Friday, December 1, 2023
Friday, December 1, 2023

వ్యూహం మార్పు తక్షణావసరం

ఒక కుటుంబానికి ఒక టికెట్‌పై లోతైన చర్చ
ప్రారంభమైన కాంగ్రెస్‌ ‘చింతన్‌ శిబిర్‌’
మైనార్టీలపై బీజేపీ క్రూరత్వాన్ని ఎండగట్టిన సోనియా

కాంగ్రెస్‌ చింతన్‌ శిబిర్‌ శుక్రవారం ప్రారంభమైంది. వరుస ఎన్నికల పరాజయాలతో నిరాశలో కూరుకుపోయిన పార్టీకి పునరుత్తేజం, పూర్వవైభవం తీసుకురావడం, 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల నాటికి వ్యవస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ వేదికగా మూడు రోజుల పాటు ఈ మేథోమధన సదస్సు జరుగుతోంది.

న్యూదిల్లీ : కాంగ్రెస్‌ చింతన్‌ శిబిర్‌ శుక్రవారం ప్రారంభమైంది. వరుస ఎన్నికల పరాజయాలతో నిరాశలో కూరుకుపోయిన పార్టీకి పునరుత్తేజం, పూర్వవైభవం తీసుకురావడం, 2024లో జరిగే సార్వత్రిక ఎన్నికల నాటికి వ్యవస్థాగతంగా పార్టీని బలోపేతం చేయడమే లక్ష్యంగా రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ వేదికగా మూడు రోజుల పాటు ఈ మేథోమధన సదస్సు జరుగుతోంది. ఈ సమావేశంలో పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అగ్ర నేతలు రాహుల్‌, ప్రియాంకలతో పాటు వివిధ విభాగాల అధిపతులు, ఆఫీస్‌ బేరర్లు, కేంద్ర మాజీ మంత్రులు, ఎంపీలు, పీసీసీ అధ్యక్షులు, సీఎల్పీ నేతలు కలిపి మొత్తం 422 మంది సభ్యులు పాల్గొంటున్నారు. ఇప్పుడు వ్యూహాత్మక విధాన నిర్ణయాలు తక్షణావసరంగా కాంగ్రెస్‌ పార్టీ భావిస్తోంది. ‘చింతన్‌ శిబిర్‌’లో పార్టీని మూలాల నుంచి బలోపేతం చేసే దిశగా తీసుకోవాల్సిన విధాన నిర్ణయాలపై లోతైన చర్చ ప్రారంభమయింది. దేశవ్యాప్తంగా కోల్పోయిన పట్టును మళ్లీ చేజిక్కించుకునేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై సమాలోచనలతోపాటు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ ఇటీవల పార్టీకి ఇచ్చిన కార్యచరణపై కూడా చర్చ జరుగుతున్నట్లు సమాచారం. తొలిరోజు శుక్రవారం కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ ప్రారంభోపన్యాసం చేశారు. ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ‘కనీస ప్రభుత్వం, గరిష్ఠ పాలన’ అనే మోదీ మంత్రం దేశాన్ని శాశ్వత మత విభజనలో ఉంచడం, మైనారిటీల పట్ల క్రూరత్వం’గా ప్రవర్తించడం, రాజకీయ ప్రత్యర్థులను ‘బెదిరించడం’ అని స్పష్టంగా అర్థమైందని అన్నారు. మోదీ పాలన ఇకపై కూడా కొనసాగితే దేశం అనేక సవాళ్లను, ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. మతపరమైన విభజనను ఎదుర్కొని, దేశాన్ని పునర్నిర్మించాలనే లక్ష్యంతో మున్ముందు పని చేయాలని పార్టీ శ్రేణులకు ఆమె పిలుపు ఇచ్చారు. మరోవైపు, పార్టీని బలోపేతం చేసి, కార్యకర్తలను ఏకం చేసిన తర్వాతే కూటమి సమస్యలపై చర్చిస్తామని సమావేశం ప్రారంభానికి ముందు, పార్టీ సీనియర్‌ నాయకుడు మల్లికార్జున్‌ ఖర్గే తెలిపారు. ఇదిలాఉండగా, పార్టీ ‘పెద్ద మార్పులు’కు పార్టీ సిద్ధంగా ఉందని పార్టీ ప్రధాన కార్యదర్శి అజయ్‌ మాకెన్‌ తెలిపారు.
ఒక కుటుంబానికి ఒక టికెట్‌ నిబంధనపై కాంగ్రెస్‌లో పూర్తి స్థాయిలో ఏకాభిప్రాయం కుదిరిందన్నారు. ‘చింతన్‌ శిబిర్‌’ తర్వాత పార్టీలో పెద్ద ఎత్తున సంస్థాగత మార్పులు జరుగుతాయని చెప్పారు. సమావేశం ప్రారంభానికి ముందు సోనియా పార్టీ నాయకులు, ప్రతినిధులను ‘కీలకమైన సమాచారం లీకేజీని’ నివారించడానికి సమావేశం జరుగుతున్న ప్రాంగణం వెలుపల తమ ఫోన్లను ఉంచాలని కోరినట్లు ఆ వర్గాలు తెలిపాయి.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img