. పార్టీలో రాజుకుంటున్న అసంతృప్తి జ్వాలలు
. మొన్న ఆనం.. నిన్న కోటంరెడ్డి.. నేడు నెల్లూరు మేయర్
. మిగిలిన జిల్లాల్లోనూ నివురుగప్పిన నిప్పులా పరిస్థితి
. హైకోర్టు అక్షింతలు, దిగజారుతున్న ఆర్థిక వ్యవస్థ
. ప్రతిపక్షాలు, ఉద్యోగ సంఘాల ఆందోళనలు ఉధృతం
విశాలాంధ్ర బ్యూరో` అమరావతి : రాష్ట్రంలో అధికారపార్టీని ఒక్కసారిగా అనేక సమస్యలు చుట్టుముట్టడంతో అధిష్ఠానం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. పార్టీలో అసంతృప్తి జ్వాలలు రోజురోజుకూ రాజుకుంటున్నాయి. దీనికితోడు ఆర్థిక పరిస్థితి అంతకంతకూ దిగజారుతోంది. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై ప్రతిపక్ష పార్టీలు, ఉద్యోగ, కార్మిక, ప్రజా సంఘాల ఉద్యమాలు ఊపందుకుంటున్నాయి. అలాగే హైకోర్టు రోజూ ఏదో ఒక అంశంపై ప్రభుత్వ తీరును విమర్శిస్తూ అక్షింతలు వేస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ అధిష్ఠానం వీటన్నింటినీ చక్కదిద్దలేని పరిస్థితుల్లో సహనం కోల్పోతోంది. పాలన పూర్తిగా గాడి తప్పుతోంది. దాదాపు అన్ని జిల్లాల్లో అధికారపార్టీ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొన్నప్పటికీ, నెల్లూరు జిల్లాలో మాత్రం భగ్గుమంది. ఇప్పటికే సీనియర్ నేత ఆనం రాంనారాయణ రెడ్డి బహిరంగంగా ప్రభుత్వంపై విమర్శలు చేయడం, వైసీపీ అధిష్ఠానం వెంటనే ఆయన ప్రాతినిధ్యం వహించే నియోజకవర్గానికి మరో నేతను ఇన్‌చార్జిగా నియమించడం జరగ్గా, కొద్దికాలంగా అసంతృప్తితో రగిలిపోతున్న నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి కూడా ఆనం బాట పట్టారు. ఆయనైతే నేరుగా తన ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని ప్రభుత్వ పెద్దలపై ఆరోపణలు గుప్పించారు. నేరుగా ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేరు ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. ఇందుకు పర్యవసానంగా కోటంరెడ్డిపై కిడ్నాప్ కేసు నమోదు చేయడంతోపాటు తనను చంపుతామని బెదిరించారని, దానికితగ్గ ఆధారాలను కోటంరెడ్డి బయట పెట్టారు. ప్రభుత్వానికి ఎదురుతిరిగితే ఎలా ఉంటుందో తెలియజేయడానికి వైసీపీ అధిష్ఠానం చేసిన ఈ ప్రయత్నాన్ని లెక్కచేయకుండా, నెల్లూరు నగర మేయర్ పొట్లూరి స్రవంతి తన మద్దతును కోటంరెడ్డికి బహిరంగంగా ప్రకటించారు. కోటంరెడ్డి మా ఊపిరి, ఆయనతోనే మా ప్రయాణమని తేల్చిచెప్పారు. ఆయన కోసం అవసరమైతే మేయర్ పదవికి రాజీనామా చేయడానికి కూడా సిద్ధమని, ఆయనతోనే మా రాజకీయ ప్రయాణమని స్పష్టం చేశారు. ఈ వరుస పరిణామాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ప్రతి జిల్లాలోనూ అసంతృప్తి నివురుగప్పిన నిప్పులా ఉందని, నెల్లూరు జిల్లా తరహాలో ఏ రోజైనా భగ్గుమనే అవకాశం ఉందని వైసీపీ నేతల్లోనే చర్చ సాగుతోంది. పార్టీలో అధికారం పూర్తిగా కేంద్రీకృతం కావడం, రాష్ట్రంలోని మూడు ప్రాంతాలను ముగ్గురు నేతలకు అప్పగించి సామంతరాజుల్లా వారికి అధికారం అప్పగించడం వైసీపీ ప్రజాప్రతినిధుకు కంటగింపుగా మారింది. అన్ని కులాలకు ప్రాతినిధ్యం ఇస్తున్నట్లు ప్రచారం చేసుకుంటూ, కీలక నిర్ణయాల్లో ఉప ముఖ్యమంత్రులు, మంత్రులకు సైతం ప్రాధాన్యత ఇవ్వకపోవడాన్ని పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. మరోపక్క ప్రతిపక్షపార్టీల ఉద్యమాలు, ఉద్యోగ, కార్మిక, ప్రజాసంఘాల ఆందోళనలు ఊపందుకోవడం, వీటికితోడు హైకోర్టు సైతం ప్రభుత్వ విధానాలను తరచూ తప్పు పడుతూ అక్షింతలు వేస్తుండడం వంటి పరిణామాలు అధికారపార్టీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. మూడు రాజధానుల బిల్లు దగ్గర నుంచి ఇటీవల మానవ హక్కులను కాలరాసే విధంగా తీసుకొచ్చిన జీవో ఒకటిని కోర్టులు తప్పు పట్టిన విషయం తెల్సిందే. ఇలా అనేక ప్రభుత్వ విధానాలను హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు తూర్పారబట్టాయి. ప్రభుత్వ ఉద్యోగుల్లోనూ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. బహిరంగంగానే ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారు. ఇటీవల ఏకంగా గవర్నర్‌ను కల్సి తమకు జీతాలు సక్రమంగా ఇచ్చేలా చూడాలని వినతిపత్రం ఇవ్వడం ప్రభుత్వంపై ఉద్యోగులకున్న వ్యతిరేకతకు పరాకాష్ఠగా పేర్కొనవచ్చు. ఇక తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేశ్ ప్రస్తుతం పాదయాత్ర చేస్తూ ప్రభుత్వ పాలనా తీరుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతూ ప్రజలను చైతన్యవంతులను చేస్తుండగా, జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వారాహి పేరుతో బస్సుయాత్రకు సిద్ధపడుతున్నారు. వీటిని అడ్డుకోవడానికి తెచ్చిన జీవో ఒకటిపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ హైకోర్టును ఆశ్రయించగా, అమలును న్యాయస్థానం నిలిపివేసింది. ఈ సమస్యలన్నింటికీ మించి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ పతనమవుతోంది. కొత్తగా అప్పులు పుట్టడం లేదు. దీంతో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు జీతాలు ఒకటవ తేదీన చెల్లించలేని దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పరిస్థితుల్లో రాబోయే రోజులు తమకు గడ్డుకాలమేనని అధికారపార్టీ నేతలే ఆందోళనకు గురికావడం గమనార్హం.