Thursday, November 30, 2023
Thursday, November 30, 2023

వృత్తి విద్యల్లో నైపుణ్యం అవశ్యం

ప్రతి అసెంబ్లీకి ఐటీఐ, పార్లమెంటుకు స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీ
తిరుపతిలో స్కిల్‌, విశాఖలో హైఎండ్‌ స్కిల్‌ యూనివర్సిటీలు
కోడిరగ్‌, లాంగ్వేజెస్‌, రోబోటిక్స్‌, ఐఓటీల్లో పరిజ్ఞానం పెంపు
75శాతం ఉద్యోగాలు స్థానికులకే ముఖ్యమంత్రి జగన్‌ స్పష్టీకరణ

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి :
యువతకు ఉపాధి అవకాశాల పెంపుతోపాటు రాష్ట్ర అభివృద్ధికి దోహద పడేలా వృత్తి విద్యాకోర్సుల్లో నైపుణ్యత పెంపునకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి జగన్‌మోహ న్‌రెడ్డి ఆదేశించారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కాలేజీలు, పాలిటెక్నిక్‌లు, ఐటీఐలపై క్యాంప్‌ కార్యాలయంలో సోమవారం సీఎం జగన్‌ సమీక్షించారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ అసెంబ్లీ నియోజకవర్గస్థాయిలో నైపుణ్యాలను అభివృద్ధిచేయడానికి ఒక పారిశ్రామిక శిక్షణా సంస్థ (ఐటీఐ) ఏర్పాటు అవశ్యమన్నారు. ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో నైపుణ్యాభివృద్ధి కోసం ఒక కాలేజీని పెట్టబోతున్నామని, తిరుపతిలో స్కిల్‌ యూనివర్సిటీ, విశాఖపట్నంలో హైఎండ్‌ స్కిల్‌ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నామన్నారు. నైపుణ్యాభివృద్ధి కాలేజీల్లో పాఠ్యాంశాల రూపకల్పన, పాఠ్యప్రణాళిక అనేది తిరుపతి, విశాఖ స్కిల్‌ యూనివర్సిటీలు రూపొందిస్తాయన్నారు. కోడిరగ్‌, లాంగ్వేజెస్‌, రోబోటిక్స్‌, ఐఓటీ లాంటి అంశాల్లో పరిజ్ఞానాన్ని పెంచేలా నైపుణ్యాభివృద్ధి కాలేజీల్లో బోధన, శిక్షణ ఉంటుందని సీఎం వివరించారు. ఇప్పటికే గ్రామాల్లో ఇంటర్నెట్‌ సదుపాయం కల్పించడం ద్వారా వర్క్‌ఫ్రం హోం కాన్సెప్ట్‌ను బలోపేతం చేస్తున్నామని, దీనికితోడు పార్లమెంటు నియోజకవర్గాల్లో ఏర్పాటు చేస్తున్న స్కిల్‌డెవలప్‌మెంట్‌ కాలేజీల వల్ల, వీటికి వర్క్‌ఫ్రం హోంకు మధ్య సినర్జీ ఏర్పడుతుందన్నారు. ఫలితంగా మెరుగైన ఉపాధి అవకాశాలు, మంచి జీతాలు లభిస్తాయని సీఎం చెప్పారు. స్కిల్‌ యూనివర్సిటీ నిర్మాణ పనులను వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు ఉద్దేశించిన కోర్సుల రూపకల్పన విప్లవాత్మకంగా ఉండాలని, తరగతి గదుల నిర్మాణం వినూత్నంగా ఉండాలని సీఎం స్పష్టం చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల ప్రమాణాలపై సర్టిఫికెేషన్‌ చేయించాలని సూచించారు. ఐటీఐలను ప్రస్తుత అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దాలని, పాఠ్యాంశాలను అప్‌గ్రేడ్‌ చేయాలన్నారు. ప్రతి ఐటీఐలోనూ నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కనస్ట్రక్షన్‌ లాంటి సంస్థలను భాగస్వాములుగా చేస్తే నైపుణ్యాలు మెరుగుపడతాయన్నారు. టెన్త్‌లోపు డ్రాప్‌ అవుట్‌ అయిన యువకులకు నైపుణ్యం పెంపొందించడం, అభివృద్ధి చేయడంపై దృష్టిపెట్టాలన్నారు. కొత్తగా వచ్చే పరిశ్రమలకు మన వద్ద స్కిల్‌ డెవలప్‌మెంట్‌ ట్రైనింగ్‌ పొందిన వారి డేటాను పంపించి, 75శాతం ఉద్యోగాలు స్థానికులకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. సమీక్షా సమావేశానికి ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌, పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, ఐటీ, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్స్‌ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి, రవాణాశాఖ ముఖ్యకార్యదర్శి ఎంటీ కృష్ణబాబు, ఆర్థికశాఖ కార్యదర్శి ఎన్‌ గుల్జార్‌, టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ కమిషనర్‌ పోలా భాస్కర్‌, ఎంప్లాయిమెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ డైరెక్టర్‌ లావణ్య, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ట్రైనింగ్‌ ప్రభుత్వ సలహాదారు చల్లా మధుసూదన్‌రెడ్డి, ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ కె అజయ్‌రెడ్డి, ఏపీ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీ ఎన్‌ బంగార్రాజు తదితరులు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img