Friday, June 9, 2023
Friday, June 9, 2023

విశాఖ ఉక్కు ఉద్యమంపై ఉక్కుపాదం

. ఆందోళనకారులపై ప్రభుత్వ నిర్బంధకాండ
. ముందస్తు అరెస్ట్‌లు, గృహనిర్బంధాలు
. ప్రజాస్వామ్య హననంపై మండిపడ్డ నాయకులు
. మద్దతు అంటూనే వైసీపీ అణచివేత ధోరణి
. అరెస్ట్‌ చేసిన వారిని పరామర్శించిన రామకృష్ణ

విశాలాంధ్ర బ్యూరో – అమరావతి : విశాఖపట్నం ఉక్కు ఉద్యమంపై రాష్ట్ర ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకమని చెపుతూనే, అందుకోసం జరిగే ఉద్యమాన్ని అణచివేస్తోంది. విశాఖ ఉక్కు పరిరక్షణ వేదిక అధ్వర్యాన బుధవారం స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాస్తారోకో కార్యక్రమం నిర్వహించేందుకు సిద్ధం కాగా, రాష్ట్ర ప్రభుత్వం వామపక్ష పార్టీల నాయకులను, కార్మిక సంఘాల నేతలను ముందస్తు అరెస్ట్‌లు, గృహ నిర్బంధాలు చేపట్టి ఆందోళనలను భగ్నం చేసేందుకు ప్రయత్నించింది. పోలీసు బలగాలను ఛేదించుకుని ఆందోళన చేస్తున్న కార్మిక నేతలను బలవంతంగా అరెస్ట్‌ చేసి పోలీస్‌స్టేషన్‌లలో నిర్బంధించింది. విజయవాడలో రెండు జాతీయ రహదారులు కలిసే కనకదుర్గమ్మ వారధి వద్ద రాస్తారోకో చేసేందుకు వామపక్ష, కార్మిక సంఘాల నేతలు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో బయలుదేరారు. మరోపక్క ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘాల సమన్వయ సమితి కన్వీనర్‌ వడ్డే శోభనాద్రీశ్వరరావు నేతృత్వంలో లబ్బీపేట రమేశ్‌ హాస్పటల్‌ రోడ్డు నుంచి వారధి వద్దకు చేరుకునేందుకు సిద్ధమవుతుండగా నాయకుల్ని పోలీసులు అక్రమంగా అరెస్టు చేసి భవానీపురం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై ప్రతిపక్ష పార్టీలు, ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మోదీ, జగన్‌ పాలనలో ప్రజాస్వామ్య హననం జరుగుతోందని ధ్వజమెత్తారు.ఉక్కు పోరాటంలో అరెస్టయి భవానీపురం పోలీస్‌స్టేషన్‌లో ఉన్న నాయకుల్ని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ పరామర్శించారు. ఉద్యమానికి సంపూర్ణ మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ విశాఖ ఉక్కు తెలుగువారి ఆత్మగౌరవానికి చిహ్నమన్నారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రంగా ఉన్నప్పుడు 51 మంది ఉభయ కమ్యూనిస్టు పార్టీలకు చెందిన శాసనసభ్యులు, గౌతు లచ్చన్న సారధ్యంలో స్వతంత్ర పార్టీ సభ్యులు, ఇండిపెండెంట్లు మొత్తం 77 మంది శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు వారి సభ్యత్వాలకు రాజీనామాలు చేసి సాధించుకున్నట్లు తెలిపారు. ఇప్పుడు కూడా ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల ప్రజాప్రతినిధులు విశాఖ స్టీల్‌ ఉద్యమంలో కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లో కమ్యూనిస్టు పార్టీలు, ప్రతిపక్షపార్టీలు మద్దతు ఇస్తున్నాయని చెప్పారు. తెలుగుప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడుకోవటం కోసం అధికార పార్టీ ప్రజాప్రతినిధులు భాగస్వాములు కావాలని కోరారు. త్వరలో తెలంగాణ రాష్ట్రానికి వెళ్లి అక్కడ ప్రజాప్రతినిధుల మద్దతు కూడగడతామని చెప్పారు. సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి మోదీకి, అదానీకి ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ ప్రైవేటు స్టీల్‌ కంపెనీలకు గనులు కేటాయించి ప్రభుత్వరంగ సంస్థ అయిన విశాఖ స్టీల్‌కు కేటాయించకపోవటం దారుణమన్నారు. ఏపీ ప్రత్యేక హోదా విభజన హామీల సాధన పోరాట సమితి అధ్యక్షుడు చలసాని శ్రీనివాసరావు మాట్లాడుతూ మలేరియా, డెంగ్యూ దోమలు కుట్టినట్లు మోదీని చూస్తే వైసీపీ, టీడీపీ, జనసేన పార్టీలు చలిజ్వరంతో వణికిపోతున్నాయని ఎద్దేవా చేశారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ సీఎం జగన్‌ ఉక్కు ఉద్యమాన్ని అణచివేయటం కాకుండా విశాఖస్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను ఆపేందుకు ప్రయత్నిస్తే ప్రజలు హర్షించేవారని చెప్పారు. కార్పొరేట్‌లకు తప్ప సామాన్య ప్రజల గురించి వైసీపీ ప్రభుత్వం ఆలోచించదనే విషయం అర్థమవుతుందన్నారు. సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు సీహెచ్‌.బాబూరావు, సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకులు రవిచంద్ర, పి.ప్రసాద్‌, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకులు ఎం.రామకృష్ణ తదితరులు అరెస్టయిన వారిలో ఉన్నారు. ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్‌.రవీంద్రనాథ్‌ను హౌస్‌ అరెస్ట్‌ చేశారు.
ప్రైవేటీకరణ ఆపే వరకు పోరు: ముప్పాళ్ల
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఆపే వరకు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలు ఉధృతంగా నిర్వహిస్తామని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు హెచ్చరించారు. మంగళగిరి సీపీఐ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 20 సంవత్సరాల నుంచి కేంద్ర ప్రభుత్వాలు స్టీల్‌ ప్లాంట్‌ వాటాలు అమ్మాలని ప్రయత్నించినా ఇంతవరకు ఒక్క శాతం కూడా అమ్మలేకపోయారంటే దానికి కమ్యూనిస్టుల పోరాటమే కారణమని అన్నారు. బీజేపీ ప్రభుత్వ కుట్ర వల్ల విశాఖ స్టీల్‌ నష్టాల్లో ఉందని, 100 శాతం ఉత్పత్తి సామర్థ్యంతో విశాఖ స్టీల్‌ నడపాలని డిమాండ్‌ చేస్తున్నామన్నారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అదానీ, అంబానీ లాంటి బహుళ సంస్థల అధినేతలకి ప్రభుత్వ రంగ సంస్థలను కారుచౌకగా కట్టబెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రానున్న కాలంలో విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ కోసం మరిన్ని పోరాటాలు కొనసాగిస్తామని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణను నిలిపివేయాలని ముప్పాళ్ల డిమాండ్‌ చేశారు. సీపీఐ మంగళగిరి నియోజకవర్గ కార్యదర్శి చిన్ని తిరుపతయ్య, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి మేడా హనుమంతరావు, తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేటికరణను నిరసిస్తే అక్రమ అరెస్టులా: జేవీఎస్‌ఎన్‌
విశాఖ స్టీల్‌ప్లాంట్‌ పరిరక్షణకు జరుగుతున్న ఉద్యమానికి సంఫీుభావం ప్రకటించి, కార్మికుల పక్షాన నిలబడాల్సిన వైసీపీ ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తూ నాయకుల అక్రమ అరెస్టులకు పాల్పడటం దుర్మార్గమని సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జేవీ సత్యనారాయణ మూర్తి విమర్శించారు. విశాఖలో కార్మిక సంఘాల ఐక్యవేదిక పిలుపు మేరకు రాస్తారోకో తలపెట్టగా పోలీసులు పెద్ద ఎత్తున నిర్బంధం ప్రయోగించారు. అనేకమంది నేతలను గృహ నిర్బంధం చేశారు.
రోడ్డెక్కకుండా అరెస్టులతో అడ్డుకున్నారు. జేవీసత్యనారాయణ మూర్తిని ఇంటిలోనే తెల్లవారుజామున హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఆయనను బయటికి రాకుండా పోలీసు పహారా కాశారు. సీపీఐ విశాఖ జిల్లా కార్యదర్శి మరిపిల్ల పైడిరాజును హౌస్‌ అరెస్ట్‌ చేశారు. తగరపువలస, మధురవాడ సీపీఐ, సీపీఎం నాయకులు అల్లు బాబురావు, ఆర్‌ఎస్‌ఎన్‌ మూర్తి, వి.సత్యనారాయణ, డి.అప్పలరాజు, రాజ్‌ కుమార్‌ తదితరులను అరెస్ట్‌ చేసి భీమిలి, పీఎం పాలెం పోలీస్‌ స్టేషన్‌లలో ఉంచారు. మద్దిలపాలెం జంక్షన్‌ వద్ద నిరసన తెలపటానికి వెళుతున్న వామపక్ష, ప్రజాసంఘాల నేతలను అరెస్టు చేసి ఎంవీపీ పోలీస్‌ స్టేషన్‌కి తరలించారు. అరెస్టయిన వారిలో సీపీఐ, ఏఐటీయూసీ నాయకులు ఎం.మన్మధరావు, పడాల గోవింద్‌, జి.వామనమూర్తి, ఎన్‌.అప్పన్న, వి.నల్లయ్య, ఎం. శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
బీజేపీకి పుట్టగతులు ఉండవు: జల్లి విల్సన్‌
విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరిస్తే, తెలుగు రాష్ట్రాలలో బీజేపీకి పుట్టగతులు ఉండవని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, మాజీ శాసనమండలి సభ్యులు జల్లి విల్సన్‌ హెచ్చరించారు. విజయవాడ – జగదల్పూర్‌ జాతీయ రహదారిపై ఇబ్రహీంపట్నం వద్ద రాస్తారోకో నిర్వహించారు. సీపీఐ ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి సీహెచ్‌ కోటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జల్లి విల్సన్‌ మాట్లాడుతూ ఎన్నో త్యాగాల ద్వారా సాధించుకున్న విశాఖ ఉక్కును కార్పొరేట్లకు కట్టబెడుతుందని, దీనిని ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమై కాపాడుకోవాలని అన్నారు. జాతీయ కాంగ్రెస్‌ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు బొర్రా కిరణ్‌, సీపీఎం నాయకులు మహేశ్‌, ఎంసీపీఐయూ నాయకులు గొల్లపూడి ప్రసాద్‌, మహిళా సమాఖ్య నాయకురాలు సీహెచ్‌ దుర్గా కోటేశ్వరరావు, రామసీతా (ఐద్వా) తదితరులు పాల్గొన్నారు.
ప్రైవేటీకరణను అడ్డుకుని తీరుతాం: జంగాల
రాష్ట్రానికి తలమానికంగా ఉన్న విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణను అడ్డుకుని తీరతామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జంగాల అజయ్‌కుమార్‌ అన్నారు. గుంటూరు శంకర్‌ విలాస్‌ సెంటర్‌లో రాస్తారోకో నిర్వహించారు. రాస్తారోకోను అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్ట్‌ చేసి అక్కడి నుంచి పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా నాయకులు, పోలీసులకు మధ్య కొంత పెనుగులాట చోటుచేసుకుంది. సీపీఎం జిల్లా కార్యదర్శి పాశం రామారావు, సీపీఐ నగర కార్యదర్శి కోట మాల్యాద్రి, సీపీఎం నగర కార్యదర్శి కె.నళినీకాంత్‌, సీఐటీయూ నాయకులు లక్ష్మణ్‌, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ నాయకులు ఉల్లిగడ్డ నాగేశ్వరరావు, సీపీఐ(ఎంఎల్‌) నాయకులు గనిరాజు తదితరులు పాల్గొన్నారు.
విశాఖ ఉక్కును ప్రభుత్వరంగంలోనే కొనసాగించాలి: డేగా
విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు డేగా ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. ఏలూరు నగరంలో వసంత మహల్‌ సెంటర్‌ వద్ద కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు, కాంగ్రెస్‌ పార్టీ, రైతు సంఘాల అధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించాయి. జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ స్తంభించింది. సీపీఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, ఏఐటీయూసీ జిల్లా కన్వీనర్‌ బండి వెంకటేశ్వరరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి అరటికట్ల రవి, సీపీఐ ఎంఎల్‌ న్యూడెమోక్రసీ జిల్లా అధికార ప్రతినిధి యు.వెంకటేశ్వరరావు, కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు రాజనాల రామ్మోహనరావు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి ప్రసాద్‌, ఐఎఫ్‌టీయూ జిల్లా కార్యదర్శి బద్దా వెంకట్రావు, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img