Tuesday, May 30, 2023
Tuesday, May 30, 2023

వ్యక్తిగత లబ్ధి కాదు… సంస్థలు నిర్మించండి

. భోజనం చేయడానికి న్యాయవాదులు ఇబ్బంది పడుతున్నారు
. కనీస మౌలిక వసతులు కల్పించండి
. ఆర్‌-5 జోన్‌పై హైకోర్టు ఘాటు వ్యాఖ్యలు
. తీర్పు రిజర్వ్‌ చేసిన ధర్మాసనం

విశాలాంధ్ర బ్యూరోఅమరావతి: రాజధానిలోని ఆర్‌-5 జోన్‌పై తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. ఆర్‌-5 జోన్‌లో ఇతర ప్రాంత పేదలకు పట్టాలు ఇవ్వడానికి జగన్‌ ప్రభుత్వం ప్రయత్నించగా దీనిపై రైతులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై శుక్రవారం హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. చివరికి తీర్పును హైకోర్టు రిజర్వు చేసింది. ఆర్‌5 జోన్‌లో 45 వేల మంది ఇతర ప్రాంత పేదలకు పట్టాలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేసిన విషయం తెల్సిందే. గతంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుకు ఈ ఉత్తర్వులు వ్యతిరేకంగా ఉన్నాయంటూ అమరావతి రైతులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రభుత్వ జీవోను హైకోర్టులో సవాల్‌ చేస్తూ రాజధాని రైతులు పిటిషన్‌ వేశారు. రైతుల తరపున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు వాదనలు వినిపించారు. మధ్యంతర ఉత్తర్వుల కోసం రెండు పక్షాలు వాదనలు వినిపించాయి. ఆర్‌-5 జోన్‌ ఏర్పాటుపై హైకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకే ఆర్‌-5 జోన్‌ ఏర్పాటు చేసినట్లు ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపించగా… ముందు ఇక్కడ పనిచేసే న్యాయవాదులకు లాంజ్‌లు లేదు. లంచ్‌ చేసేందుకు అవకాశం లేదు. కనీసం మౌలిక వసతులు కూడా కల్పించలేదని ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. వ్యక్తులకు లాభం కలిగించడం కాదు…సంస్థలను నిర్మించండి అంటూ ఘాటుగా వ్యాఖ్యానించింది. ఇప్పటికే హైకోర్టుకు సరైన రోడ్డు లేదు… సాయంత్రం లైట్లు కూడా వెలగడం లేదని రైతుల తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. కోర్టు ఆదేశించినా చర్యలు చేపట్టలేదని గుర్తుచేశారు. దీనిపై కోర్టు ధిక్కార పిటిషన్‌ వేసినట్లు న్యాయవాదులు జ్ఞాపకం చేశారు. సీఆర్‌డీఏ కమిషనర్‌ను కోర్టు ముందు హాజరు కావాలని ఆదేశాలు ఇచ్చినట్లు న్యాయవాది గుర్తుచేశారు. పిటిషనర్లతో పాటు ప్రభుత్వం తరపు వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది.
ఆర్‌5జోన్‌ ఏర్పాటుపై గత ఏడాది అక్టోబరులో ప్రభుత్వం జీవో విడుదల చేసింది. స్థానికంగా పేదల కోసం నిర్మించిన ఇళ్లను ఇవ్వకుండా ఇతర ప్రాంతాల వారికి పేదల పేరుతో రాజధాని నిర్మాణం కోసం ఇచ్చిన భూములు ఇవ్వడం సరికాదని, రాజధాని రైతులు ప్రభుత్వ జీవోను వ్యతిరేకిస్తూ కోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు గ్రామసభలు నిర్వహించి ప్రజల అభిప్రాయం తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించింది. ఆ మేరకు గ్రామసభలు నిర్వహించగా, ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రజలు మూకుమ్మడిగా వ్యతిరేకించారు. అయినప్పటికీ రైతుల అభిప్రాయాన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం ఆర్‌5జోన్‌ ఏర్పాటుపై గెజిట్‌ విడుదల చేసింది. దీంతో రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు.
జంగిల్‌ క్లియరెన్స్‌ను అడ్డుకున్న రైతులు ఆర్‌5జోన్‌ వ్యవహారంపై ఓ పక్క హైకోర్టులో విచారణ జరుగుతుండగా, మరోపక్క రాష్ట్ర ప్రభుత్వం ఆ ప్రాంతంలో జంగిల్‌ క్లియరెన్స్‌ కోసం పొక్లెయిన్లను పంపి రైతులతో కవ్వింపు చర్యలకు పాల్పడిరది. విషయం తెలుసుకున్న కృష్ణాయపాలెం రైతులు పెద్ద సంఖ్యలో అక్కడకు చేరుకుని ఆ పనులను అడ్డుకున్నారు. పొక్లెయిన్లను వెనక్కు పంపారు. వివేకానందరెడ్డి హత్య కేసును పక్కదారి పట్టించేందుకు ప్రభుత్వం ఈ కుట్రలకు పాల్పడుతుందంటూ రైతులు మండిపడ్డారు. రాజధాని ప్రాంత పేదల కోసం గత ప్రభుత్వం దాదాపు 5వేల ఇళ్లకు పైగా నిర్మించింది. వాటిని నాలుగేళ్లుగా లబ్ధిదారులకు అప్పగించకుండా పాడుపెట్టిన ఈ ప్రభుత్వం...ఇతర ప్రాంతాల్లోని పేదలకు ఈ భూములు ఇస్తుందా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు, ఈ ప్రాంత వ్యవసాయ కూలీలకు కౌలు, పెన్షన్లు సక్రమంగా ఇవ్వకుండా ఇబ్బంది పెడుతూ, పేదల పేరుతో ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు చేస్తున్న ప్రయత్నమే ఆర్‌5 జోన్‌ అని విమర్శించారు. పేదల పట్ల ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా, రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతుల ప్లాట్లను అభివృద్ధి చేసి అప్పగించాలని హితవు చెప్పారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img