పరువు నష్టం కేసులో గుజరాత్ హైకోర్టుకు రాహుల్
అహ్మదాబాద్: పరువు నష్టం కేసులో తనకు విధించిన శిక్షను నిలిపివేయాలని కోరుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మంగళవారం గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు. తన స్టే పిటిషన్‌ను సూరత్ సెషన్స్ కోర్టు తిరస్కరించిన నేపథ్యంలో ఆయన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ‘మోదీ’ ఇంటిపేరుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో సూరత్ కోర్టు.. రాహుల్‌గాంధీకి రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ గతంలో తీర్పు చెప్పిన విషయం తెలిసిందే. ‘దొంగలందరికీ మోదీ అనే ఇంటిపేరే ఎందుకు ఉంటుందో?’ అని 2019 లోక్‌సభ ఎన్నికల ప్రచారం సందర్భంగా కర్నాటకలోని కోలార్‌లో రాహుల్ వ్యాఖ్యానించారని గుజరాత్‌కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేశ్ మోదీ సూరత్ కోర్టులో పరువునష్టం కేసు పెట్టారు. దీనిపై విచారణ చేపట్టిన ట్రయల్ కోర్టు రాహుల్‌కు రెండేళ్ల శిక్ష విధించింది. అలాగే పై కోర్టులో సవాల్ చేసేందుకు 30 రోజుల గడువు ఇచ్చింది. అప్పటి వరకు బెయిల్ మంజూరు చేసింది. ఇదే క్రమంలో రాహుల్‌పై ఎంపీగా అనర్హత వేటు పడిరది. అనంతరం రాహుల్ గాంధీ సూరత్ సెషన్స్ కోర్టును ఆశ్రయించారు. రెండేళ్ల జైలు శిక్షను నిలుపుదల చేయాలని, తనను దోషిగా తేలుస్తూ ఇచ్చిన తీర్పును సైతం నిలిపివేయాలని రెండు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై ఏప్రిల్ 3న విచారణ చేపట్టిన కోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. తదుపరి విచారణలో భాగంగా ఏప్రిల్ 13న రెండు పక్షాల వాదనలు విని 20వ తేదీన తీర్పు వెలువరించింది. తాజా తీర్పును సవాల్ చేస్తూ రాహుల్ గుజరాత్ హైకోర్టును ఆశ్రయించారు.