Sunday, October 2, 2022
Sunday, October 2, 2022

శాంతించిన కృష్ణా… గోదావరి

. ఎగువ ప్రాంతాల్లో తగ్గిన వరద ఉధృతి
. ముంపు ప్రాంతాల బాధితులకు కొనసాగుతున్న సహాయ చర్యలు
. ప్రకాశం బ్యారేజీ నుంచి 3 లక్షల 30 వేల క్యూసెక్కులు విడుదల

విశాలాంధ్ర బ్యూరో`అమరావతి : గత మూడు రోజులుగా తీర ప్రాంతాల ప్రజలను కంటిపై కునుకు లేకుండా చేసిన కృష్ణా, గోదావరి నదులకు వరద ఉధృతి క్రమేపీ తగ్గుముఖం పట్టడంతో అధికార యంత్రాంగం ఊపిరిపీల్చుకుంది. దాదాపు 5 లక్షల క్యూసెక్కుల వరదతో పోటెత్తిన ప్రకాశం బ్యారేజీ శనివారం తగ్గుముఖం పట్టింది. ఎగువనున్న పులిచింతల ప్రాజెక్టు నుంచి 3 లక్షల 31 వేల క్యూసెక్కులు వస్తుండగా, పాలేరు నుంచి 1,341, కీసర నుంచి 6,003 క్యూసెక్కుల నీరు వస్తోంది. బ్యారేజ్‌ ఐదు గేట్లను తొమ్మిది అడుగుల మేరకు, 65 గేట్లను ఎనిమిది అడుగుల మేరకు ఎత్తి మొత్తం 3,29,455 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఇది కాకుండా కాల్వలకు 14,517 క్యూసెక్కుల నీటిని ఇస్తున్నారు. కేఈబీకి 1,452, బందరు కాల్వకు 1,456, ఏలూరు కాల్వకు 1,457, రైవస్‌ కాల్వకు 4,118, కేడబ్ల్యూ కాల్వకు 6,034 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు కూడా ఇన్‌ఫ్లో తగ్గుముఖం పట్టింది. ప్రస్తుతం 4.25 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, దిగువకు 4 లక్షల 9 వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సాగర్‌ ప్రాజెక్టుకు చేరుతున్న ఈ వరద మొత్తాన్ని దిగువకు విడుదల చేస్తున్నారు. దిగువనున్న పులిచింతలకు 3 లక్షల 87 వేల క్యూసెక్కులు వస్తుండగా, 3 లక్షల 41 వేలు దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక శుక్రవారం రాత్రి వరకు గోదావరి ఉగ్రరూపం దాల్చిన నేపథ్యంలో ధవలేశ్వరం బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేసిన విషయం తెలిసిందే. అది శనివారం తగ్గుముఖం పట్టినప్పటికీ గోదావరికి రెండు వైపులా ఆరు జిల్లాలలో హై అలెర్ట్‌ ప్రకటించారు. ఏలూరు, అల్లూరి సీతారామరాజు, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లో అనేక ప్రాంతాలు ముంపునకు గురికావడంతో ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు ఆరు జిల్లాల అధికార యంత్రాంగం సిద్ధమయింది. కోనసీమ, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరిలోని దాదాపు 135 లంక గ్రామాలు ఇప్పటికే ముంపునకు గురయ్యాయి. ముంపు బాధిత ప్రాంతాల ప్రజలకు పడవలతో నిత్యావసరాలు పంపిణీ చేస్తున్నారు. వి.ఆర్‌.పురం మండలంలోని శ్రీ రామగిరి పూర్తిగా నీటిలో మునిగిపోయింది. వి.ఆర్‌.పురం సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ గోపాలకృష్ణ నేతృత్వంలోని పోలీసు బృందం పడవలో మూడు గంటలు ప్రయాణించి శ్రీరామగిరి గ్రామ ప్రజలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. అలాగే గోదావరి నదీ పరివాహక లంక గ్రామాల చుట్టూ వరదనీరు చేరడంతో పాటు ప్రధాన రహదారులన్నీ మునిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలోని సుమారు 40కు పైగా లంక గ్రామాలను వరదనీరు ముంచెత్తింది. కాజ్‌వేలన్నీ నీట మునిగాయి. అప్పనపల్లి, కనకాయలంక, ఎదురుబిడియం, కె.ఏనుగుపల్లి, అప్పనరామునిలంక కాజ్‌వేలు నీట మునగడంతో ప్రయాణాలు స్తంభించాయి. కోటిపల్లి, నర్సాపురం రేవుల్లో పంట్ల రాకపోకలు నిలిపివేశారు. అయినవిల్లి, పి.గన్నవరం మండలాల్లో 67 మందితో కూడిన ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు ముందుగా మోహరించాయి. అప్పనపల్లి బాలబాలాజీ దేవస్థానం చుట్టూ వరదనీరు రావడంతో దర్శనాలు నిలిపివేశారు. ఈ ఆలయంలో పెళ్లిళ్లు చేసుకోవాలని నిర్ణయించుకున్నవారు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ముమ్మిడివరం మండలంలోని అనేక లంక గ్రామాల్లోకి వరద నీరు ప్రవేశించింది. గురజాపులంక, గేదెల్లంక, చింతపల్లిలంకతో సహా అనేక గ్రామాల్లోకి వరదనీరు ప్రవేశించింది. గ్రామాల్లోకి వెళ్లే ప్రధాన రహదారులు, అంతర్గత రోడ్ల నుంచి వరద పోటెత్తడంతో ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. అల్లవరం మండలం పల్లిపాలెంలో మత్స్యకారుల ఇళ్లు నీట మునిగాయి.
కాట్రేనికోన మండలంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లోని సుమారు 25 ఇళ్లు నీట మునిగాయి. మరోవైపు తుంగభద్ర జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు తుంగభద్ర దగ్గర 33 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. తుంగభద్ర పూర్తి నీటిమట్టం 1,633 అడుగులు కాగా… ప్రస్తుతం 1632.28 అడుగులకు చేరింది. ప్రస్తుతం ఇన్‌ఫ్లో 1,23,659 క్యూసెక్కులు, ఔట్‌ ఫ్లో 1,00,349 క్యూసెక్కులుగా ఉంది. తుంగభద్ర పూర్తిస్థాయి నీటినిల్వ సామర్ధ్యం 105.788 టీఎంసీలకుగాను… ప్రస్తుతం నీటి నిల్వ సామర్ధ్యం 102.897 టీఎంసీలుగా నమోదయింది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విపత్తు నిర్వహణా మండలి పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తోంది.

సంబంధిత వార్తలు

spot_img

తాజా వార్తలు

spot_img