పెరిగిన కమర్షియల్ గ్యాస్ ధర
సిలిండర్‌పై రూ.103.50 పెంపు
న్యూదిల్లీ : కమర్షియల్ లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్పీజీ) సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. 19 కిలోల కమర్షియల్ సిలిండర్ ధర బుధవారం నుండి రూ.103.50 పెరిగింది. ఈ కేటగిరీకి చెందిన వంటగ్యాస్ ధరల పెరుగుదల నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. గతనెల ఒకటిన కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్లపై రూ.266 పెరిగిన విషయం తెలిసిందే. ఈ నెల మరో రూ. 103.50 పెంచింది. తాజా ధరల పెంపు అనంతరం కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధర దేశ రాజధాని దిల్లీలో రూ.2,101, ముంబైలో రూ. 2,051, కోల్‌కతాలో రూ. 2,174.50, చెన్నైలో రూ.2,234.50కి పెరిగింది. అంతకుముందు నవంబరు ఒకటో తేదీన కమర్షియల్ సిలిండర్ ధర పెరిగింది. కాగా…14.2 కిలోలు, 5 కిలోల గృహవినియోగ సిలిండర్ ధరలు మాత్రం స్థిరంగానే ఉన్నాయి. గృహ వినియోగదారులకు తాజా భారం నుంచి మినహాయింపు లభించినట్లైంది. గృహావసరాల కోసం వినియోగించే ఎల్పీజీ సిలిండర్ల రేట్లను యథాతధంగా కొనసాగిస్తోంది. ఈ రెండు నెలల కాలంలో 19 కిలోల వంటగ్యాస్ సిలిండర్‌పై రూ.369.50 పెరిగింది. ఈ ఏడాది మొదట్లో రూ.694గా ఉన్న గృహావసర ఎల్పీజీ వంటగ్యాస్ సిలిండర్ ధర ఇప్పుడు రూ.900 మార్క్ దాటింది. కాగా ఈ నెల 6వ తేదీన డొమెస్టిక్ ఎల్పీజీ గ్యాస్ కనెక్షన్ల ధరలను పెంచే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
ఆర్భాటాల అతిశయోక్తులు పతనం : రాహుల్
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వంపై కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ బుధవారం విరుచుకుపడ్డారు. వ్యాపార ప్రయోజనాల కోసం వినియోగించే వంట గ్యాస్ సిలిండర్ ధరను రూ.103.50 పెంచడంపై ఆగ్రహం వెలిబుచ్చారు. ఆర్భాటపు మాటల అతిశయోక్తులు పతనమయ్యాయని దుయ్యబట్టారు. రాహుల్ బుధవారం ఇచ్చిన ట్వీట్లో ‘ద్రవ్యోల్బణం ఎగబాకడంతో, ఆర్భాటపు మాటల అతిశయోక్తులు పతనమయ్యాయి’ అని ఎద్దేవా చేశారు.
కాగా, కాంగ్రెస్ నేత మనీష్ తివారీ లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇస్తూ..అత్యధిక ద్రవ్యోల్బణం రేటు, వంట గ్యాస్ సిలిండర్ ధర పెరగడంపై చర్చ జరపాలని కోరారు.