Tuesday, December 5, 2023
Tuesday, December 5, 2023

విశ్వచోదకశక్తి భారత్‌

‘భారత్‌లో సంస్కరణలతోనే ప్రపంచం మార్పు
ఐక్యరాజ్యసమతిలో ప్రధాని మోదీ
కొందరికి రాజకీయ అస్త్రంగా ఉగ్రవాదం : పాక్‌పై విసుర్లు
కోవిడ్‌ వాక్సిన్‌ల తయారీకి ప్రపంచ దేశాలకు పిలుపు

న్యూయార్క్‌ : కొందరికి ఉగ్రవాదం అన్నది రాజకీయ అస్త్రంగా మారిందని దాయాది దేశాన్ని ఉద్దేశించి భారత ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు గుప్పించారు. అఫ్గాన్‌ గడ్డ ఉగ్రవాదానికి / తీవ్రవాదానికి అడ్డాగా మారకుండా చూసుకోవడం అత్యవసరమని అన్నారు. ఉగ్రవాద కార్యకలాపాలకు ఆ దేశం కేంద్రంగా మారకూడదన్నారు. ఏ దేశం కూడా స్వలాభం కోసం అఫ్గాన్‌లోని సున్నిత పరిస్థితిని ఆసరాగా చేసుకోకూడదన్నారు. ఈ పరిస్థితుల్లో అఫ్గాన్‌లోని మహిళలు, పిల్లలు, మైనారిటీలకు ఆపన్నహస్తాన్ని అందించడం మన కర్తవ్యమని మోదీ అన్నారు. శనివారం న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమతి జనరల్‌ అసెంబ్లీ 76వ సెషన్‌లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. భారత్‌ అభివృద్ధి చెందినప్పుడు ప్రపంచాభివృద్ధి జరుగుతుందని, భారత్‌లో సంస్కరణల నేపథ్యంలో ప్రపంచంలో మార్పులు సంభవిస్తాయని తెలిపారు. అభివృద్ధి, సంస్కరణలు విశ్వవ్యాపితమన్నారు. ఔత్సాహిక ప్రజాస్వామ్యానికి భారత్‌ మంచి ఉదాహరణ అని మోదీ అన్నారు. బలమైన ప్రజాస్వామ్యానికి మా దేశంలోని భిన్నత్వమే నిదర్శనమని ఆయన చెప్పారు. స్వచ్ఛమైన తాగునీటి సరఫరాలో భారత్‌ మైలురాయిని చేరుకుందని తెలిపారు. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మరింత వైవిధ్యభరితంగా ఉండాలని కోవిడ్‌`19 నేర్పిందని మోదీ వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అతిపెద్ద హరిత హైడ్రోజన్‌ హబ్‌గా భారత్‌ను నిలిపేందుకు కసరత్తు జరుగుతోందన్నారు. భావితరాలకు మనం జవాబుదారీగా ఉండాలని అన్నారు. నేడు ప్రపంచం అనేక సవాళ్లను ఎదుర్కొంటోందని, తీవ్రవాదం.. తిరోగమన ఆలోచనలు పెనుముప్పుగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ పరిస్థితుల దృష్ట్యా ప్రపంచం సైన్స్‌, హేతుబద్ధ, ప్రగతిశీల ఆలోచనల ఆధారిత అభివృద్ధిని ప్రోత్సహించాలన్నారు. శాస్త్రీయ దృక్పథాన్ని బలోపేతం చేసేందుకు అనుభవం ఆధారిత అభ్యాసాన్ని భారత్‌ ప్రోత్సహిస్తున్నట్లు మోదీ తెలిపారు. మోదీ అంతకు ముందు కోవిడ్‌ మృతులకు నివాళులర్పించారు. ‘వందేళ్లలో లేని పెనువిపత్తును ప్రపంచం ఒకటిన్నరేళ్లుగా ఎదుర్కొంటోంది. ప్రాణాంతక మహమ్మారికి బలైన వారికి నివాళులర్పిస్తున్నా. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతు న్నా’ అని అన్నారు. ప్రపంచవ్యాప్తంగా వాక్సిన్‌ తయారీదారులందరికీ భారత దేశంలో కోవిడ్‌ టీకాలు తయారు చేయమని మోదీ ఆహ్వానించారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత వైవిధ్యభరితంగా ఉండాలని, అందుకే గ్లోబల్‌ వాల్యూ చైన్‌ విస్తరణ ముఖ్యమన్నారు. ఉగ్రవాదాన్ని రాజకీయ అస్త్రంగా ఉపయోగిస్తున్న తిరోగమన ఆలోచనగల దేశాలు ఉగ్ర ముప్పు తమకూ అంతే స్థాయిలో ఉంటుందని గ్రహించాలన్నారు. మహాసము ద్రాలు అంతర్జాతీయ వాణిజ్యానికి జీవనాడి వంటివని, వాటిని కాపాడాలని, నియమాధారిత ప్రపంచ క్రమాన్ని బలోపేతం చేయడానికి అంతర్జాతీయ సమాజం ఒకే స్వరం వినిపించాలని మోదీ అన్నారు. అభివృద్ధి అనేది అన్నింటినీ కలుపుకొని, సార్వత్రికమైనది, అందరినీ పోషించేదని తెలిపారు. 75 సంవత్సరాల స్వాతంత్య్రం సందర్భంగా భారత విద్యార్థులు తయారు చేసిన 75 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపనున్నట్లు వెల్లడిరచారు. డజన్ల కొద్ది భాషలు, వందలాది మాండలికాలు, విభిన్న జీవనశైలి, వంటకాలు తదితరాలు ప్రజాస్వామ్యానికి ఉత్తమ ఉదాహరణలుగా మోదీ అన్నారు. కరోనా మహమ్మారి నుంచి కోలుకోవడానికి భారత్‌ ఎంతో కృషి చేసిందని, వైరస్‌ను అరికట్టేందుకు ఎన్నో చర్యలు తీసుకుందని తెలిపారు. కరోనా కాలంలో దశల వారీగా నిలదొక్కుకోగలిగినట్లు వెల్లడిరచారు. కాగా, ఐక్యరాజ్యసమితి జనరల్‌ అసెంబ్లీలో 109 మంది ప్రసంగీకులు ఉంటే మరో 60 మంది ముందే రికార్డు చేసిన వీడియో సందేశాలు ఇస్తారు. మహమ్మారి కారణంగా గతేడాది అనేక దేశాధినేతలు వీడియో సందేశాలకే పరిమితం కాగా ఈసారి చాలా మంది సమావేశాలకు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img