Tuesday, December 5, 2023
Tuesday, December 5, 2023

వైసీపీది అరాచక పాలన

వచ్చే ఎన్నికల్లో 15 సీట్లకే పరిమితం
ఎవడబ్బ సొమ్మని పథకాలకు మీ పేర్లు
కోడికత్తి, వివేకా కేసులు ఏమయ్యాయి ?
జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ధ్వజం

విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : వైసీపీ ప్రభుత్వంలో అరాచకం తారస్థాయికి చేరిందని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 15 సీట్లకు పరిమితం కావడం ఖాయమని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హెచ్చరించారు. యుద్ధం ఖాయమని, అయితే ఏ స్థాయిలో…ఎలా కావాలో వైసీపీ నేతలు కోరుకోవచ్చని, మీరో మేమో తేల్చుకుందాం రండి అంటూ సవాల్‌ విసిరారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో బుధవారం జరిగిన జనసేన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో పవన్‌ కల్యాణ్‌ రాష్ట్ర ప్రభుత్వతీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైసీపీ వ్యక్తులకి డబ్బు, అధికారం, అహంకారం పుష్కలంగా ఉన్నాయని, వారికి లేనిదల్లా భయం ఒక్కటేనన్నారు. ఆ భయం అంటే ఎలా ఉంటుందో నేర్పిస్తానని హెచ్చరించారు. అనాల్సినవన్నీ అనేసి కులాల చాటున దాక్కుంటే లాక్కొచ్చి కొడతా, కుదరకపోతే భారతీయ శిక్షాస్మృతి ప్రకారం శిక్ష పడేలా చేస్తామన్నారు. మీ సొంత చిన్నాయన వివేకానందరెడ్డిని ఎవరు చంపారు? కోడికత్తి కేసు ఏమైంది ? ఆ రోజున అరిచి గోల చేశారు. దీనిపై ప్రజలకు ఏం సమాధానం చెపుతారని ఆయన నిలదీశారు. సినిమా టికెట్లు అమ్మడం గురించి అడిగితే ఉలుకెందుకని ప్రశ్నించారు. నాకేమైనా థియేటర్లు ఉన్నాయా సన్నాసుల్లారా? అంటూ వైసీపీ నేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లికి బిచ్చం వేయరు… ఎంగిలి చేత్తో కాకిని కొట్టని మీరా నన్ను విమర్శించేది అంటూ పవన్‌ మండిపడ్డారు. ఒట్టి గొడ్డుకు అరుపు లెక్కువ..వానలేని మబ్బుకు ఉరుములెక్కువ అన్నట్లు వైసీపీ నాయకులు అరుస్తున్నారు. ఏ రోజైనా ప్రజా సమస్యలపై దృష్టిపెట్టారా? ఈ రోజుకి పాడైనా ఒక్క రోడ్డైనా మరమ్మతు చేశారా? ఏటా రాష్ట్రానికి వచ్చే ఆదాయం లక్ష కోట్ల పైమాటే. ఇవి ఏం చేస్తున్నారు. జీతాలు సరైన సమయానికి ఇవ్వరు. పెన్షన్లు సమయానికి ఇవ్వరు. దీని గురించి ప్రశ్నిస్తే వ్యక్తిగతంగా తిడతారు. ప్రతి పథకానికి మీ సొంత పేర్లు ఏమిటి? ఇవన్నీ ఎవడబ్బ సొమ్ము. అదేమైనా మీరు చమటోడ్చి సంపాదించిన డబ్బా. అదంతా ప్రజల సొమ్ము. వైసీపీకి ఓటేసిన వారికే పథకాలిస్తా మంటే చూస్తూ ఊరుకోమని పవన్‌ హెచ్చరించారు. సమావేశంలో జనసేన రాష్ట్ర నాయకులు నాదెండ్ల మనోహర్‌ తదితరులు ప్రసంగించారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img