Monday, January 30, 2023
Monday, January 30, 2023

వ్యవసాయం చేసేదెలా?

రాయితీని పునరుద్ధరించండి
ఆలస్యమైతే ‘చలో అసెంబ్లీ’
మహాధర్నాలో రావుల వెంకయ్య, ముప్పాళ్ల, కేవీవీ ప్రసాద్‌

విశాలాంధ్ర`గుంటూరు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తప్పుడు విధానాలతో రైతులు వ్యవసాయం చేసే పరిస్థితులు కనిపించటం లేదని ఏఐకేఎస్‌ జాతీయ ఉపాధ్యక్షుడు రావుల వెంకయ్య, సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ల నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేవీవీ ప్రసాద్‌ చెప్పారు. సూక్ష్మనీటి సేద్యపు పరికరాలు, వ్యవసాయ యంత్ర పరికరాలపై రాయితీని పునరుద్ధరించాలని ఆంధ్రప్రదేశ్‌ రైతుసంఘం అధ్వర్యంలో గుంటూరులో రాష్ట్ర మైక్రో ఇరిగేషన్‌ ఛైర్మన్‌, ఉద్యానశాఖ కమిషనర్‌ కార్యాలయం వద్ద సోమవారం మహాధర్నా నిర్వహించారు. కమిషనర్‌ కార్యాలయం నుంచి చుట్టుగుంట వరకు ప్రదర్శన జరిగింది. ఈ సందర్భంగా పోలీసులు, రైతులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. పోలీసు వలయాన్ని ఛేదించుకొని రైతులు కమిషనర్‌ కార్యాలయంలోకి వెళ్లి బైఠాయించారు. రాయితీపై యంత్ర పరికరాలు అందజేసి రైతాంగాన్ని ఆదుకోవాలని నినాదాలు చేశారు. అనంతరం రావుల వెంకయ్య మీడియాతో మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి అధికారం చేపట్టిన తరువాత రైతులకు ఇచ్చే రాయితీలపై కోతలు విధించారని విమర్శించారు. సున్నా వడ్డీ రాయితీ అమలు జరగడం లేదని, ఉచిత విద్యుత్‌కు మంగళం పాడే పరిస్థితి కనబడుతోందన్నారు. కొనుగోలు చేసిన పంటకు నగదు చెల్లింపులు నిలిపివేశారని విమర్శించారు.
ముప్పాళ్ల నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో 17 లక్షల హెక్టార్లలో సాగు అవుతున్న ఉద్యాన పంట ద్వారా రూ.46 వేల కోట్ల ఆదాయం వస్తున్నట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయన్నారు. అటువంటిది యంత్రాలపై రాయితీ అమలు జరపకపోవడం వలన ఉద్యాన రైతు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కంపెనీలకు, యంత్ర సరఫరాదారులకు రూ.1300 కోట్లు బకాయిలు ఉంటే వాటిని చెల్లించకుండా పదేపదే టెండర్లు పిలవడం వలన ప్రయోజనమేమిటని ప్రశ్నించారు. తక్షణమే నిధులు విడుదల చేసి బకాయిలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. నాడు వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ఉద్యాన పంటకు ఇతోధిక ప్రోత్సాహం అందించిందని, ఆయన తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఉద్యాన రైతుల ఇబ్బందులు గుర్తించకపోవడం శోచనీయమన్నారు. వ్యవసాయ యంత్రాలపై రాయితీల పునరుద్ధరణలో ఆలస్యం జరిగితే రైతులు ప్రభుత్వాన్ని నిలదీస్తారని హెచ్చరించారు.
కేవీవీ ప్రసాద్‌ మాట్లాడుతూ సేద్యపు పరికరాలు, వ్యవసాయ యంత్ర పరికరాలపై రాయితీని రాష్ట్ర ప్రభుత్వం స్థంభింప చేయడం వలన రాష్ట్రవ్యాప్తంగా 3 లక్షల మంది చిన్న, సన్నకారు రైతులు నష్టపోయారన్నారు. గతంలో ఐదెకరాల లోపు రైతులు(ఎస్సీ, ఎస్టీలకు) ఉచితంగా, ఇతరులకు 90 శాతం, 10 ఎకరాల వరకు ఉన్న రాయలసీమ, ప్రకాశం జిల్లాల రైతులకు 90 శాతం, కోస్తాంధ్ర ప్రాంత రైతులకు 70 శాతం, 10 ఎకరాలు పైబడిన రైతులకు 50 శాతం రాయితీతో పథకం అమలు జరిగేదని, ఇది ఎంతో ఉపయోగకరంగా ఉండేదన్నారు. ఇప్పుడు రాయితీలు అమలు చేయకపోవడం వలన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. కేంద్రం 35 శాతం రాయితీ చెల్లిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వకపోవడం వలన కేంద్రం నిధులు మురిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరచి యంత్ర పరికరాలపై రాయితీ పునరుద్ధరించేలా రానున్న అసెంబ్లీ సమావేశాలలో స్పష్టమైన ప్రకటన చేయాలని, లేనిపక్షంలో చలో అసెంబ్లీ కార్యక్రమానికి పిలుపునిస్తామని హెచ్చరించారు. అనంతరం మైక్రో ఇరిగేషన్‌ పీఓ హరినాథ్‌రెడ్డికి వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన అధికారులు డిసెంబరు నాటికి సమస్యలు పరిష్కరించి రాయితీలు పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి మల్నీడు యలమందరావు, సమితి సభ్యులు వీరారెడ్డి, గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ముసునూరు రమేశ్‌బాబు, ఉపాధ్యక్షుడు కొల్లి రంగారెడ్డి, కడప జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి చంద్ర, అధ్యక్షుడు ఆవుల వెంకట రమణ, గౌరవాధ్యక్షుడు ఎంవీ సుబ్బారెడ్డి, కర్నూలు జిల్లా రైతు నాయకులు జి.మాధవకృష్ణ, జి.బాలరాజు, కృష్ణా జిల్లా రైతుసంఘం నాయకులు మోతుకూరి అరుణ్‌కుమార్‌, రాయంకుల లక్ష్మణరావు, చలసాని నరేంద్ర, సీపీఐ కృష్ణా జిల్లా సహాయ కార్యదర్శి నార్ల వెంకటేశ్వరరావు, గుంటూరు జిల్లా నాయకులు ఎం.అమరలింగేశ్వరరావు, ఉలవలపూడి రాము, తాళ్లూరి బాబురావు, చండ్ర రామమోహన కొండలరావు, బీవీ రెడ్డి పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img