Monday, March 27, 2023
Monday, March 27, 2023

వైసీపీ ఎమ్మెల్యేల్లో ఫోన్‌ ట్యాపింగ్‌ కలవరం

. కోటంరెడ్డి వ్యాఖ్యలతో అప్రమత్తం
. తాడేపల్లికి నెల్లూరు పంచాయితీ
. సీఎంతో బాలినేని భేటీ
. మరో ఎమ్మెల్యే చంద్రశేఖర్‌రెడ్డి అసంతృప్తి

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : తనతోపాటు చాలామంది ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాపింగ్‌ అవుతున్నాయంటూ నెల్లూరు రూరల్‌ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధరరెడ్డి చేసిన వ్యాఖ్యలు అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో కలవరం రేపుతోంది. శ్రీధర్‌రెడ్డి వ్యాఖ్యలతో ఇతర ఎమ్మెల్యేలు అప్రమత్తమయ్యారు. వైసీపీ ఎమ్మెల్యేల్లో చాలామంది ఇప్పటికే అధిష్ఠానంపై అసంతృప్తిగా ఉన్నారు. తన ఫోన్లు ట్యాప్‌ చేసినందుకే కలత చెంది వైసీపీ వీడుతున్నట్లు కోటంరెడ్డి ప్రకటించారు. నెల్లూరు తాజా పరిణామాలపై పార్టీ ప్రాంతీయ సమన్వయకర్త, మాజీమంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి సీఎం జగన్‌తో తాడేపల్లిలో బుధవారం భేటీ అయ్యారు. కోటంరెడ్డి స్థానంలో మరొకరిని నియోజకవర్గ సమన్వయకర్తగా నియమించే అంశంపై సీఎంతో చర్చించారు. ఇప్పటికే బాలినేని నెల్లూరు నేతలతో వేర్వేరుగా చర్చలు జరిపిన విషయం విదితమే. సీఎంకు బాలినేని నెల్లూరుకు సంబంధించి తాజా పరిణామాలు వివరించారు. మరోవైపు, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి కూడా ప్రభుత్వంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తన నియోజకవర్గ పరిశీలకుడు ధనుంజయరెడ్డి వ్యవహారశైలి బాగోలేదని, తనపైనే పెత్తనం చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన వల్ల పార్టీకి తీరని నష్టం వాటిల్లుతోందని, దీనిపై సీఎం వద్ద తేల్చుకుంటానని మీడియా ముందు వ్యాఖ్యానించారు. నెల్లూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వైసీపీని వీడటానికి సిద్ధంగా ఉన్నారు. ఇదే సమంయంలో మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి ప్రభుత్వంపై అసంతృప్తి వెళ్లగక్కడం వైసీపీలో అలజడి మొదలైంది. మేకపాటి వ్యాఖ్యలపై పార్టీ అధినేతలు ఆరా తీస్తున్నారు.
అది రికార్డింగ్‌: సజ్జల
ఎమ్మెల్యేల ఫోన్ల ట్యాపింగ్‌ చేయాల్సిన అవసరం పార్టీకిగానీ, ప్రభుత్వానికిగానీ లేదని, శ్రీధరరెడ్డి చెబుతున్నది ట్యాపింగ్‌ కాదనీ, అది రికార్డింగ్‌ అని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. అడ్డదారుల్లో పోవడం సీఎంకు తెలియదన్నారు. ఫోన్లో మాట్లాడేటప్పుడు…దానిని ఆడియో రికార్డు చేస్తే దానిని ట్యాపింగ్‌ అంటున్నారని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి పరుష వ్యాఖ్యలను ఎవరో రికార్డు చేసి ఉండవచ్చని, అలాంటి మాటల రికార్డింగ్‌ బయటకు వస్తే దాని గురించి ఇంటిలిజెన్స్‌ చీఫ్‌ జాగ్రత్తగా ఉండాలంటూ ఆయనకు సూచించి ఉండవచ్చని తెలిపారు. 2024లో టీడీపీ నుంచి కోటంరెడ్డి పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు కన్పిస్తోందని, వైసీపీ నుంచి అక్కడ నిలిపేందుకు కొత్త అభ్యర్థిని పార్టీ చూస్తోందని పేర్కొన్నారు.
సానుభూతి కోసమే ఇదంతా: పేర్ని నాని
పార్టీ వీడేటప్పుడు ఎలాంటి సాకు లేక సానుభూతి పొందాలనే ప్రయత్నంలో భాగంగానే ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి ఫోన్‌ ట్యాపింగ్‌ అంశాన్ని తెరపైకి తెచ్చారని, ప్రభుత్వంపై బురద చల్లారని మాజీమంత్రి, ఎమ్మెల్యే పేర్ని వెంకట్రామయ్య(నాని) ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘నా ఫోన్లు ట్యాప్‌ చేస్తే నేను వెళ్లిపోతానా’ అని ప్రశ్నించారు. ఆరుసార్లు, నాలుగుసార్లు ఎమ్మెల్యేలు అయిన వారికే మంత్రి పదవులు ఇవ్వలేదన్నారు. గతంలో ట్యాపింగ్‌ సాఫ్ట్‌వేర్‌ కొనలేదంటూ టీడీపీ వాళ్లే చెప్పారని, తమ ప్రభుత్వమూ ఆ సాఫ్ట్‌వేర్‌ కొనలేదని స్పష్టం చేశారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img