Saturday, June 3, 2023
Saturday, June 3, 2023

విశాఖ ఉక్కుపై అనిశ్చితి

. ప్రైవేటీకరణ ఆగిందా…లేదా
. ప్రైవేటుకివ్వం…బలపరుస్తామన్న కేంద్రమంత్రి
. కేబినెట్‌ ప్రకటన చేయాలంటున్న కార్మిక నేతలు

విశాలాంధ్ర బ్యూరో-విశాఖపట్నం: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై కేంద్రమంత్రి ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే స్పష్టత ఇచ్చారా? లేక మరింత గందరగోళంలోకి నెట్టారా? అనే విషయం సందిగ్ధంగా మారింది. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై ఇప్పటికిప్పుడు ముందుకు వెళ్లడం లేదని, దీని పటిష్టత కోసం ఆలోచిస్తున్నామని మంత్రి ప్రకటించారు. ఉక్కు కర్మాగారాన్ని బలోపేతం చేస్తామని, ప్రైవేటుకు అప్పగించాలని ప్రస్తుతానికి అనుకోవడం లేదని కేంద్ర ఉక్కుశాఖ సహాయ మంత్రి ఫగ్గన్‌ సింగ్‌ కులస్తే గురువారం తెలిపారు. రోజ్‌గార్‌ మేళా సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. ‘ప్రస్తుతానికి ఉక్కు కర్మాగారాన్ని విక్రయించే యోచన లేదు. రాబోయే రోజుల్లో మరింత మెరుగుపరుస్తాం. మైనింగ్‌ సమస్యలనూ పరిష్కరిస్తాం’ అని పోర్టు నగరంలో విలేకరులతో మాట్లాడిన కులస్తే అన్నారు. రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (ఆర్‌ఐఎన్‌ఎల్‌)ను బలోపేతం చేసే పనిలో ఉన్నామని చెప్పారు. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో కొత్త విభాగాలు ప్రారంభిస్తున్నామని, ముడిసరుకును పెంపొందించే ప్రక్రియపై దృష్టి పెట్టామని, పూర్తిస్థాయి సామర్థ్యంతో పనిచేసేలా చూస్తామని అన్నారు.
సీసీఈఏ ప్రకటిస్తేనే నమ్ముతాం: కార్మిక నేతలు
ఆర్థిక వ్యవహారాలపై కేంద్ర కమిటీ (సీసీఈఏ) అధికారికంగా ప్రకటన చేస్తే తప్ప మంత్రి కులస్తే మాటలను నమ్మేది లేదని విశాఖ స్టీల్‌ప్లాంట్‌ కార్మిక సంఘాల నాయకులు తేల్చిచెప్పారు. ఉక్కు కర్మాగారాన్ని అమ్మాలని నిర్ణయించిన సీసీఈఏనే…దీని నుంచి వెనక్కి వస్తున్నట్లు ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. ‘ప్రైవేటీకరణ ప్రణాళికకు వ్యతిరేకంగా 800 రోజులుగా ఆందోళన చేస్తున్నాం. రాష్ట్రంతో పాటు తెలంగాణ ప్రజల నుంచి పోరాటానికి మద్దతు ఉంది’ అని నాయకులు చెప్పారు. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ జరగనివ్వబోమని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించినప్పటికీ, రాష్ట్రీయ ఇస్పాత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ లేక విశాఖ స్టీల్‌ప్లాంట్‌ విక్రయానికి విలువ కట్టేందుకు న్యాయ సలహాదారులను కేంద్రం నియమించింది. వెంటనే ఈ ప్రక్రియ మొత్తం ఆగిపోవాలని, అది జరిగితే మంత్రి కులస్తే ప్రకటనను నమ్ముతామని జేఏసీ నేతలు తేల్చిచెప్పారు. విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ అధ్వర్యంలో నాయకుల బృందం నొవాటల్‌ హోటల్‌లో కేంద్రమంత్రి కులస్తేని కలిసి వినతిపత్రం అందజేసింది. అనంతరం విలేకరులతో నాయకులు మాట్లాడుతూ ఒక్కోమంత్రి ఒకోలా ప్రకటనలు చేస్తున్నారని, కేంద్ర మంత్రి ప్రకటన…ఉదయానికి సాయంత్రానికి మారిపోయిందన్నారు. ఈ ప్రకటనలు ప్రజలను ఆందోళనకు గురి చేయడానికేనని నేతలు వ్యాఖ్యానించారు. గురువారం మధ్యాహ్నం స్టీల్‌ప్లాంట్‌ యాజమాన్యం, యూనియన్‌ ప్రతినిధులతో జరిపిన సమావేశంలో మంత్రి ప్రకటన సారాంశం మారిపోయిందన్నారు. స్టీల్‌ప్లాంట్‌ను లాభాల్లోకి రాకుండా అడ్డుకుంటున్నది కేంద్రప్రభుత్వమేనని ఆరోపించారు. ఖాయలా పరిశ్రమగా చిత్రీకరించి మూసివేసేందుకు కేంద్రం మొదటి నుంచి కుట్ర చేస్తున్నదని జేఏసీ చైర్మన్‌, ఏఐటీయూసీ జాతీయ ఉపాధ్యక్షుడు డి.ఆదినారాయణ విమర్శించారు. పూర్తిస్థాయి ఉత్పత్తి జరగనివ్వకుండా ప్లాంట్‌ను ఆర్థికంగా దెబ్బతీస్తోందని ఆగ్రహం వ్యక్తంచేశారు. బ్లాస్ట్‌ ఫర్నేస్‌ను మూసివేసి ముడిసరుకు, వర్కింగ్‌ కేపిటల్‌ ఇవ్వడం లేదన్నారు.
రైల్వే రేక్స్‌ను అడ్డుకుంటోందని, సొంత గనులు ఇవ్వలేదన్నారు. మరి లాభాలు ఎక్కడ నుంచి వస్తాయని ప్రశ్నించారు. దేశంలోని ప్రైవేట్‌ స్టీల్‌ప్లాంట్‌లకు కేటాయించినట్లు వైజాగ్‌ స్టీల్‌ప్లాంట్‌కు సొంతగనులు కేటాయించి, దీనిని పూర్తి సామర్ధ్యంతో కేంద్రం నడిపిస్తే కచ్చితంగా లాభాలు వస్తాయన్నారు. ఇటీవల పార్లమెంట్‌లో ఎంపీలు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం స్టీల్‌ప్లాంట్‌ అమ్మకంపై వెనక్కి తగ్గేది లేదని, ప్రైవేటీకరణ ప్రక్రియ కొనసాగుతుందని ప్రకటించారని గుర్తుచేశారు. ఇప్పుడు కేంద్రమంత్రి ప్రకటన ప్రజలను మరోసారి వంచించే ఎత్తుగడగా ఉందని మండిపడ్డారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిలిపివేస్తున్నట్లు కేంద్రమంత్రివర్గం వెంటనే ప్రకటన చేయాలని, స్టీల్‌ప్లాంట్‌కి సొంత గనులు కేటాయించి, ప్లాంట్‌ని పూర్తి సామర్థ్యంతో నడిపేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరినట్లు జేఏసీ నేతలు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img