Tuesday, March 21, 2023
Tuesday, March 21, 2023

విశాఖ ఉక్కు పరిరక్షణకు గర్జిద్దాం

. ఉక్కు ఉద్యమానికి 717 రోజులు
. నేడు ప్రజా గర్జన సభ
. హాజరు కానున్న రాజకీయ ప్రముఖులు

విశాలాంధ్ర బ్యూరో ` విశాఖపట్నం: విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో గత 717 రోజులుగా విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సాగుతున్న పోరాటంలో భాగంగా సోమవారం ఉక్కు నగరంలో ప్రజా గర్జన సభ నిర్వహించబోతున్నారు. కేంద్రంలో మోదీ ప్రభు త్వం నవరత్నాల లాంటి ప్రభుత్వరంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టేందుకు దేశవ్యాప్తంగా ఉన్న అనేక ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకంలో భాగంగానే విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణకు 717 రోజుల క్రితం కేంద్ర ప్రభుత్వం పావులు కదిపింది. అప్పటి నుంచి వామపక్ష పార్టీలు, కార్మిక సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన, మహిళా సంఘాలు విశాఖ ఉక్కు కార్మికులు, ఉద్యోగులకు అండగా నిలిచి రాష్ట్ర వ్యాప్తంగా విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్నాయి. విశాఖ ఉక్కును ప్రైవేటు పరం కానివ్వ మంటూ నినదిస్తున్నాయి. ఇప్పటికే రాష్ట్రవ్యాప్తంగా ఉక్కు ప్రజా గర్జనకు వామపక్ష, ప్రజా, కార్మిక సంఘాలు పెద్ద ఎత్తున ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించాయి. విశాఖ ఉక్కు పరిశ్రమ భూములపై కన్నేసిన కేంద్ర ప్రభుత్వం కారు చౌకగా కార్పొరేట్‌ సంస్థలకు కట్టబెట్టేందుకు ఉద్యోగ, కార్మిక, ప్రజా ఉద్యమాలను సైతం లెక్కచేయకుండా ముందుకు వెళుతోంది. విశాఖ ఉక్కు ఉద్యమం ఇకపై ఉవ్వెత్తున ఎగిసిపడేలా ప్రజా గర్జన ద్వారా కేంద్ర ప్రభుత్వం మెడలు వంచాలని రాజకీయ పార్టీలు అందుకు ముం దుండి నడిపించాలని కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. ఈ ఉక్కు పరిరక్షణ ఉద్యమంతో రాజకీయ పార్టీల చిత్తశుద్ధి ఎంతో తేటతెల్లం కానుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభు త్వం కేంద్రంతో గట్టిగా పోరాడకుండా దోబూచులాట మాటలు విశాఖ ఉక్కు పరిరక్షణకు ఏమాత్రం దోహదపడడం లేదని విశాఖ ఉక్కు ఉద్యోగులు కార్మికులు మండిపడుతున్నారు. ఇకనైనా చిత్త శుద్ధితో విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం వైసీపీ ప్రభుత్వం తమతో కలిసి పోరాటం చేసి కేంద్ర ప్రభుత్వంపై ఉద్యమించాలని విశాఖ ఉక్కు కార్మిక సంఘాల నేతలు కోరుతున్నారు.
ప్రజా గర్జనకు సర్వం సిద్ధం
30వ తేదీన నిర్వహించే ప్రజా గర్జన ప్రతిధ్వనించాలని విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ప్రతినిధులు పిలుపునిచ్చారు. ప్రజా గర్జన బహిరంగ సభకు సర్వసిద్ధం చేసినట్టు ప్రతినిధులు తెలిపారు. ఉక్కునగరం, త్రిష్ణా గ్రౌండ్స్‌లో సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు ‘‘ఉక్కు ప్రజా గర్జన’’ బహిరంగ సభ ప్రారంభమవుతుందని, స్టీల్‌ కార్మికులు, అధికారులు, నిర్వాసితులు కాంట్రాక్టు కార్మికులు, ప్రతిఒక్కరూ కుటుంబాలతో కదలాలని బాధ్యతతో, క్రమ శిక్షణతో ప్రజా గర్జనను విజయవంతం చేయడానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ప్రజలు పోరాడి సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రజా పోరాటాల ద్వారానే కాపాడుకుందామని, 32 మంది ప్రాణ త్యాగాలతో ఏర్పడ్డ ఉక్కును కేంద్ర ప్రభుత్వం అమ్ముతానంటే సహించేది లేదని గట్టి హెచ్చరికను ఈ గర్జన ద్వారా తెలియజేద్దామన్నారు. నిర్వాసితుల త్యాగాలకు ప్రతిఫలం అందాలని, మిగిలిన నిర్వాసితులకు శాశ్వత ఉపాధి కల్పించాలని, మిగులు భూములు నిర్వాసితులకు పంచాలని లేదా నష్టపరిహారం చెల్లించాలని గొంతెత్తి చాటుదామన్నారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రారంభమైన కార్మిక పోరాటం ప్రజా పోరాటంగా మారిందని అన్నారు. రాష్ట్రంలోని వివిధ రాజకీయ పార్టీల నేతలు, మేధావులు, ప్రముఖులు ఈ సభలో పాల్గొనేందుకు తరలి వస్తున్నారని చెప్పారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి వై.వి. సుబ్బారెడ్డి, గుడివాడ అమర్‌ నాథ్‌, తెలుగు దేశం పార్టీ నుంచి కె. అచ్చెన్నాయుడు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి. శ్రీనివాసరావు జనసేన పార్టీ నాయకులు నాదెండ్ల మనోహర్‌ కాంగ్రెస్‌ నాయకులు పి. రాకేష్‌ రెడ్డి తదితర్లు పాల్గొంటారని పోరాటకమిటి ప్రతినిధులు తెలిపారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img