Thursday, March 23, 2023
Thursday, March 23, 2023

వైసీపీ అక్రమాలు

. ఉద్యోగుల ఓట్లడిగే అర్హత జగన్‌కు ఉందా ?
. హామీలు నెరవేర్చని కల్పలతారెడ్డి రాజీనామా చేయాలి
. పీడీఎఫ్‌, మద్దతుదారులను గెలిపించండి
. రామకృష్ణ, శ్రీనివాసరావు

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ శాసనమండలి ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ డబ్బు, అధికారబలం, దౌర్జన్యంతో గెలుపే లక్ష్యంగా ముందుకెళుతోందని సీపీఐ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శులు కె.రామకృష్ణ, వి.శ్రీనివాసరావు ధ్వజమెత్తారు. విజ్ఞతగల ఉపాధ్యాయ, పట్టభద్రుల ఓటర్లు వైసీపీ అభ్యర్థులను ఓడిరచాలని, నిత్యం ప్రజా సమస్యల కోసం తపించే పీడీఎఫ్‌, మద్దతుదారు అభ్యర్థులను గెలిపించాలని కోరారు. విజయవాడ బాలోత్సవమ్‌ భవన్‌లో మంగళవారం రామకృష్ణ, శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రామకృష్ణ మాట్లాడుతూ ఇంతకుముందు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయుల పాత్ర మాత్రమే ఉండేదని, గత ముఖ్యమంత్రులు సైతం ఈ ఎన్నికల్లో జోక్యం చేసుకోకుండా హుందాంగా వ్యవహరించేవారని గుర్తుచేశారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక అన్ని వ్యవస్థల్ని ఆక్రమించుకుంటున్నారని, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ అభ్యర్థులను భయపెట్టి ఏకగ్రీవాలు చేసుకున్నారని, ఆ తర్వాత బెదిరింపులతో మిగిలిన స్థానాల్లోనూ తన పార్టీ అభ్యర్థుల్ని గెలిపించుకున్నారని మండిపడ్డారు. ఇప్పుడు అత్యాశతో ఉపాధ్యాయ, పట్టభద్రుల ఎన్నికల్లోనూ సీఎం చొరబడటాన్ని తప్పుపట్టారు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికల్లో పోటీ చేయడం పద్ధతని, దానికి విరుద్ధంగా వైసీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా జగన్‌ వ్యవహరిస్తున్న తీరును తూర్పారబట్టారు. జగన్‌కు ఎలాగూ పట్టభద్రుల ఓటు లేదని, సీట్లు మాత్రం కావాలా అని ఎద్దేవా చేశారు. తిరుపతిలో ఒకే ఇంటి నంబరుతో 14 ఓట్లున్నాయని, ఇదంతా అధికారులకు తెలియదా… లేక నిద్ర నటిస్తున్నారా అని నిలదీశారు. ఈ ఎన్నికలనూ జగన్‌ డబ్బుమయం చేశారని, సారా, ఇసుక వ్యాపారంలో జగన్‌ కోట్లాది రూపాయలు దోచుకుంటున్నారని, ఆ డబ్బుతో గెలవాలని చూస్తున్నారన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు పట్టభద్రుల ఓటుకు రూ.2వేలు, ఉపాధ్యాయుల ఓటుకు రూ.5వేలు ఇస్తున్నారని ఆరోపించారు. బాధ్యతగా మెలగాల్సిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ ఎన్నికలపై పూర్తి దృష్టి పెట్టారని, అధికార దాహంతో అడ్డదారుల్లో గెలవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాల ఎన్నికలలో సీఎం జగన్‌ జోక్యం ఎందుకని నిలదీశారు. శాసనమండలిలో పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు నిత్యం ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తారనే భయంతోనే జగన్‌ దిగజారి ప్రవర్తిస్తున్నారన్నారు. పాఠశాల విద్య ఆర్జేడీ ప్రతాప్‌రెడ్డి ద్వారా ఉపాధ్యాయులకు పార్టీలు ఇస్తూ…ప్రలోభాలకు గురిచేస్తున్నారన్నారు. ఆంధ్రా విశ్వవిద్యాలయ వీసీ ప్రసాద్‌రెడ్డి కూడా విశాఖలో బరితెగించి వ్యవహరిస్తూ, వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి పూర్తిగా కొమ్ముకాస్తున్నారన్నారు. వైసీపీ నేత వైవీ సుబ్బారెడ్డి పక్కన కూర్చుని వీసీ రాజకీయ ఉపన్యాసం ఇస్తారా?, ఇది సిగ్గుమాలిన చర్యకాదా? అని ప్రశ్నించారు. ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించలేని వైసీపీకి…ఓట్లడిగే అర్హత ఎక్కడిదని నిలదీశారు. ఈనెల 9, 10 తేదీల్లో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు చేపట్టిన కార్యాచరణకు సీపీఐ, సీపీఎం సంపూర్ణ సంఫీుభావం ప్రకటించినట్లు తెలిపారు.
శ్రీనివాసరావు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం కోసం వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, చాలాసార్లు వైసీపీ ప్రభుత్వం, అధికారుల విధానాలపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా…ఆ పార్టీ నేతల్లో మార్పురాలేదన్నారు. బోగస్‌ ప్రచారంతో అందర్నీ వైసీపీ మోసగిస్తోందని, ఉద్యోగులు, నిరుద్యోగులు, యువతకి ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, ఏడాదికో జంబో డీఎస్సీ హామీ నిలబెట్టుకోలేక పోయారన్నారు. సీపీఎస్‌, పీఆర్సీ విషయంలో పూర్తిగా దగా చేశారని, కాంట్రాక్టు ఉపాధ్యాయ, ఉద్యోగులను క్రమబద్ధీకరించలేదని ఆరోపించారు. నాడు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో వైసీపీ ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి చాలా హామీలు ఇచ్చారని గుర్తుచేశారు. ఆర్నెళ్లలోగా యూనిఫైడ్‌ సర్వీస్‌ రూల్స్‌ సాధించలేకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారన్నారు. ఎమ్మెల్సీగా నెగ్గిన ఈ రెండేళ్లల్లో ఆమె ఒక్క హామీనీ అమలు చేయలేదన్నారు. ఆర్నెళ్లలోగా అందరికీ ఒకే విధానం తీసుకొస్తానని, లేకపోతే తన పదవికి రాజీనామా చేస్తానని ఆమె ప్రకటించారని, మాట తప్పిన కల్పలతారెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి శ్యామ్‌ సుందర్‌రెడ్డి ఎన్నికల అఫిడవిట్‌లో కేసులపై తప్పుడు సమాచారం ఇచ్చారన్నారు. జగన్‌ ప్రభుత్వం ఉపాధ్యాయులపై వేధింపులకు పాల్పడుతోందని, బైజ్యూస్‌కు సేవ చేయకపోతే ప్రవీణ్‌ ప్రకాశ్‌ రంగంలోకి వచ్చేస్తారని, యాప్‌లు అప్‌లోడ్‌ చేయకుంటే చర్యలా అని నిలదీశారు. పెన్షన్లు రాక వారంతా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారని, రూ.3వేల కోట్ల ఈపీఎఫ్‌ వాడుకున్నారని, ఉద్యోగులకు ఒకటో తేదీన వేతనాలు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉందన్నారు.
ఉద్యోగులను, వలంటీర్లను ఎన్నికల కోసం వాడుకుంటున్నారని, ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు తీవ్ర ప్రమాదమని ఆందోళన వ్యక్తం చేశారు. అందరూ ఆలోచించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీ బలపరిచిన అభ్యర్థులను ఓడిరచాలని పిలుపునిచ్చారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img