల పై ఆర్జీలను స్వీకరించే కార్యక్రమాన్ని విశాఖ పోర్టు కళావాణి స్టేడియంలో ఆదివారం నిర్వహించ తలపెట్టారు. అయితే శనివారం ఎయిర్‌ పోర్టు వద్ద జరిగిన సంఘటన లపై 28 మంది జనసేన నేతలపై సెక్షన్‌ 147, 148, 149, 341, 307, 324 ,325, 427, 188 కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. వీరిలో కొంతమందిని అరెస్ట్‌ చేశారు. మరోపక్క జనవాణి కార్యక్రమాన్ని రద్దు చేయాలని, సెక్షన్‌ 30 అమలులో ఉందని పవన్‌ కళ్యాణ్‌ కు పోలీసులు నోటీసులు జారీ చేశారు. దీంతో ఆదివారమంతా నగరంలో మళ్లీ తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శనివారం సాయంత్రం పవన్‌ కళ్యాణ్‌ కి స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున జనసేన కార్యకర్తలు తరలిరావడం, అదే సమయానికి విశాఖ గర్జనలో పాల్గొన్న మంత్రులు తిరుగు ప్రయాణానికి ఎయిర్‌ పోర్టుకు చేరుకోగా, కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు మంత్రుల బృందంపై దాడికి యత్నించారు. ఈ ఘటనలో మంత్రి రోజా డ్రైవర్‌ గాయపడినట్టు తెలిసింది. కాగా పవన్‌ కల్యాణ్‌ శనివారం రాత్రి బస చేసేందుకు నోవోటెల్‌ హోటల్‌లో దిగారు. అక్కడికి భారీగా క జన సేన కార్యకర్తలు చేరుకోవడంతో పాటు పోలీసులు కూడా భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలో రాత్రి హోటల్‌ వద్ద జనసేన నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని జనసేన నాయకులు తెలిపారు. కాగా ఆదివారం ఉదయం జనవాణి వేదిక ద్వారం వద్ద పవన్‌ గో బాక్‌ అంటూ కొందరు వ్యక్తుల నిరసన తెలిపారు. వేదిక వద్దకు, పవన్‌ కల్యాణ్‌ బస చేసిన హోటల్‌ లోనికి జనసేన నాయకులు, కార్యకర్తలను వెళ్లనీయకుండా పోలీసులు భారీగా మోహరించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పెద్ద ఎత్తున జనసేన నాయకులను, కార్యకర్తలను పోలీస్‌ స్టేషన్‌ తరలించారు.ఈ నేపథ్యంలో పోలీసుల తీరును నిరసిస్తూ పవన్‌ కల్యాణ్‌ హోటల్‌ లోనే ఉండిపోయారు.
మావారిని విడుదల చేయాలి: పవన్‌
జనవాణి కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు పవన్‌ కల్యాణ్‌ తెలిపారు. నోవోటెల్‌ ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం సక్రమంగా పని చేస్తే ప్రజలు తమ జనవాణి కి ఎందుకు వస్తారని ప్రశ్నించారు. ఉత్తరాంధ్ర పర్యటనను మూడునెలల ముందే ఖరారుచేశామని, తమ పార్టీ కార్యక్రమాలు ఎలా చేసుకోవాలో వైసీపీ చెబుతుందా అని ప్రశ్నించారు. వైసీపీ మూడు రాజధానుల గర్జన కార్యక్రమానికి ముందే తమ ప్రోగ్రాం ఖరారు చేశామని, ప్రభుత్వంతో పోటీ తమకెందుకని, ఎన్నికల సమయంలోనే పోటీ ఉంటుందన్నారు. కడుపు కాలినోడు, అన్యాయం జరిగినోళ్లు గర్జిస్తారు కానీ, అధికారంలో ఉన్న మీరు గర్జించడం ఏంటని వైసీపీ నాయకులను ప్రశ్నించారు. జనవాణి కార్యక్రమాన్ని తమ నాయకులు లేకుండా నిర్వహించబోమని, వాళ్లు బయటకు వచ్చే వరకు వేచి ఉంటామని, ప్రభుత్వం అక్రమంగా అరెస్టు చేసిన నాయకులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఎంపీలు, ఎమ్మెల్యే లు చేతిలో ఉంచుకొని ప్రజాసమస్య లు పక్కన బెట్టి ఎంతసేపూ బూతులు మాట్లాడుతూ వైసీపీ నేతలు కాలయాపన చేయడం వల్లనే జన వాణి పెట్టాల్సి వచ్చిందన్నారు. మా నాన్న పోలీస్‌ కానిస్టేబుల్‌ అని అందుకే వారంటే నాకు అభిమానమని పవన్‌ చెప్పారు. పోలీసులు పైనున్న రాజకీయనాయకుల ఆర్డర్స్‌ ఫాలో అవుతారని, మీరు సవ్యంగా పనిచేసే వారైతే, వైయస్‌ వివేకానంద రెడ్డిని హత్య కేసును ఎందుకు ఛేదించ లేకపోయారని ప్రశ్నించారు. ఏపీ పోలీసుల మీద నమ్మకం లేదన్న జగన్‌ కింద మీరు పని చేస్తున్నారని గుర్తుంచుకోవాలని పోలీసులకు హితవు పలికారు. గంజాయి స్మగ్లర్లును, వారిని వెంటేసు కొచ్చే రాజకీయ నేతలను వదిలేసి, ప్రజాస్వామ్యయుతం గా జనవాణి జరిపే మమ్మల్ని వేధిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఈ పర్యటన లో తమకు అసలు అమరావతి లేదా మూడు రాజధానుల మీద ఎజెండానే లేదన్నారు. అసలు 2014 లోనే విశాఖ రాజధాని అంటే సరిపోయేదని, అధికార వికేంద్రీకరణ కోరుకుంటే… ముందు ప్రభుత్వం లోని 26 మంత్రులు, 5 గురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నారు కదా వీరికి అధికారం ఎందుకు పంచకుండా మొత్తం అధికారం అంతా ఒకరి దగ్గరే ఎందుకు పెట్టుకున్నారని పవన్‌ ప్రశ్నించారు. అరెస్ట్‌ చేసిన మా నాయకులను భేషరతుగా విడుదల చేసే వరకూ జనవాణి నిలుపుదల చేస్తున్నామని, ఒకవేళ వదలక పోతే మా కార్యాచరణ ఏంటో తెలియ జేస్తామని పవన్‌ చెప్పారు. తమ శ్రేణులపై ఏకంగా 307 సెక్షన్‌ పెట్టారని హత్యాయత్నం చేసిన వాళ్లపై పెట్టాల్సిన కేసులు ఇవన్నారు. భవిష్యత్తు లో అన్నీ తెలియజేస్తామని అన్నీ సిద్ధపడే రాజకీయ రంగం లోకి దిగామన్నారు. ప్రజాస్వామ్యం కోసం చనిపోవడానికి సిద్ధమని, కోడి కత్తి కేసు లానే నిన్నటి విశాఖ ఘటన చూస్తున్నా మన్నారు. వారిని వారే పొడిపించుకున్నట్టు నిన్నటి దాడి జరిగి ఉండొచ్చునన్నారు. ఉత్తరాంధ్ర లో శాంతి ఉండకూడదనేదే వైసిపీ వ్యూహమని, తాను వచ్చే సమయానికి మంత్రులు ఎయిర్‌ పోర్ట్‌ కు రావడం వెనుక స్కెచ్‌ ఉందని భావిస్తున్నామని, ప్రజా ఉద్యమాలను వైసిపీ తట్టుకోలేదన్నారు.
సెక్షన్‌ 30 అమలులో ఉంది…
విశాఖ నగరంలో ర్యాలీలు, సభలకు అనుమతి లేదని ఈస్ట్‌ ఏసీపీ హర్షిత చంద్ర తెలిపారు. నగరంలో శాంతి భద్రతల దృష్ట్యా సెక్షన్‌ 30ని అమలు చేస్తున్నామని, అందుకే పవన్‌ కల్యాణ్‌ కి నోటీస్‌ ఇచ్చి నగరంలో ర్యాలీలు, సభలు పెట్టవద్దని తెలియజేశామని చెప్పారు. ఆదివారం మధ్యాహ్నం పవన్‌ కల్యాణ్‌ మీడియా సమావేశం సమయంలో ఏసీపీ అక్కడకు చేరుకుని సెక్షన్‌ 30 నోటీసులు అందజేశారు

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img