Friday, August 19, 2022
Friday, August 19, 2022

వీసీల ఇష్టారాజ్యం

నాలుగు వర్సిటీల్లో అవినీతి బ అడ్డగోలుగా పదోన్నతులు
రాయలసీమ వర్సిటీ వీసీ నియంతృత్వం
విద్యార్థుల జీవితాలతో చెలగాటం
నేడు విద్యార్థి, యువజన సంఘాల ఆందోళన

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి: ఏపీలో కొంతమంది విశ్వవిద్యాలయాల ఉపకులపతుల (వీసీ) అవినీతికి అంతేలేదు. గతంలో ఆంధ్ర విశ్వవిద్యాలయం వీసీ ప్రసాద్‌రెడ్డి నుంచి ఎస్వీయూ వీసీ రామకృష్ణారెడ్డి, ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వీసీ రాజశేఖర్‌ వరకూ అవినీతి ఆరోపణలు వెలుగుచూశాయి. తాజాగా రాయల సీమ వీసీ ఆనందరావు అక్రమాల ఉదంతం వెలుగుచూస్తోంది. ఆ వీసీలపై చర్యలు తీసుకోవాలంటూ గవర్నరు కార్యాలయానికి ఫిర్యాదులు వెళ్లాయి. వారిపై ఇంతవరకూ సమగ్ర విచారణ జరగలేదు. చాలా విశ్వవిద్యాలయాలకు వైసీపీ ప్రభుత్వం ఉపకులపతులను నియమించింది. బాధ్యతలు చేపట్టిన వెంటనే వీసీలు తమకు అనుకూలమైన రిజిస్ట్రార్లు, రెక్టార్లను నియమించుకున్నారు. వారు ఇష్టానుసారం కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కొంతమంది వీసీలు విశ్వవిద్యాలయాల అభివృద్ధికీ, విద్యాప్రమాణాలు పెంచడానికి కనీస చర్యలు తీసుకోవడం లేదు. సొంత అజెండాతో ముందుకుపోతున్నారు. వీసీల అక్రమాలను ప్రశ్నించిన విద్యార్థులపై కేసులు బనాయిస్తున్నారు. దీంతో విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోంది. ఆయా విశ్వవిద్యాలయాల డిగ్రీ ఫలితాల్లో అవకతవకలు జరుగుతున్నాయి. యూజీసీ నిధులను వీసీలు దుర్వినియోగం చేస్తున్నారు. ఆంధ్రా విశ్వవిద్యాల యంలో 18 ప్రాచీన కోర్సుల తొలగింపునకు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం, ఆచార్యుల పదోన్నతుల్లో అక్రమాలకు పాల్పడటంపై విద్యార్థులు మండిపడుతున్నారు. వీసీ అక్రమాలపై గతంలో చలో ఆంధ్రా విశ్వవిద్యాలయం కార్యక్రమం నిర్వహించారు. ఏయూ, ఏఎన్‌యూల్లో దూరవిద్యా కోర్సుల నిర్వహణలోనూ అవినీతి రాజ్యమేలుతోందని విద్యార్థి సంఘాలు విమర్శిస్తున్నాయి. మార్కులు వేయడంలోనూ ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. విద్యావ్యవస్థకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని జగన్‌ ప్రభుత్వం ప్రచారం చేస్తున్నప్పటికీ, ఆరోపణలు ఎదుర్కొంటున్న వీసీలపై దృష్టిపెట్టలేదు. వీసీల వ్యవహారాన్ని గవర్నరు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ వారి తొలగింపునకు ప్రతిపాదించలేదు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని విద్యార్థి, యువజన సంఘాలు తప్పుపడుతున్నాయి.
రాయలసీమ వర్సిటీ అక్రమాల చిట్ట
రాయలసీమ విశ్వవిద్యాలయంలో భారీగా అక్రమాలు చోటుచేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. కరోనా సమయంలో కొంతమంది విద్యార్థులను రెండో సెమిస్టర్‌కు అనుమతించలేదు. పూర్తి హాజరు శాతం ఉన్నప్పటికీ మూడో సెమిస్టర్‌కు సైతం విద్యార్థులను అనుమతించలేదు. దీంతో 153మంది విద్యార్థులు విద్యా సంవత్సరం పూర్తిగా కోల్పోయారు. దీనిపై ప్రశ్నించిన విద్యార్థులపై అక్రమ కేసులు బనాయించారు. ప్రభుత్వానికి తప్పుడు సమాచారం ఇస్తూ ఆయన పదవిలో కొనసాగుతున్నారు. విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తున్నారు. కాంట్రాక్టర్ల దగ్గర కమీషన్ల కోసం అవసరం లేకపోయినా నూతన నిర్మాణాలకు దిగుతున్నారు.
నేడు విజయవాడ ధర్నాచౌక్‌లో నిరసన: విద్యార్థి, యువజన సంఘాలు
అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్న రాయలసీమ వీసీ ఆనందరావును తొలగించాలని డిమాండు చేస్తూ విద్యార్థి, యువజన సంఘాలు శనివారం విజయవాడ ధర్నాచౌక్‌లో నిరసనకు దిగనున్నాయి. ఏఐఎస్‌ఎఫ్‌, ఏఐవైఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, పీడీఎస్‌యూ నేతలు జాన్సన్‌బాబు, శివారెడ్డి, పరుచూరి రాజేంద్ర, సోమేశ్వరరావు, గనిరాజు తదితరులు నాయకత్వం వహిస్తారు. రాయలసీమ విశ్వవిద్యాలయంలో నిర్మాణం పూర్తయిన నూతన భవనాలను ప్రారంభించకుండా వీసీ జాప్యం చేస్తున్నారని, పరీక్ష విభాగంలో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ చేపట్టాలని, విద్యార్థుల పట్ల వీధిరౌడీల్లా వ్యవహరిస్తున్న బీఎంఎస్‌ భద్రతా ఏజెన్సీని రద్దు చేయాలని డిమాండు నాయకులు చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img